గ(పె)ద్దల కన్ను పడింది


  ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని పెద్దకుంటపై అధికార పార్టీ నేతల దృష్టి

  పక్కా ప్రణాళికతో 1.84 ఎకరాలు చేజిక్కించుకునే ఎత్తుగడ

  బహిరంగ మార్కెట్‌లో రూ.12 కోట్ల విలువైన స్థలాన్ని సొంతం చేసుకునే వ్యూహం

  నేటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదానికి అజెండాలో పొందుపర్చిన వైనం


 

 

కడప : అది వైఎస్ఆర్ జిల్లాలోని యర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి. పట్టణానికి గుండెకాయ లాంటి ప్రాంతం. రోడ్డు పక్కనే ఆర్టీసీ బస్టాండు. దాని పక్కలో దాదాపు రెండెకరాల ఖాళీ స్థలం. ఎప్పటి నుంచో ఉన్న ఆ స్థలంపై పెద్దల కన్ను పడింది. అభివృద్ధి పేరుతో స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ.12 కోట్లు పైబడి విలువైన ఆ స్థలాన్ని చేజిక్కించుకునేందు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కోసం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్ల పట్టణం పరిధిలోని సర్వే నంబర్ 606-బిలో 1.84 ఎకరాల మున్సిపల్ స్థలం ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.


ఎలాగైనా ఆ స్థలాన్ని చేజిక్కించుకోవాలని భావించిన అధికార పార్టీ ప్రముఖులు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మున్సిపాలిటిలో నిధులు లేవని, డెవలప్‌మెంట్ కింద ఆ స్థలాన్ని ఇస్తే బావుంటుందని తెరపైకి తెచ్చారు. భవన సముదాయం నిర్మించేందుకు అంగీకరించాలని కోరారు. ఆ మేరకు సైతం అనుమతి పొందారు. ఇదంతా తెరచాటున నడిపించారు. ఆపై బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదానికి తెరపైకి తెచ్చారు. ప్రజలకు  యోగ్యకరమైన పనులు చేసేందుకు అధికార పార్టీ ఉపయోగపడితే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అధికార పార్టీ నేతలు యత్నించడాన్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. స్వప్రయోజనాల కోసం కోట్లాది రూపాయల స్థలాన్ని ప్రభుత్వ పెద్దల సహకారంతో చాకచక్యంగా కొట్టేసేందుకు వ్యూహం పన్నారు.



 తెరపైకి టౌన్ ప్లానింగ్..

 సర్వే నంబర్ 606-బి లోని 1.84 ఎకరాల స్థలంలో బిఓటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌పర్) లేదా పీపీపీ (పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ద్వారా భవన సముదాయం నిర్మించేందుకు డెరైక్టర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, గుంటూరు వారు ప్రభుత్వ అనుమతి పొందారు. అయితే ఈ తతంగం వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.  



 అధికారమే పెట్టుబడి..

తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు అధికారమే పెట్టుబడిగా వ్యవహరిస్తూ అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఆ మేరకు ఆర్టీపీపీ, యర్రగుంట్ల, ముద్దనూరు పరిసర ప్రాంతాల్లో అక్రమార్జన యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓవైపు పెన్నానదిని కొల్లగొడుతూ, మరోవైపు క్రషర్లు ఏర్పాటు చేసి కొండలను పిండి చేస్తున్నారు. కేవలం అధికారమే పెట్టుబడిగా అక్రమ సంపాదనకు శ్రీకారం చుట్టారు. ఇవి చాలవన్నట్లు యర్రగుంట్ల నాలుగు రోడ్లు కూడలికి సమీపంలో ఉన్న దాదాపు రెండెకరాల స్థలంపై కన్ను వేశారు. అధికారపార్టీలోని మరో గ్రూపు అడ్డుతగలకుండా తెరవెనుక వాటాల పంపకాలు చేసినట్లు తెలుస్తోంది.


మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందడమే తరువాయిగా నిలిచింది. ఎలాగైనా కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చి ఆమోదం పొందేందుకు అధికార పార్టీ నేతలు తెరవెనుక మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రజలు ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యవతిరేకిస్తున్నారు. మున్సిపల్ స్థలంలో ప్రభుత్వమే భవన సముదాయాన్ని నిర్మించి ప్రజలకు కేటాయించాలని కోరుతున్నారు. నిబంధనల పేరుతో యర్రగుంట్ల ఎస్టీలకు (ఎరుకలు) 50 రోజుల పాటు తాగునీటి సరఫరా సైతం నిలిపేసిన అధికారులు.. అధికార పార్టీ ఆదేశిస్తే అత్యవసర సమావేశాలు నిర్వహించి కోట్లాది రూపాయాల స్థలాన్ని ధారాదత్తం చేసేందుకు ముందుకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

 

 ఈ స్థలం బడా బాబులకు దక్కకూడదు

పెద్దకుంట స్థలాన్ని మున్సిపల్ అధికారులు బడా బాబుల చేతికి అందించాలని చూస్తున్నారు. దీని వల్ల సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ స్థలాలు ఇలా బడా బాబులకు కట్టబెట్టడం సమంజసం కాదు.  

 - డాక్టరు సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత



 సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేయాలి.

కుంట స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని చూస్తే ఉద్యమిస్తాం. ఆ స్థలం సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. ఆర్టీసీ బస్టాండ్‌ను అభివృద్ధి చేయాలి. ప్రవేట్ వ్యక్తులకు ఏవిధంగా ఇస్తారు? దీనివల్ల మున్సిపాలిటీ వృద్ధికి అంతరాయం కల్గుతుంది.        - బయన్న, సీపీఎం జిల్లా నేత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top