breaking news
Peddakunta
-
గ(పె)ద్దల కన్ను పడింది
ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని పెద్దకుంటపై అధికార పార్టీ నేతల దృష్టి పక్కా ప్రణాళికతో 1.84 ఎకరాలు చేజిక్కించుకునే ఎత్తుగడ బహిరంగ మార్కెట్లో రూ.12 కోట్ల విలువైన స్థలాన్ని సొంతం చేసుకునే వ్యూహం నేటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదానికి అజెండాలో పొందుపర్చిన వైనం కడప : అది వైఎస్ఆర్ జిల్లాలోని యర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి. పట్టణానికి గుండెకాయ లాంటి ప్రాంతం. రోడ్డు పక్కనే ఆర్టీసీ బస్టాండు. దాని పక్కలో దాదాపు రెండెకరాల ఖాళీ స్థలం. ఎప్పటి నుంచో ఉన్న ఆ స్థలంపై పెద్దల కన్ను పడింది. అభివృద్ధి పేరుతో స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. బహిరంగ మార్కెట్లో రూ.12 కోట్లు పైబడి విలువైన ఆ స్థలాన్ని చేజిక్కించుకునేందు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం కోసం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్ల పట్టణం పరిధిలోని సర్వే నంబర్ 606-బిలో 1.84 ఎకరాల మున్సిపల్ స్థలం ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎలాగైనా ఆ స్థలాన్ని చేజిక్కించుకోవాలని భావించిన అధికార పార్టీ ప్రముఖులు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మున్సిపాలిటిలో నిధులు లేవని, డెవలప్మెంట్ కింద ఆ స్థలాన్ని ఇస్తే బావుంటుందని తెరపైకి తెచ్చారు. భవన సముదాయం నిర్మించేందుకు అంగీకరించాలని కోరారు. ఆ మేరకు సైతం అనుమతి పొందారు. ఇదంతా తెరచాటున నడిపించారు. ఆపై బుధవారం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదానికి తెరపైకి తెచ్చారు. ప్రజలకు యోగ్యకరమైన పనులు చేసేందుకు అధికార పార్టీ ఉపయోగపడితే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అధికార పార్టీ నేతలు యత్నించడాన్ని పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. స్వప్రయోజనాల కోసం కోట్లాది రూపాయల స్థలాన్ని ప్రభుత్వ పెద్దల సహకారంతో చాకచక్యంగా కొట్టేసేందుకు వ్యూహం పన్నారు. తెరపైకి టౌన్ ప్లానింగ్.. సర్వే నంబర్ 606-బి లోని 1.84 ఎకరాల స్థలంలో బిఓటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్పర్) లేదా పీపీపీ (పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) ద్వారా భవన సముదాయం నిర్మించేందుకు డెరైక్టర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, గుంటూరు వారు ప్రభుత్వ అనుమతి పొందారు. అయితే ఈ తతంగం వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారమే పెట్టుబడి.. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు అధికారమే పెట్టుబడిగా వ్యవహరిస్తూ అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఆ మేరకు ఆర్టీపీపీ, యర్రగుంట్ల, ముద్దనూరు పరిసర ప్రాంతాల్లో అక్రమార్జన యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓవైపు పెన్నానదిని కొల్లగొడుతూ, మరోవైపు క్రషర్లు ఏర్పాటు చేసి కొండలను పిండి చేస్తున్నారు. కేవలం అధికారమే పెట్టుబడిగా అక్రమ సంపాదనకు శ్రీకారం చుట్టారు. ఇవి చాలవన్నట్లు యర్రగుంట్ల నాలుగు రోడ్లు కూడలికి సమీపంలో ఉన్న దాదాపు రెండెకరాల స్థలంపై కన్ను వేశారు. అధికారపార్టీలోని మరో గ్రూపు అడ్డుతగలకుండా తెరవెనుక వాటాల పంపకాలు చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందడమే తరువాయిగా నిలిచింది. ఎలాగైనా కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చి ఆమోదం పొందేందుకు అధికార పార్టీ నేతలు తెరవెనుక మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రజలు ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యవతిరేకిస్తున్నారు. మున్సిపల్ స్థలంలో ప్రభుత్వమే భవన సముదాయాన్ని నిర్మించి ప్రజలకు కేటాయించాలని కోరుతున్నారు. నిబంధనల పేరుతో యర్రగుంట్ల ఎస్టీలకు (ఎరుకలు) 50 రోజుల పాటు తాగునీటి సరఫరా సైతం నిలిపేసిన అధికారులు.. అధికార పార్టీ ఆదేశిస్తే అత్యవసర సమావేశాలు నిర్వహించి కోట్లాది రూపాయాల స్థలాన్ని ధారాదత్తం చేసేందుకు ముందుకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థలం బడా బాబులకు దక్కకూడదు పెద్దకుంట స్థలాన్ని మున్సిపల్ అధికారులు బడా బాబుల చేతికి అందించాలని చూస్తున్నారు. దీని వల్ల సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ స్థలాలు ఇలా బడా బాబులకు కట్టబెట్టడం సమంజసం కాదు. - డాక్టరు సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేయాలి. కుంట స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని చూస్తే ఉద్యమిస్తాం. ఆ స్థలం సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి. ఆర్టీసీ బస్టాండ్‌ను అభివృద్ధి చేయాలి. ప్రవేట్ వ్యక్తులకు ఏవిధంగా ఇస్తారు? దీనివల్ల మున్సిపాలిటీ వృద్ధికి అంతరాయం కల్గుతుంది. - బయన్న, సీపీఎం జిల్లా నేత -
ఆ బైపాస్ రోడ్డు.. ఆ ఊరికి పీడకల
హైదరాబాద్: అది నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు. ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం, సురక్షితంగా ప్రయాణించడం కోసం ఆరేళ్ల క్రితం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ రోడ్డుపై ప్రయాణించడమంటే ప్రయాణికులకు, వాహనదారులకు ఎంతో సరదా. వాహనాలు యమ స్పీడుతో దూసుకెళ్తుంటాయి. పెద్దకుంట తాండా వాసులకు మాత్రం ఈ రోడ్డు దాటడం ప్రాణగండం. ఈ రోడ్డు వారికి మృత్యుకూపం వంటిది. ఎందరో మహిళలను వితంతువులుగా మార్చిన రోడ్డు ఇది. మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దకుంట విషాదగాథ ఇది. 2006లో ఎన్ హెచ్ ను విస్తరించారు. పెద్దకుంట వాసులకిది పీడకలను మిగిల్చింది. పెద్దకుంటకు వెళితే ఎక్కువగా మహిళలు, పిల్లలు, వృద్ధులు కనిపిస్తారు. మగవాళ్లు కనిపించడం తక్కువ. ఎందుకంటే బైపాస్ రోడ్డు 35 మంది మగవాళ్లను మింగేసింది. రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు బలియ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం విషాదకరం. ఓ మహిళ తండ్రి, భర్త, సోదరుడిని కోల్పోయింది. దీంతో ఆ కుటుంబం మగదిక్కు లేకుండాపోయింది. ఆ ఊరిలో ఇలాంటి కుటుంబాలెన్నో. . రోడ్డు దాటడం కోసం ఫుట్ బ్రిడ్జి లేదా టన్నెల్ నిర్మించాలని స్థానికులు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఊరికి ఎందరో వచ్చారు.. ఫొటోలు, వీడియోలు తీసుకుని పోయారు.. కానీ ఒక్కరూ సాయం చేయలేదు అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. -
మృత్యు తాండవం
ఈ తండాల మట్టి తీసుకెళ్లి రోడ్డు వేశారు. ఇప్పుడు ఆ తండాల్లో మట్టి మిగల్లేదు.. అవును.. ఆ రోడ్డు మట్టినంతా మింగేసింది. మనిషిని ఖననం చేసేటంత మట్టిని కూడా మిగల్చలేదు... నిజానికి హైవే అన్నది ప్రగతికి పునాది కావాలి... కాని పెద్దకుంట, ధన్సింగ్ తండాలకు అది సమాధి అయింది హైవేల మీద తరచుగా సైన్‌బోర్డులు చూస్తూ ఉంటాం.. అతి వేగం ప్రాణాంతకం.. వేగం కన్నా ప్రాణం మిన్న.. అని! ఇది నడిపేవారికి హెచ్చరిక... కానీ ఇక్కడ అది నడిచేవారికి మరణశాసనం అవుతోంది! మృత్యు‘తాండ’వం అవుతోంది. ఈ చావు లెక్కలకు ఆ హైవే దేశంలోనే అతిపెద్ద మైలురాయిగా నిలుస్తోంది... అది ఊరు కాదు. వల్లకాడు. ఇది ఆగ్రహం కాదు. వాస్తవం. ఊరు ఊరంతా నెత్తుటి ప్రవాహమే అయితే, చిన్నా పెద్దా అందరినీ మృత్యువు కాటేస్తే చివరకు ఊరే వల్లకాడవుతుంది. ఒక్కో యింట్లో ఇద్దరూ, ముగ్గురూ... నలుగురూ... అక్కడ చనిపోయిన వారిని పూడ్చిపెట్టేందుకు అటు ఆరు, ఇటు మూడడుగుల జాగా కూడా మిగల్లేదు. కానీ అక్కడ ఇళ్ళన్నీ మనుషుల్ని కోల్పోయి మట్టిదిబ్బలుగా మారాయి. ఇళ్లకు తాళాలు తప్ప మానవ సంచారం కనిపించదు. బిడ్డల పొట్టనింపేందుకు భర్తల శరీరాలను ఛిద్రం చేసిన నెత్తుటి రహదారిపైనే స్త్రీలు తమ శరీరాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్‌కి కూతవేటు దూరంలోని మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కి దగ్గరలోని కొత్తూరు మండలం హైవే పక్కనే వున్న పెద్దకుంట తండా, ధన్సింగ్ తండాల పరిస్థితి. ఆ తండాలకు వెళితే వృద్ధులు, స్త్రీలు తప్ప పురుషులు కనిపించరు. వాళ్ళంతా ఒకే చోట, జాతీయ రహదారిని దాటుతుండగా యాక్సిడెంట్లో చనిపోయినవారే. సహజంగా రహదారుల్లో జరిగే ప్రమాదాలను నివారించడం కష్టమే కావచ్చు. కానీ ఒకే ప్రదేశంలో, ఒకే తండాకి చెందిన వారు పదే పదే యాక్సిడెంట్లో చనిపోతున్నారంటే దానర్థం ఎక్కడో పొరపాటు జరుగుతున్నట్టే. ఆ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు. మానని గాయాలు శాంతికి నలుగురు కొడుకులు. పదేళ్ల క్రితం పెద్ద కొడుకు మల్లేష్, ఆ తర్వాత మూడేళ్లకు రెండోవాడు రవి, మిగిలిన ఇద్దరు కొడుకులు శంకర్, గోపాల్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ బాధతోనే భర్త పోయాడు. జబ్బుతో శాంతి కాళ్ళు చచ్చుబడిపోయాయి. నడవలేదు, నించోలేదు. ఇంత ముద్దపెట్టే దిక్కులేక జీవచ్ఛవంలా బతుకీడుస్తోంది. పదహారేళ్ల శారద భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటికే ఆమెకు ఓ కొడుకు. మామ పంచన బతుకుతోంది. ఆర్నెల్ల క్రితం మామ కిషన్‌కి కూడా యాక్సిడెంట్ అయ్యింది. అతనిప్పుడు నడవలేడు. గాయాలకు మందులేక ఇంకా రక్తమోడుతూనే వున్నాయి. రేషన్‌కార్డు కూడా లేకుండా బతికేదెలా ప్రశ్నిస్తోంది శారద, తన జీవితంలోని విషాదానికి కారకులెవరో తెలియక. ఇదే తండాకు చెందిన కొర్ర నేజి అనే మహిళ భర్త, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ బాధ భరించలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉండే ధైర్యం చేయలేక రెండిళ్ళకి తాళాలు వేసి, భర్త చనిపోయిన హస్లి అనే ఆమె దగ్గర ఉంటోంది. ‘చిన్నపిల్లలున్నారు... రేషన్ కార్డయినా యిప్పించండం’టూ వేడుకుంటోంది. ఎందుకీ విషాదం... ధన్సింగ్, పెద్దకుంట తండాల నుంచి ఏ పనికి బయటకు వెళ్ళాలన్నా రహదారిని దాటాల్సిందే. అక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికలు ఉండవు. సాయంత్రం అయ్యిందంటే చీకట్లో మలుపు అసలే కనిపించదు. 140, 120 స్పీడుతో వెళ్ళే వాహనదారులకు రోడ్డుదాటుతున్న వారు దగ్గరకొచ్చేంత వరకు కనిపించరు. పొలాల్లోనుంచి జనం పూర్తిగా రోడ్డుపైకి వచ్చే వరకు ఎత్తై రహదారిపైన ఏ వాహనాలొస్తున్నాయో కనిపించదు. నెత్తుటి దారిలోనే చిన్నారుల పాదముద్రలు... పనికే కాదు, పాఠశాలకు వెళ్ళాలన్నా రక్తసిక్తమైన రహదారులను దాటుకుంటూ భయం భయంగా వెళ్ళాల్సిందే. ప్రైమరీ స్కూల్లో చదువు అయిపోయాక ఆ చిన్నారులను హైస్కూల్‌కి పంపాలంటే ఆ దారి తప్ప వేరే దారి లేదు. చిన్నారులకు ఏ రోజు ఏం జరుగుతుందోనని ఆ తండాల జనం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. అందుకే పిల్లలు బడికి దూరంగా తండాల్లోనే ఉంటున్నారు. ఏం జరుగుతోంది? హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో జరిగిన యాక్సిడెంట్లను పరిశీలిస్తే... 2010లో 41 మంది, 2011లో 39 మంది, 2012లో 39 మంది, 2013లో 47 మంది, 2014లో 61 మంది చనిపోయారు. 2015 జనవరి నుంచి ఈనెల 30 వరకు ఈ మండలంలో జరిగిన యాక్సిడెంట్లు 30, ఇందులో 19 మంది మరణిస్తే, 20 మంది క్షతగాత్రులయ్యారు. అయితే పైన వివరించిన లెక్కల్లో అత్యధిక శాతం పెద్దకుంట తండా, ధన్ సింగ్తండాకి చెందిన వారేనన్నది లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వం చెబుతున్నవి. పోలీస్ రికార్డుల్లోకి ఎక్కని యాక్సిడెంట్లెన్నో చెప్పడం కష్టం. గత్యంతరం లేక... ఇంటి పెద్ద దిక్కు చనిపోతే, గత్యంతరం లేక పడుపువృత్తిలోకి దిగుతున్నారు ఇక్కడి స్త్రీలు. ఒక్కో ఇంట్లో ముగ్గురు పిల్లలు ముసలి వాళ్ళూ కలుపుకొని ఐదారుగురు వుంటే వాళ్ళకిస్తోంది 12 కేజీల రేషన్ బియ్యం. ‘ఎలా సరిపోతాయ’ని ప్రశ్నిస్తున్నారు. పడుపు వృత్తిని ఎంచుకున్న వీరి జీవితంలో భద్రత గాలిలో దీపమే. ఎలాంటి రక్షణా లేని వారి జీవితాలలో పొంచి వున్నది పెనుభూతమే. హెచ్.ఐ.వి లాంటి వ్యాధుల నిర్ధారణ కోసం చేసే వైద్యపరీక్షలేవీ వీరికి జరపకపోవడం విచారకరం. ప్రమాదాలను నివారించాలి... తండాల నుంచి నేరుగా హైవే పైకి ఎక్కకుండా లింక్ రోడ్డు వేయడం ద్వారా ప్రమాదాలు నివారించొచ్చు. రోడ్డు దాటే దగ్గర ప్రమాద హెచ్చరికలు, హైమాస్ట్ లైట్లు అమర్చాలి. స్టాపర్స్, సేఫ్టీ గార్డ్స్ పెట్టాలి. రహదారి మధ్యలో వున్న డివైడర్ పై చెట్లు లేకపోవడం వల్ల ఎదురెదురుగా వస్తున్న వాహనాల లైట్లు కళ్ళల్లో పడుతుంటాయి. యాక్సిడెంట్లకి మద్యం కూడా కారణమే. వీటికి తోడు జిల్లాలో ప్రత్యేకించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ లేదు. లా అండ్ ఆర్డర్ పోలీసులే ట్రాఫిక్‌నీ చూసుకోవాలి. దీనివల్ల ప్రత్యేకించి నిధులు కూడా జిల్లా పోలీసు యంత్రాంగానికి ఉండవు. ట్రాఫిక్ ఆంక్షలను అతిక్రమించినందుకు వసూలు చేసినదంతా ప్రభుత్వ ఖజానాకే పోతోంది. దీనివల్ల ఏ చర్యలు తీసుకోవాలన్నా జిల్లా అధికారులకు అవకాశం లేదన్నది కొందరి వాదన. టోల్ గేట్ లో హైదరాబాద్ నుంచి అడ్డాకుల వరకు 24 గంటల్లో 6 నుంచి 8 లక్షల పైచిలుకే ఆదాయం వస్తోంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు పెట్టాలని టోల్గేట్ యాజమాన్యానికీ. జాతీయ రహదారుల అధికారులకు ఎన్నో విజ్ఞాపనలు చేసారు. ఎవ్వరూ స్పందించలేదు. కనీసం హైమాస్ట్ లైట్లు కూడా పెట్టలేదు. - టి.జి.శ్రీనివాస్, లెక్చరర్ జాతీయ రహదారి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రజలు ఆందోళనలు చేశారు. అనేక సందర్భాల్లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. టోల్ గేట్ యాజమాన్యాన్ని అడిగితే అది పంచాయితీ పరిధిలోనిదంటున్నారు. కానీ జాతీయ రహదారిపై భద్రతా చర్యలు చేపట్టే అధికారం మాకు లేదు. చేసేది లేక చేజేతులా ప్రమాదాలను ఆహ్వనిస్తున్నారు తండా ప్రజలు. - కొమ్ము క్రిష్ణ, నందిగామ గ్రామ సర్పంచ్