నో ఆఫ్‌లైన్‌..ఓన్లీ ఆన్‌లైన్‌

Online Services In All Government Office - Sakshi

ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ–ఆఫీస్‌ విధానం

ఇక ప్రతి ఫైల్‌ కదలికలు ఆన్‌లైన్‌..కాగిత రహిత పాలన దిశగా అడుగులు

ఈ–ఫైలింగ్‌ విధానంలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన కందుకూరు డివిజన్‌

జిల్లాలో ఇప్పటి వరకు 4678 ఫైళ్లు ఈ–ఆఫీస్‌ విధానంలో పరిష్కారం

కందుకూరు: ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ–ఆఫీస్‌ విధానంతో పాలనలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగ్గించడం, కార్యాలయాల్లో దుబారాను తగ్గించడం తదితర లక్ష్యాలతో అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితపు ఫైల్స్‌ విధానానికి స్వస్తి పలకనున్నారు. కొత్త విధానం పట్ల కొందరు అధికారుల్లో ఆందోళన ఉన్నా భవిష్యత్‌లో అంతా సవ్యంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఫైల్స్‌ అన్నీఈ–ఫైలింగ్‌ విధానంలోనే...
ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనకు కాగితపు ఫైల్‌ విధానం అమలవుతోంది. దీని వల్ల అధికారులకు శ్రమతో పాటు, పాలనలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌ అయిన కందుకూరు లాంటి డివిజన్‌లో ఈ సమస్య మరింత అధికం. మండల కేంద్రాల నుంచి డివిజన్‌ కేంద్రమైన కందుకూరుకు వచ్చి ఫైల్స్‌పై సంతకాలు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని ఫైల్స్‌ ఇద్దరు ముగ్గురు అధికారుల వద్ద నుంచి చేతుల మారి వచ్చే సరికి నెలల సమయం పడుతోంది. జిల్లా కేంద్రంతోఅనుసంధానమైన ఫైల్స్‌కు ఇదే పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడం శ్రమతో కూడుకున్న పనిగా ఉంది. అదే సందర్భంలో పాలనలో అవినీతి ప్రధాన సమస్యగా మారిపోయింది.

అలాగే కాగితపు ఫైల్స్‌ వల్ల కార్యాలయాలకు అవుతున్న ఖర్చుతో పాటు, దుబారా అధికంగానే ఉంటుంది. వివిధ కారణలతో ఫైల్‌ ఏ అధికారి వద్ద నిలిచి ఉందో అర్థం కాని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఫైల్‌ చంకన పెట్టుకుని రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి ఇక చరమగీతం పాడనున్నారు. ఈ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను ఈ–ఫైలింగ్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఇక ప్రతి ఫైల్‌ను ఈ విధానంలోనే పరిష్కరించాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకు కాగితాల మీద జరిగిన కార్యకలాపాలు మొత్తం ఇక నుంచి ఆన్‌లైన్లోనే జరపాల్సి ఉంది. భూమి సమస్యలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మీ–సేవ అర్జీలు, ల్యాండ్‌ కన్వర్షన్, పట్టాదారు పాస్‌పుస్తకాలు, మ్యుటేషన్స్‌ ఇలా ప్రతి ఫైల్‌ను ఇక నుంచి ఈ–ఫైలింగ్‌ విధానంలోనే పరిష్కరించాలి. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే అమల్లోకి వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు ఈ విధానానికి అలవాటు పడాల్సి ఉంది.

ఈ–ఫైలింగ్‌లో కందుకూరు మొదటి స్థానం:ఇప్పటికే ఈ–ఫైలింగ్‌ విధానంపై మూడు నెలలుగా అధికారులకు శిక్షణ ఇచ్చి అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలు ఈ విధానంలో అధికారులు పరిష్కరించారు. ఈ–ఫైల్‌ విధానంలో కందుకూరు రెవెన్యూ డివిజన్‌ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా మొత్తం మీద 4,678 ఫైల్స్‌ పరిష్కారం కాగా, కందుకూరు డివిజన్‌లోని 24 మండలాల్లో 2729 ఫైల్స్, డివిజన్‌ కేంద్రమైన ఆర్డీఓ పరిధిలో 1041 ఫైల్స్‌ ఈ విధానంలో పరిష్కరించి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ఒంగోలు ఆర్డీఓ పరిధిలో 311 ఫైల్స్, మార్కాపురం ఆర్డీఓ పరిధిలో 597 ఫైల్స్‌ ఈ ఫైల్‌ విధానంలో పరిష్కరించారు. ఇక నుంచి ప్రతి ఫైల్‌ ఆన్‌లైన్‌లోనే కదలాల్సి ఉంది.

పాలనలో పారదర్శకత పెరుగుతుంది
ప్రభుత్వ పాలనలో అనేక సంస్కరణలు వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఫైల్‌ విధానం అమల్లోకి వచ్చింది. దీని వల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుంది. అనవసర జాప్యం, దుబారా తగ్గుతుంది. నిర్ణీత సమయంలోనే సమస్యను  పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ జాప్యం అయితే ఎవరి వద్ద జాప్యం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అలాగే కొత్త విధానానికి అధికారులు, సిబ్బంది అలవాటు పడాలి. ఇక నుంచి ప్రతి ఫైల్‌ను కచ్చితంగా ఈ–ఫైల్‌ విధానంలోనే పంపాలి.   – మల్లికార్జున, కందుకూరు ఆర్డీఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top