
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ ఇబ్బందుల మధ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 2,837 గ్రామాలకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది జనవరిలోనే రూ. 204.75 కోట్లతో గ్రామీణ మంచినీటి ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు..
► ఈ వేసవిలో 2,055 గ్రామాల్లో పశువుల అవసరాలకు కూడా నీటి సరఫరా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది.
► 347 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని, ఆ నీటిని సమీప గ్రామాల్లోని మంచినీటి పథకాలకు అనుసంధానం చేశారు.
► సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో, గ్రామాల్లోని బావుల్లో పూడిక తీత వంటి అవసరాలకు రూ. 5.80 కోట్లు కేటాయింపు.
► మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్, ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ సభ్యులుగా కమిటీలను ప్రభుత్వం నియమించింది.
► భూగర్భ జలాలు కలుషితమైన చోట వైఎస్సార్ సుజల పథకంలో మంచినీటి ప్లాంట్ల ద్వారా క్యాన్ వాటర్ సరఫరాకు రూ. 46.56 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం అంచనాలు రూపొందించింది.
► రాష్ట్ర వ్యాప్తంగా రూ. 55.86 కోట్లతో సోలార్ స్కీంల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.