పిల్లలను కనిపెట్టాలి ఓ కంట..!

Parents Focus on Childrens Play Out Side This Lockdown Time - Sakshi

బడి లేకపోవడం, లాక్‌డౌన్‌ సడలింపులతో..

ఆటల్లో మునిగి తేలుతున్న చిన్నారులు

సరదాకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్న వైనం

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

ప్రొద్దుటూరు క్రైం : పిల్లలకు ఆటలంటే ఎంతో సంతోషం. వాటిలోనే మునిగి తేలుతుంటారు. తోటి వారితో కలిసి ఆడుకోవడం ఆనందం. అయితే సరదా మాటున ప్రమాదం పొంచి ఉంది. తెలిసి తెలియని వయసులో ప్రమాదాన్ని ఊహించలేకపోతున్నారు. వాటి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎంత పనుల్లో ఉన్నా.. పిల్లలను ఓ కంట కనిపెట్టి ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఫలితంగా సుమారు మూడున్నర నెలల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో కూడా.. చెప్పలేని పరిస్థితి. ఆగస్టు 15 తర్వాత విద్యాసంస్థలు తెరిచే విషయమై నిర్ణయం చెబుతామని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం సుమారు ఐదు నెలల పాటు మూత పడినడినట్లుగా అంచనాకు రావచ్చు.  స్నేహితులతో కలిసి..

లాక్‌డౌన్‌ సడలింపులతో పెద్దలు పనులకు వెళ్తున్నారు. ఇదే అదునుగా పిల్లలు బయట తిరుగుతున్నారు. ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. ఎప్పుడూ ఇంట్లో ఉండటం కష్టంగా భావించి.. రోడ్డు పైకి వస్తున్నారు. పని ఉన్నా లేకున్నా స్నేహితులతో కలిసి తిరుగుతున్నారు. వీధులు, ప్రధాన రోడ్లు, సమీపంలోని వాగులు, వంకల వద్ద విహారం చేస్తున్నారు. సరదాకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల కదలికలపై దృష్టి సారించాలి. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చెప్పి వెళ్లేలా అలవాటు చేయాలి. ఎక్కడికి వెళ్తున్నది, ఎప్పుడు వచ్చేది చెప్పేలా చూడాలి. ఇతర ప్రాంతాలకు ఒంటరిగా పంపించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయటికి పంపించడం కూడా అంత శ్రేయష్కరం కాదని వారు పేర్కొంటున్నారు. పిల్లలతో కొంత సమయాన్ని వెచ్చించి, వారికి పాఠాలు చెబుతూ, వాళ్ల సందేహాలను నివృత్తి చేయాలని చెబుతున్నారు. 

జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు
జిల్లాలో ఆటపాటల్లో మునిగి కొందరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వాటిలో కొన్ని..
సింహాద్రిపురం మండలంలోని వై.కొత్తపల్లెలో సునియాజ్‌ (8) అనే చిన్నారి మరో పాపతో కలిసి కాలువ వద్ద ఆడుకుంటుండేది. ఈ క్రమంలో సునియాజ్‌ ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోగా స్థానికులు బయటికి తీశారు. అప్పటికే సునియాజ్‌ మృతి చెందింది. మరో పాప సురక్షితంగా బయట పడింది.
సింహాద్రిపురం మండలంలోని కోరుగుంటపల్లెకు చెందిన శివగంగ అనే 15 ఏళ్ల బాలిక తన పొలం పక్కనే ఉన్న నీటి కుంట వద్ద ఆడుకుంటుండేది. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. శివగంగతోపాటు నీళ్లలో దిగిన మరో ఐదుగురు పిల్లలు సురక్షితంగా బయట పడ్డారు.
కొండాపురం మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన కార్తీక్‌ (13) ఈతకు వెళ్లి మృతి చెందాడు. గ్రామ సమీపంలోని చిత్రావతి నదిలోని ఇసుక గుంతలో కార్తీక్, మరో ఇద్దరు పిల్లలు వెళ్లారు. వారిలో ఈత రాకపోవడంతో కార్తీక్‌ ఊపిరాడక చనిపోయాడు.
గోపవరం మండలంలోని భూమిరెడ్డిపల్లెకు చెందిన 10వ తరగతి చదువుతున్న అశోక్‌కుమార్‌ (15) ఈతకు వెళ్లి మృతి చెందాడు. గ్రామ సమీపంలోని వాటర్‌షెడ్‌ వద్ద  వద్ద ఉన్న గుంతలో ఈదుతూ చనిపోయాడు.
పోరుమామిళ్ల మండలంలోని రామాయపల్లెలో ఈ నెల 10న వెంకటశ్రీకాంత్‌ (8) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మిద్దెపైన ఉన్న ఇనుప కడ్డీని పట్టుకోవడంతో విద్యుత్‌ షాక్‌ కొట్టి అతను మృత్యువాత పడ్డాడు.  
చిన్నమండెం మండలంలోని మాధవరం వడ్డెపల్లెకు చెందిన ముగ్గురు పిల్లలు సురేష్‌బాబు, రెడ్డిబాబు, గిరిబాబు సరదాగా ఆడుకుంటూ గ్రామ సమీపంలోని వండాడి కొండపైకి వెళ్లారు. అక్కడ వారు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న లోయలో పడిపోయారు. తర్వాత రాత్రి పొద్దుపోయాక పోలీసులు, గ్రామస్తులు పిల్లలను గుర్తించి సురక్షితంగా లోయలో నుంచి సురక్షితంగా కాపాడగలిగారు.

ఒంటరిగా పంపొద్దు   
పాఠశాలలు లేకపోవడంతో కొన్ని నెలల నుంచి ఇంట్లో ఉన్న పిల్లలు బయటికి వెళ్లాలని తపిస్తుంటారు. వారి కదలికలను గమనిస్తుండాలి. ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్లాలనుకుంటే వారి వెంట తప్పకుండా పెద్దవాళ్లు వెళ్లాలి. స్నేహితులతో వారిని పంపొద్దు. పిల్లలు కనిపించకపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా పిల్లలను బయటికి పంపడం శ్రేయస్కరం కాదు.    – లోసారి సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top