సాగనంపేందుకేనా..!

Pamphlets On Proddatur Municipal Commissioner Corruption - Sakshi

కలకలం సృష్టిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌పై కరపత్రం

వరద అనుచరుడు ముద్రణ  

ప్రొద్దుటూరు టౌన్‌: అధికారులు అవినీతికి పాల్పడితే నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించవచ్చు. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇదీ సాధారణ పద్ధతి. అయితే ఇందుకు భిన్నంగా ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్నను ఇక్కడి నుంచి సాగనంపాలనే ఉద్దేశంతో కరపత్రాలు వేసి కొత్త సంస్కృతికి అధికారపార్టీ వారు తెరతీశారు. కొద్దిరోజుల కిందట ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్నను బదిలీపై వెళ్లాలని అధికారపార్టీ నేతలు హెచ్చరించారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, మీకు ఇష్టం లేకపోతే బదిలీ చేయించుకోమని కమిషనర్‌ ఆ నేతలకు చెప్పినట్లు తెలిసింది. తాను మాత్రం బదిలీపై వెళ్లనని, సెలవుపెట్టనని చెప్పినట్లు సమాచారం. ఇందుకోసం అధికారపార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పైస్థాయిలో కమిషనర్‌కు పట్టు ఉండటంతో అధికారపార్టీ నేతల మాటలు చెల్లుబాటు కాలేదు. ఈ కారణంగానే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డికి ముఖ్య అనుచరుడైన మాజీ కౌన్సిలర్‌ ఎర్రన్న మున్సిపల్‌ కమిషనర్‌ అవినీతికి పాల్పడ్డారని కరపత్రాలు వేసి పంచిపెట్టారు. ఒక దళిత అధికారిపై మరో దళిత నాయకుడు కరపత్రాలు వేయడం గమనార్హం. ఎలాగైనా మున్సిపల్‌ కమిషనర్‌ను సాగనంపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇలాంటి చర్యలకు పాల్పడటం విడ్డూరంగా ఉందని పట్టణంలో చర్చ నడుస్తోంది.

పింఛన్లే ముఖ్య కారణమా!
మార్చి నెలకు సంబంధించి మిగతా మున్సి పాలిటీల్లోలాగే ప్రొద్దుటూరుకు 1000 పింఛన్లు మంజూరయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని 40వార్డులకుగానూ 18 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నిక కాగా కొందరు పార్టీ మారడంతో ప్రస్తుతం 9మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారు. ఈ లెక్కన పూర్తి అర్హులైన 130 మందికి పింఛన్లు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం వీరికి పింఛన్‌ ఇవ్వాల్సిందేనని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమిషనర్‌ టీడీపీకి చెందిన 870తోపాటు, వైఎస్సార్‌సీపీకి చెందిన 130మందితో పింఛన్ల నివేదిక పంపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పలుమార్లు జిల్లా అధికారులతో చర్చించారు. ఇది అధికారపార్టీ నేతలకు నచ్చలేదు. కమిషనర్‌ వాస్తవ పరిస్థితిని ఎంత వివరించినా ఆయన మాట వినకుండా ఆయనను బదిలీ చేయించాలని నిర్ణయించారు. వైఎస్సార్‌సీపీ సూచించిన వారి పేర్లను పింఛన్ల జాబితాలో చేర్చారని అధికారపార్టీ నేతలు జిల్లా స్థాయిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయగా, ప్రొద్దుటూరులో మాత్రం పెండింగ్‌లో పడ్డాయి. ఈ కథ ఎప్పుడు కంచికి చేరుతుందో చెప్పలేం.

ముగ్గురు కమిషనర్లు..
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో నాలుగేళ్లకు ముగ్గురు కమిషనర్లు మారారు. çకమిషనర్లు సంక్రాంతి వెంకటకృష్ణ, ప్రమోద్‌కుమార్, వెంకటశివారెడ్డి బదిలీపై వెళ్లగా ఎంఈ సురేంద్రబాబును కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో కమిషనర్‌గా బండి శేషన్న పనిచేస్తున్నారు. ఈ బదిలీల ప్రభావంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ విధంగా టీడీపీ నేత తన మాట వినని అధికారులను పరోక్షంగా వేధించడాన్ని అధికారపార్టీలోని మరో వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top