వణికించిన గాలులు

People Suffered Due To Strong Winds - Sakshi

విజయనగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం

విరిగిపడిన చెట్ల కొమ్మలు... ఎగిరిపోయిన హోర్డింగ్‌లు

బొబ్బిలిలో కూలిన విద్యుత్‌ స్తంభాలు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి...

విజయనగరం గంటస్తంభం : జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయనగరం, బొబ్బిలి, గంట్యాడ, ఎస్‌.కోట, తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రజలు వణికిపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. జిల్లా కేంద్రంలో అరగంట పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. సాయంత్రం ఐదు గంటలకు వాతావరణం చల్లగా మారడంతో పట్టణ ప్రజలు సేదదీరారు. ఇంతలోనే ఆరున్నర గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకేసారి భారీగా ఈదురుగాలులు వీచాయి. సుడిగాలి మాదిరిగా గాలులు వీయడంతో ఎక్కడికక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు గాలిధాటికి కింద పడ్డాయి. పురిపాకలు, తాత్కాలిక షెడ్లు ఎగిరిపోయాయి. ఇదిలాఉంటే ఉరుములు, మెరుపులతో వాతావరణం భయంకరంగా మారింది. పట్టణంలో కలెక్టరేట్, కేఎల్‌.పురం, ఎన్సీఎస్‌ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడగా మిగతాచోట్ల ఒక మోస్తారు వర్షం పడింది. నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇదిలాఉండగా ఈదురుగాలులకు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు తెగిపోవడం.. వాటిపై కొమ్మలు పడడంతో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 9 వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

కూలిన విద్యుత్‌ స్తంభాలు
బొబ్బిలి : బొబ్బిలి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఈదురుగాలుల ధాటికి ప్రజలు భయాందోళన చెందారు.  ఈదురుగాలులకు కొన్ని చెట్లు నేలకూలగా మరికొన్ని చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. దీంతో బొబ్బిలి, చుట్టుపక్కల గ్రామాల్లో  విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బొబ్బిలి మండలంలోని ముత్తాయవలస, కమ్మవలస, పిరిడి.. బాడంగి మండలం గజరాయునివలస, డొంకినవలస, లక్ష్మీపురం, తెంటువలస... రామభద్రపురం, తెర్లాం మండలాల్లోని పలు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా మేఘం కుమ్ముకుంది. అప్పటివరకు తీవ్రమైన ఎండ కాయడంతో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రం వాతావరణం చల్లబడడంతో సేదదీరారు. అయితే ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. బొబ్బిలి ఏడీఈ లచ్చుపతుల సత్యనారాయణ తన సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసి పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. మరోపక్క చాలా ప్రాంతాల్లో చెట్లు, కూరగాయల పందిళ్లు కూలిపోయాయి. 

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
నియోజకవర్గంలోని బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రపురం మండలాలతో పాటు బొబ్బిలి పట్టణం, సీతానగరం మండలాల్లో ఈదురు గాలులకు 62కు పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. బొబ్బిలి రూరల్‌లో 18 హెచ్‌టీ, 14 ఎల్‌టీ విద్యుత్‌ స్తంభాలు..నవ్య జూట్‌మిల్‌ వైపు 5 హెచ్‌టీ.. గ్రోత్‌ సెంటర్‌వద్ద 6 హెచ్‌టీ స్తంభాలు నేలకొరిగినట్లు ఏడీఈ సత్యనారాయాణ తెలిపా రు. అలాగే సీతానగరం మండలం బూర్జి ప్రాంతంలో 8 హెచ్‌టీ, 14 ఎల్‌టీ.. బాడంగిలో రెండు స్తంభాలు పడిపోయినట్లు రూరల్‌ ఏడీఈ కిశోర్‌కుమార్‌ చెప్పారు.దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

నేలరాలిన మామిడి..
అసలే దిగుబడి లేక దిగాలుగా ఉన్న మామిడి రైతులను ఈదురుగాలులు నడ్డివిరిచాయి. ఉన్న కొద్దిపాటి కాయలు కూడా గాలులకు నేలరాలాయి. 

 పిడుగు పడి మహిళ మృతి 
బొబ్బిలి : మండలంలోని కొత్తపెంటకు చెందిన మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన బేతనపల్లి సావిత్రి (55) బుధవారం మధ్యాహ్నం చెరుకు నాటే  పనులకు వెళ్లింది. ఈ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఓ చెట్టు కిందికు చేరింది. ఈ సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు సావిత్రిని బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త సత్యనారాయణ, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఏఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 లుంబేసులో గిరిజనుడు ...
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని లుంబేసు గ్రామానికి చెందిన పత్తిక ప్రసాద్‌ (57) అనే గిరిజనుడు పిడుగుపాటుకు గురై  మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న తన జీడితోటలో జీడిపిక్కలు ఏరుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఇంటికి పయనమయ్యాడు. గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా పిడుగు పడడంతో ప్రసాద్‌ కుప్పకూలిపోయాడు. వెంటనే ఇతర కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు 108 సభ్యులకు కూడా సమాచారం చేరవేశారు. సకాలంలో 108 వాహనం రాకపోయేసరికి ఆటోలో ప్రసాద్‌ను భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు సాగర్‌ పరీక్షించి ప్రసాద్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top