‘హామీ’ల ఊసేది..! | People Not Beleiving Chandrababu | Sakshi
Sakshi News home page

‘హామీ’ల ఊసేది..!

Mar 11 2019 11:25 AM | Updated on Apr 4 2019 5:53 PM

People Not Beleiving Chandrababu - Sakshi

సాక్షి, నూజివీడు: గత ఎన్నికలప్పుడు దాదాపు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఒక్కటంటే ఒక్క హామీ కూడా సమగ్రంగా అమలు చేసింది లేదు. అందుకే ఏ పల్లె చూసినా, ఏ పట్టణం చూసినా నిన్ను నమ్మం బాబూ అంటూ నినదిస్తున్నాయి. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మున్సిపల్‌ పారిశద్ధ్య కార్మికుల క్రమబద్ధీకరణ, బాబొస్తే జాబు వస్తుంది, నిరుద్యోగ భృతి తదితర హామీలన్నీ గంగలో కలిపేయడంలో చంద్రబాబును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రైతు రుణమాఫీని ఐదు విడతలలో డబ్బులు జమ చేస్తామని చెప్పి రైతు కుటుంబాల్లో చిచ్చు పెట్టారు. బ్యాంకుల వడ్డీ చెల్లించకపోవడంతో మహిళల మెడలో పుస్తెలు తాకట్టులో పోయాయి. అనంతరం విడతల వారీగా విదుల్చుతున్న రుణమాఫీ డబ్బులు ఎందుకూ అక్కరకు రాకుండా ఉన్నాయి. దీనిపై ప్రజలు రగిలిపోతున్నారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను డిఫాల్టర్‌లుగా చేశారు. దీంతో గ్రూపులను మళ్లీ గాడిలో పెట్టేందుకు అపరాధ వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి తీసుకొచ్చారు.  

ఏ ముఖం పెట్టుకుని వస్తారు..!

 – దేవిరెడ్డి శివ శేషిరెడ్డి, రైతు, నూజివీడు 

రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఐదేళ్లవుతున్నా నేటికీ పూర్తి కాలేదు. రుణమాఫీ హామీని నమ్మి బ్యాంకుల్లో పెట్టిన బంగారం తీసుకురాలేదు. దీంతో బ్యాంకు అధికారులు వడ్డీలు కలుపుకుని నోటీసులు పంపించారు. ఇలా ఇంత వరకు నోటీసులు అందుకోలేదు. రుణమాఫీ మొత్తం చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ మా దగ్గరకు వస్తారు.                  

గుర్తున్నామా సీఎం గారూ..?

– కోట సుబ్బుమాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మార్పీస్‌

గత ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రచారానికి మిమ్మల్ని రానివ్వకుంటే మాదిగ జాతి అండగా ఉండి స్వాగతించింది. మీ పాదయాత్రలో మాల మహానాడు కార్యకర్తలు రాళ్లురువ్వితే కాపాడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు అండగా నిలుస్తామన్నారు.  నిన్ను నమ్మి ఏపీ రాష్ట్రంలోనూ పూర్తిగా మీకు సహకరించాం. నేటికీ మీరిచ్చిన హామీని మాత్రం నెరవేర్చలేదు. బాబూ ఇంక నిన్ను నమ్మం.

ఉద్యోగాలే లేవు

– రాజశేఖర్, నూజివీడు

బాబొస్తే జాబొస్తుందన్నారు...ఇంతవరకు యవతకు ఉద్యోగాలే లేవు.  ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు బాబు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మరోసారి ఓట్లంటూ వస్తే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

బాబుదంతా మోసం

–పిడతల ఝాన్సీ, ఎంపీటీసీ సభ్యురాలు యడ్లపాడు 

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామిని నమ్మి మోసపోయారు. మహిళా స్వయం సహాయక సంఘాల రుణమాఫీకి శఠగోపం పెట్టారు. అప్పటి వరకు వాయిదాలు కట్టనందుకు పలు సంఘాలు డీఫాల్టర్లుగా మారాయి. మరి కొన్ని సంఘాల నిర్వీర్యమయ్యాయి. ప్రభుత్వం 2015, 2016 సంవత్సరాల్లో రెండు విడతలుగా రూ.3 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. తీరా ఎన్నికలు సమీపించడంతో మళ్లీ మభ్యపెట్టేందుకు యత్నిస్తోంది. ఇదంతా ఎన్నికల కోసమేనని ప్రజలు గ్రహించారు. అందుకే మహిళలందరూ నిన్ను నమ్మం బాబూ అంటూ నినదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement