
జనసందోహం మధ్య జననేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర
సాక్షి, విశాఖపట్నం: జననేత రాకతో వాల్తేరు హోరెత్తిపోయింది. సాగర తీరానికి ఎగసిపడే అలలతో పోటీగా జననేత అడుగులో అడుగు వేసేందుకు జనకెరటాలు ఎగసి పడ్డాయి. అలల హోరుకు జనహోరు తోడైంది. బారులు తీరిన అభిమానులతో వాల్తేరురోడ్లు కిక్కిరిసిపోయాయి. పిల్లాపాపలతో రోడ్లపైకి తరలివచ్చిన జనసందోహం మధ్య అడుగుతీసి అడుగు వేయలేకపోయారు. రాత్రి బస నుంచి రాష్ట్రస్థాయి సమావేశం జరిగే బీచ్‌రోడ్డుకు కేవలం రెండుకిలోమీటర్లే...కానీ రెండు గంటలకు పైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో జనం వెల్లువెత్తారో చెప్పనక్కర్లేదు. రాజన్న బిడ్డ తమ ప్రాంతంలో బస చేశాడని తెలుసుకున్న ఆ ప్రాంత వాసులు ఆయనను చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు.
వెలకట్టలేని ప్రజల ప్రేమాభిమానాల మధ్య ప్రజాసంకల్పయాత్ర అప్రతిహాతంగా దూసుకెళ్తోంది. వేలాది అడుగులు ఒక్కటై పాదయాత్రికుడి వెంట నడవడంతో రహదారులు జన దారులయ్యాయి. పులివేషాలు, తప్పెటగుళ్లు, గరగనృత్యాలు, గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యాలు, కోలాటాలతో దారిపొడవునా స్వాగతం పలికారు. గడిచిన నాలుగున్నరేళ్లలో తాము పడుతున్న కష్టాలను జననేత దృష్టికి తీసుకొచ్చారు. ‘ఒక్క ఆరునెలలు ఓపిక పట్టండి మనందరి ప్రభుత్వం రాగానే మీ అందరి కష్టాలు తీరుతాయి. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాన’ంటూ జననేత వారికి భరోసా నిచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 260వ రోజు విశాఖ తూర్పు నియోజక వర్గపరిధిలో సాగింది. చినవాల్తేరు కనకమహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో బస చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం 8.50 గంటలకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి ఆల యం వద్ద బస చేసిన జనవేల్పును చూసేందుకు ఆలయం నుంచి రెల్లి వీధి రోడ్డు వరకు మహిళలు, వృద్ధులు, చిన్నారులు బారులు తీరారు. గంటలతరబడి క్యూలైన్‌లో నిల్చొని మరీ జననేతను చూసేందుకు పోటీపడ్డారు. ఆయనతో కరచాలనం చేసేందుకు.. సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు.
తూర్పు కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణలు వెంటరాగ జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చినవాల్తేరు కనకమహాలక్ష్మి ఆలయం నుంచి రెల్లివీధి, పీతల వీధి, చినవాల్తేరు మెయిన్‌రోడ్డు, ఈస్ట్ పాయింట్ కాలనీ, బీచ్‌రోడ్డు, పెదజాలరి పేట, లాసెన్స్‌బే కాలనీ వరకు పాదయాత్ర చేశారు. ఉదయం 8.50 గంటలకు బయల్దేరిన జగన్ బీచ్‌రోడ్‌లోని పెదజాలరిపేట ప్రాంతంలో ఉన్న విశాఖ ఫంక్షన్ హాలులో రాష్ట్ర స్థాయి సమన్వయకర్తల సమావేశానికి చేరుకున్నారు. సమావేశం అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి లాసెన్స్‌బే కాలనీ సమీపంలో బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు.
దారిపొడవునా సమస్యల వెల్లువ
చినవాల్తేరు పరిధిలోని సర్వే నెం.19–23లో జగన్నాథస్వామి ఆలయానికి చెందిన పూర్వీకుల నుంచి తమ ఆధీనంలో ఉన్న 71.01 ఎకరాల భూములను ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వుడా స్వాధీనం చేసుకుందంటూ పెదవాల్తేరుకు చెందిన ఉమ్మిడి రామిరెడ్డి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎంబీబీఎస్ మాదిరిగామాది కూడా నాలుగేళ్ల కాలపరిమితితోనే చదివామని, అందు వలన తమను అసిస్టెంట్ డాక్టర్లుగా నియమించాలని బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు జగన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీ కష్టం చూడలేక పోతున్నామన్నా మేమంతా ఈసారి మీకే ఓటేస్తామన్నా అంటూ పెద వాల్తేరుకు చెందిన యువకులు జగన్‌ను కలిసి మాట ఇచ్చారు. మళ్లీ వచ్చేటప్పుడు సీఎంగా రావాలంటూ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
పాదయాత్రలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర ప్రొగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రులు బలిరెడ్డి సత్యరావు, మత్స్యరాస బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, తిప్పల నాగిరెడ్డి, కె.కె.రాజు, కోలా గురువులు, అక్కరమాని విజయనిర్మల, అన్నంరెడ్డి అదీప్‌రాజు, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకరగణేష్, గొల్ల బాబూరావు, యు.వి.రమణమూర్తిరాజు, చెట్టి పల్గుణ, పీలా వెంకటలక్ష్మి, కాకర్లపూడి శ్రీకాంత్, కుంభా రవిబాబు,తెలిదేవర విజయచందర్, కొయ్య ప్రసాదరెడ్డి, తాడి విజయభాస్కరరెడ్డి, పక్కి దివాకర్, రవిరెడ్డి, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, పసుపులేటి ఉషాకిరణ్, చొక్కాకుల వెంకటరావు, కిరణ్‌రాజు, పూర్ణ పాల్గొన్నారు.
వైద్య విభాగం ఆధ్వర్యంలో వంద వైద్యశిబిరాలు..
వైఎస్సార్‌సీపీ వైద్యవిభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వంద వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం చినవాల్తేరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా, టైఫాయి డ్ జ్వరాలు తీవ్రరూపం దాల్చాయన్నారు. ఇటీవల ఉత్తరాంధ్రలో పలువురు జ్వరాలభారిన పడి మరణించారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి లేకపోవడంతో వ్యాధులను అరికట్టేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేవారే లేరన్నారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, డాక్టర్లు మెహబూబ్ షేక్, గణేష్‌రెడ్డి, ఎస్.ఎన్.భాను, ఉదయభాస్కర్, జిల్లా ఇంచార్జ్‌లు డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ ప్రతాప్ పాల్గొన్నారు.