గజగజ..! 

People Suffering With Elephants Attacks In Srikakulam - Sakshi

రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కి!

ప్రాణాంతకంగా మారిన ఒడిశా ఏనుగులు

దాడిలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

మారిన వాటి ధోరణితో తరలింపులో జాప్యం

సరిహద్దులోనే కొనసాగుతున్న ‘ఆపరేషన్‌ గజేంద్ర’

నందలకొండ దాటితే గండం గట్టెక్కినట్లే!

పంట, ప్రాణభయంతో గిరిజనుల బిక్కుబిక్కు

10.3.2018
టొంపటగూడ కుమార్‌ పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలం రాయల పంచాయతీ పరిధి టింపటగూడ గిరిజన గ్రామానికి చెందిన యువకుడు. సమీపంలోని పొన్నుటూరు వద్ద చెరకు తోటలోకి వెళ్లిన అతనిపై ఏనుగులు దాడిచేసి చంపేశాయి.

14.4.2018
పాతపట్నం నియోజకవర్గంలోనే మెళియాపుట్టి మండలంలో హీరాపురం గ్రామానికి చెందిన ఎం నీలమ్మ అనే గిరిజన వృద్ధురాలు ఎప్పటిలాగే జీడితోటలోకి వెళ్లింది. ఏనుగులు ఆమెపై దాడిచేసి ప్రాణాలు తీశాయి. 

15.4.2018
మెళియాపుట్టి మండలంలోనే పెద్దమడి గ్రామానికి చెందిన సవర రామారావు (47) ఎప్పటిలాగే జీడితోటలోకి పశువులను మేతకు తోలుకెళ్లాడు. అక్కడే ఉన్న ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపేశాయి. రెండ్రోజుల తర్వాత మంగళవారం అతని మృతదేహం బయటపడింది.

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : ఈ ముగ్గురి ప్రాణాలు తీసినవీ ఒడిశా ఏనుగులే. ఒక గున్న ఏనుగు సహా మొత్తం ఎనిమిది ఏనుగులు గత రెండు నెలలుగా జిల్లాలో వీరవిహారం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటనే కాదు ప్రాణాలనూ బలిగొంటున్నాయి. ఏ నిమిషంలో ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని సరిహద్దు ప్రాంతంలోని రైతులు, గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ ఏనుగులను ఒడిశా దారి పట్టించడానికి గత నెల 27వ తేదీన ప్రారంభించిన ఆపరేషన్‌ గజేంద్ర తొలుత  కొంతవరకూ సత్ఫలితాలను ఇచ్చింది. అయితే రెండు వారాలుగా ఒడిశా ఏనుగుల ధోరణి ప్రమాదకరంగా మారడంతో ఆ ఆపరేషన్‌ కాస్తఆలస్యమవుతోంది.

సరిహద్దుకు సమీపంలోనే...
ప్రస్తుతం ఒడిశా–ఆంధ్రా సరిహద్దు మండలమైన మెళియాపుట్టిలో రెండు వారాలుగా ఎనిమిది ఏనుగులు తిష్టవేశాయి. వాటిలో ఒకటి గున్న ఏనుగు. ఇది గాకుండా మిగిలిన ఏడు ఏనుగులు గత ఏడాది కాలంలో ఒడిశా నుంచి మన జిల్లాలోకి చొరబడటం, కొన్నాళ్ల తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం చేస్తుండేవి. అయితే ఎండాకాలం ప్రారంభంలో పలాస, మందస ప్రాంతంలోకి మరోసారి చొరబడిన ఈ ఏనుగులతో గున్న ఏనుగు కూడా తోడయ్యింది. ఆహారం, నీరు వెతుక్కోవడంతో పాటు ఆ చిన్న ఏనుగును రక్షించుకోవడంపైనే మిగతా ఏడు ఏనుగులు దృష్టి పెడుతున్నాయి. గత నెలాఖరులో ఆహారం, నీరు వెతుక్కుంటూ వంశధార నదీ వెంబడి ఆమదాలవలస రూరల్‌ ప్రాంతంలోకి వచ్చేశాయి.

వాటిని వెనక్కి మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్‌ గజేంద్ర పేరుతో చర్యలు చేపట్టారు. 50 మంది సుశిక్షిత సిబ్బందిని రంగంలోకి దించారు. అలాగే చిత్తూరు నుంచి గణేష్, జయంతి అనే కుకీ (శిక్షణ పొందిన) ఏనుగులను రప్పించారు. వాటి సహాయంతో ఒడిశా ఏనుగులను వెనక్కి మళ్లించడానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రారంభంలో సజావుగానే సాగింది. మెళియాపుట్టి వెళ్లిన తర్వాత మొండికేశాయి. జీడితోటలు, అరటితోటలతో పాటు చెరువుల్లో నీరు ఉండటంతో అక్కడే తిష్టవేశాయి. ఆపరేషన్‌ గజకు సంబంధించిన చర్యలతో పాటు వాటిని చూడటానికి వచ్చే ప్రజల హడావుడి, స్థానికులు టపాసులు, బాంబులను పేల్చి హోరెత్తించడంతో ఆ ఏనుగుల ధోరణిలో మార్పు వచ్చింది. అత్యంత ప్రమాదకరంగా మారాయి. తామున్న తోటల్లో ఎవరు వచ్చినా దాడిచేసి ప్రాణాలు తీస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆ విధంగానే బలయ్యారు. 

సరిహద్దులో గజగజ...
మెళియాపుట్టి మండలంలో నుంచి ఏనుగులను ఒడిశా సరిహద్దు దాటించాలంటే దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరమే ఉంది. మధ్యలోనున్న నందలకొండపైకి వాటిని మళ్లించాలి. ఈ మార్గంలో భరణికోట, భరణికోట కాలనీ, జక్కరివీధి, బంజీరు వంటి ఆరేడు గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జీడిమామిడి, అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆహారం సమృద్ధిగా లభిస్తుండటంతో పగలంతా ఆ తోటల్లోనే ఏనుగులు ఉండిపోతున్నాయి. సాయంత్రం పూట కాస్త అక్కడి నుంచి కదిలినా ఆ సమయంలో కుకీ ఏనుగులు అక్కడికి వెళ్లే పరిస్థితి ఉండట్లేదని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. అయితే అవి మైదాన ప్రాంతం వైపు రాకుండా కుకీ ఏనుగులను అప్రమత్తం చేస్తున్నారు. ఒడిశా ఏనుగుల ధోరణి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో బాణసంచా కాల్పులు కూడా ఆపేశారు. ప్రజలు ఏనుగులు ఉన్న తోటల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు చేస్తున్నారు. కానీ ఫలసాయం చేతికందే సమయంలో ఈ బెడద మొదలైందని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని సరిహద్దులోని గిరిజనులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో ఏనుగుల దాడిలో మృతులు... 

  • హిరమండలం మండలంలోని ఎగువ రుగడలో 2016 నవంబర్‌ 26వ తేదీన  ఏనుగు దాడిలో పాతపట్నం మండలం సోద గ్రామానికి చెందిన కేసరి తవిటయ్య(70) ప్రాణాలు కోల్పోయాడు. 
  • 2007 డిసెంబరు 14న సీతంపేట మండలం చినబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావును, దోనుబాయ గ్రామానికి చెందిన సిరిపోతుల మేరమ్మను కోదుల వీరఘట్టం వద్ద ఏనుగులు మట్టుపెట్టాయి. 
  • 2007 డిసెంబరు 19వ తేదీన కుంబిడి నాగరాజు అనే వీరఘట్టానికి చెందిన విలేకరిని హుస్సేన్‌పురం వద్ద దారుణంగా చంపేశాయి. ఇదే మండలం సంతనర్సిపురం వద్ద తెంటు శ్రీనివాసరావును, వీరఘట్టం మండలం చలివేంద్రి వద్ద కొండగొర్రె సాంబయ్యను కూడా ఇదే తరహాలో ఏనుగులు పొట్టనపెట్టుకున్నాయి. 

ఒడిశాకు తరలించే ప్రయత్నాలు...
ఎనిమిది ఏనుగులను ఒడిశాలోని అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాం. వాటి ధోరణి ప్రమాదకరంగా మారింది. అవి ఉన్న తోటల్లోకి వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నాం. కానీ కొంతమంది సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. అటవీ శాఖ సిబ్బంది అంతా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.   
– సీహెచ్‌ శాంతిస్వరూప్, జిల్లా అటవీశాఖాధికారి, శ్రీకాకుళం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top