పింఛను..వంచను! | Pension Distribution Programme In Prakasam | Sakshi
Sakshi News home page

పింఛను..వంచను!

Jun 5 2018 10:23 AM | Updated on Jun 5 2018 10:23 AM

Pension Distribution Programme In Prakasam - Sakshi

ఒంగోలు టౌన్‌: సామాజిక భద్రత పింఛన్లలో అధికార పార్టీ ముద్ర కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా పింఛన్లు అందిస్తామని అధికారుల ప్రకటన కాగితాలకే పరిమితమైంది. ఒంగోలు నగర పరిధిలో 830 మందికి మంగళవారం పింఛన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తమకు పింఛన్లు వస్తాయని ఆశించిన ఎంతోమందికి నిరాశే మిగిలింది. అధికార పార్టీ అండదండలు ఉన్న వారికే పింఛన్లు మంజూరు చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అర్హులను పక్కన పెట్టి అధికారపార్టీ సూచించిన వారికే పింఛన్లు మంజూరు చేశారు. ఏకపక్షంగా పింఛన్లు మంజూరు చేయడంతో అర్హులైన అనేక మంది తమ పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

830/1635
ఒంగోలు నగరంలో ఈ ఏడాది జనవరిలో జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో 2700 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేసినట్లు మునిసిపల్‌ యంత్రాంగం వెల్లడించింది. ఇటీవల 1065 మందికి పింఛన్లు అందించారు. మరో 1635 మందికి పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. వారిలో 830 మందికి మంగళవారం పింఛన్లు మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ 830 మంది జాబితాను పరిశీలిస్తే అధికారపార్టీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. జన్మభూమి కమిటీలు ఆమోదించిన వారికే పింఛన్లు మంజూరు చేశారు. ఆ జన్మభూమి కమిటీలు కూడా డివిజన్ల వారీగా గతంలో మంజూరైన పింఛన్లను క్రాస్‌ చెక్‌ చేసి తమ పార్టీకి అనుకూలురైన వారి పేర్లను చేర్పించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పింఛన్ల మంజూరుకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అధికార పార్టీ ముద్ర లేకపోవడం, కొన్నిచోట్ల జన్మభూమి కమిటీలు డబ్బులు డిమాండ్‌ చేయడంతో వాటిని ఇవ్వలేని వారి పేర్లను మంజూరు జాబితా నుంచి పక్కన పెట్టేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2016 సంవత్సరంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులను పక్కన పెట్టి ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేయడం చూస్తుంటే లబ్ధిదారుల ఎంపిక ఏవిధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

పింఛన్‌ కోసం మూడేళ్ల నుంచి ఎదురుచూపు: కిష్టయ్య
పింఛన్‌ కోసం మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నా ఇంతవరకు మంజూరు చేయలేదని స్థానిక రాజాపానగల్‌ రోడ్డు 14వ అడ్డరోడ్డుకు చెందిన జి.కిష్టయ్య అనే 67 ఏళ్ల వృద్ధుడు వాపోయాడు. జన్మభూమి కార్యక్రమం జరిగిన ప్రతిసారీ పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం, పింఛన్ల జాబితాలో తన పేరు ఉందని చెప్పడం, పంపిణీ చేసే సమయంలో తనను పక్కన పెట్టడం జరుగుతూ వస్తోందన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తనకు పింఛన్‌ ఆసరాగా ఉంటుందని ఎదురు చూస్తుంటే మంజూరు చేయకుండా తిప్పుకుంటున్నారని వాపోయాడు. నగరంలో తనలాంటి వారు అనేకమంది ఉన్నారని తెలిపాడు. తనబోటి వారికి పింఛన్లు ఇవ్వకుండా తిప్పుకోవడం మంచిది కాదని వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement