టాయిలెట్స్‌ వద్ద పసికందును వదిలి..

Parents Left Girl Child In Train At Tirupati - Sakshi

సంతానలేమితో బాధపడుతున్న వారెందరో ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత గర్భం దాల్చికు బిడ్డజన్మనిస్తే తమ ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకుంటూ మురిసిపోయే వారు కోకొల్లలు. అయితే ఆరోగ్యంగా ఉన్నా ఓ పసికందును రైల్లో వదిలేశారు. ఆడ శిశువనో.. తమకు భారమని తలచి వదిలేశారో..లేదా ఏడుకొండల వాడే పసికందుకు దారి చూపుతాడోనని తెలియదుగానీ..అదృష్టం బావుండి ఆ పసికందు రుయా ఒడికి చేరింది.

సాక్షి, తిరుపతి అర్బన్‌ :  రైలులోని టాయిలెట్స్‌ వద్ద పసికందును వదిలిపెట్టిన ఘటన శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో వెలుగులోకి వచ్చింది. వివరాలు..తిరుపతి రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం 1.30గంటలకు కోయంబత్తూరు రైలులో వచ్చింది. ప్రయాణికులు అందరూ దిగి వెళ్లాక పారిశుధ్య కార్మికులు బోగీలను శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఓ బోగీలోని టాయిలెట్స్‌ వద్ద పసికందు ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూశారు. నెలరోజుల వయస్సు ఉన్న ఓ ఆడశిశువును గుర్తించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా అక్కడ పడుకోబెట్టి వదిలేసి వెళ్లారని గ్రహించడానికి అట్టే సమయం పట్టలేదు. ఆ పసికందును ఎత్తుకుని లాలించారు. వెంట నే రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రగతి ట్రస్ట్‌ చైల్డ్‌లైన్‌–1098  పోలీసుల సహకారంతో ఆ బిడ్డను అందుకుంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం చేర్పించింది. మరోవైపు పోలీసులు ఆ పసికందు తల్లిదండ్రులున్నారేమోనని రైల్లోనే కాకుండా స్టేషన్‌ ప్రాంతంలో గాలించారు. మైక్‌లో కూడా అనౌన్స్‌మెంట్‌ చేశారు. ఈలోపు పాపకు పాలు సైతం పట్టించారు. అయితే ఎవరూ ఆ పసికందు కోసం వారిని సంప్రదించలేదు.

ఇక చేసేదేమీ లేక చిత్తూరులోని బాల ల సంరక్షణ సమితి నిర్వాహకులను సంప్రదించారు. శనివారం రుయా ఆస్పత్రి అధికారులు పాపకు సంబం ధించి వైద్యపరీక్షల ప్రక్రియ పూర్తి చేసి చిత్తూరు బాలల సంరక్షణ సమితికి అప్పగించనున్నారు. వైద్యపరీక్షల్లో ఆ పసికందు ఏమైనా అనారోగ్యంతో బాధపడుతోందా? అనేది తేలాల్సి ఉంది. ఇక  బోసినవ్వులతో పసికందు అందరినీ ఆకర్షిస్తోంది. ఇదలా ఉంచితే,  రైలు కోయంబత్తూరు నుంచి తిరుపతికి చేరేలోపు పలు స్టాపింగ్స్‌ ఉన్నాయి.ఈ పసికందును తీసుకుని ఏ రైల్వేస్టేషన్‌లో ఎక్కి ఉంటారో తెలుసుకునే ప్రయత్నాల్లో రైల్వే పోలీసులు పడ్డారు. ఆయా రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఈ ఏదేని క్లూ లభిస్తోందేమోననే దిశగా యోచిస్తున్నారు. ప్రయాణికులు అందరూ దిగిన తర్వాతే పసికందును టాయిలెట్‌ వద్ద వదలి వెళ్లి ఉంటారని, ఒకవేళ పసికందును అపహరించి తీసుకెళ్లేందుకు వీలుకాక ఇక్కడ వదిలేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలేమిటో తేలాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top