‘ఓజోన్‌’ ఉచ్చు ఎవరి మెడకు?

Ozone valley Scandal Re Opens After Eight Years - Sakshi

వుడా లేఅవుట్‌ల కుంభకోణం

ఇప్పటికే పలువురు పదవీ విరమణ

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ విచారణ

ముగిసిన ప్రాథమిక పరిశీలన!

సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)లో పెను ప్రకంపనలు సృష్టించిన ఓజోన్‌ వేలీ కుంభకోణంపై మళ్లీ విచారణ మొదలు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతంలో వుడా ఉన్నతస్థాయి అధికారులతో పాటు దిగువ స్థాయి ఉద్యోగులు, బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమందిపై చర్యలు తీసుకున్నా కీలక సూత్రధారులు, పాత్రధారులూ తమ పలుకుబడి, ప్రాపకంతో తప్పించుకున్నారు. పరదేశిపాలెంలోని ఓజోన్‌ వేలీ సహా రుషికొండ, మధురవాడ, ఎంవీపీసెక్టార్‌–1,2,3, కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, ఆదిభట్లనగర్, ఎండాడల్లోని పది లేఅవుట్‌లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు 2010లోనే తేటతెల్లమైంది. వుడా తొలిసారిగా చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌లో ప్రభుత్వ, జిరాయితీ, డి.పట్టా భూములను సేకరించారు.

ఇందులో డి.పట్టా యజమానుల నుంచి సేకరించిన భూముల్లో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగింది. అంతకుముందు రూరల్‌ ఎమ్మార్వోగా పనిచేసి వుడా ఎస్టేట్‌ అధికారిగా, కార్యదర్శిగా పనిచేసిన జగదీష్‌ ఈ కుంభకోణంలో కీలకపాత్రధారిగా గుర్తించారు. రూరల్‌ ఎమ్మార్వో పరిధిలో తనకున్న అనుభవాన్ని లేఅవుట్ల బాగోతంలో రంగరించినట్టు అప్పట్లో తేల్చారు. ల్యాండ్‌పూలింగ్‌ సంగతిని ముందుగా తెలుసుకున్న ఆయన డి.పట్టాదారులతో మంతనాలు సాగిం చి వారి నుంచి కొంతమంది బినామీల పేరిట జీపీఏ రాయించుకోవడం.. నిబంధనల ప్రకా రం ఎకరానికి 1200 బదులు 1500 గజాలు ఇచ్చేలా జీవో ఇప్పించడం.. కోరుకున్న చోట్ల ఈ జాగాను ఇప్పించడం.. ఆ స్థలాలను రిజిస్ట్రేషన్‌లు చేసేయడం.. ఈ వ్యవహారంలో సహకరించిన అప్పటి మున్సిపల్‌ మంత్రికి, 15 వేల గజాలకు బదులు 12 వేలిచ్చినట్టు ఆరోపణలు రావడం.. అందులో తేడాలు రావడంతో ఈ బాగోతం బయటపడింది. 

వీసీ విష్ణుపై అభియోగాలు..
ఈ అక్రమాలకు అప్పటి వీసీ వీఎన్‌ విష్ణు సహకారం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన తర్వాత వీసీగా వచ్చిన కోన శశిధర్‌ ఈ కుంభకోణం లోతుకెళ్లి విచారణ జరిపించాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై 2014లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ లేఅవుట్లలో అక్రమాలు నిజమేనని నిగ్గుతేల్చారు. ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీనికి బాధ్యులైన నలుగురు వుడా ఉద్యోగులను, బినామీలను, మరికొందరు బాధ్యులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారానికి కీలకపాత్రధారిగా భావిస్తున్న జగదీష్‌ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వీసీగా పనిచేసిన విష్ణు తెలంగాణ కేడర్‌కు వెళ్లిపోయారు. ఇంకొందరు పదవీ విరమణ చేశారు.

ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులను వదిలేశారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్, విజిలెన్స్‌ జాయింట్‌ కమిషనర్, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఆర్‌వోలతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సీసీఎల్‌ఏ జాయింట్‌ డైరెక్టర్‌ శారదాదేవి నేతృత్వంలో రెండ్రోజులు (గురు, శుక్రవారాలు) ఈ కమిటీ ఈ లేఅవుట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించింది. వివాదాస్పద లేఅవుట్లను త్వరలో స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులను కమిటీ సభ్యులు పరిశీలనకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కమిటీ ప్రాథమిక పరిశీలనను ముగించినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ తన నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top