ఆన్‌లైన్‌ అస్తవ్యస్తం | Online Registrations Delayed in Krishna | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ అస్తవ్యస్తం

Dec 15 2018 1:17 PM | Updated on Dec 15 2018 1:17 PM

Online Registrations Delayed in Krishna - Sakshi

గాంధీనగర్‌లోని కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన ప్రజలు (ఫైల్‌)

రామవరప్పాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి 600 గజాల స్థలాన్ని హైదరాబాద్‌కు చెందిన మరొక వ్యక్తి  కొనుగోలు చేశారు. ఆ కొనుగోలుదారుడు స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం మూడు రోజులుగా బ్యాంకులో స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ అకౌంట్‌లకు స్టాంప్‌డ్యూటీ ఇతర పద్దుల కింద రూ.1.50 లక్షలు ఫీజుగా చెల్లించారు. మూడు రోజులైనా ఆన్‌లైన్‌లో ఆ లావాదేవీ కింద సక్సస్‌ఫుల్‌ ట్రాన్సాక్షన్‌ (ఓకె) ట్రజరీ నుంచి రాకుండా స్టేటస్‌ పెండింగులో ఉంది.  దాంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. మూడు రోజులుగా స్థలం విక్రయదారుని కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఇతర దేశాలకు వెళ్లాల్సిన విక్రయదారుని కుటుంబీకుల టెన్షన్‌ వర్ణనాతీతం.

విజయవాడ: జాతీయ బ్యాంకుల్లో సర్వర్లు సక్రమంగా పనిచేయక లావాదేవీలు ఆలస్యమవుతున్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ వ్యవస్థ అస్తవ్యసంగా మారి ఖాతాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ బ్యాంకుల్లో జమ చేసిన డబ్బు ట్రెజరీల నుంచి సక్సస్‌ఫుల్‌ ట్రాన్సాక్షన్‌  (ఓకె) రావడం లేదు. జాతీయ బ్యాంకులకు,  ట్రెజరీ కార్యాలయాలకు లింక్‌ చేసే సర్వర్లు సరిగా పనిచేయటం లేదు.  దాంతో ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా   రిజిస్ట్రేషన్లు తీవ్ర ఆలస్యమవుతున్నాయి. నెల రోజులకు పైగా ఇదే పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా ఈ బాధలు అధికం కావడంతో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు. బ్యాంకుల్లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖకు చెల్లించిన ఫీజులు లక్షలాది రూపాయల లావాదేవీలు ఫెయిల్‌ అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని లావాదేవీలు పెండింగులో పడి ఉంటున్నాయని క్రయవిక్రయదారులు వాపోతున్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితిలో ప్రజలు బ్యాంకులు, ట్రెజరీలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్‌లో చెల్లించిన డబ్బు ఫెయిల్‌ అయి లావాదేవీలు నిలిచిపోతున్నాయి.

కొత్త నిబంధనలతో ఇబ్బందులు
నవంబర్‌ 1 నుంచి ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌  (కాంప్రిహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) కోడ్స్‌తో స్టాంప్‌డ్యూటీలు చెల్లించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఆస్తుల క్రయవిక్రయాల్లో కొనుగోలుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు పలు పద్దులపై సీఎఫ్‌ఎంఎస్‌ కోడ్స్‌తో చెల్లిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫీజుల రూపంలో  డబ్బు చెల్లించిన వారికి బ్యాంకర్లు ఓ చిన్న స్లిప్‌ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ట్రజరీ అధికారులు సంబంధిత ట్రాన్సాక్షన్‌ చూసి ఓకే చెపితే సంబంధిత సబ్‌–రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొసాగిస్తారు. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ట్రెజరీకి అనుసంధానం జరగడంలో తీవ్రజాప్యం జరుగతోంది. కొన్ని సందర్భాల్లో లావాదేవీలు ఫెయిల్‌ అవుతున్నాయి. డబ్బు కనపడకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో లావాదేవీల స్టేçటస్‌ పెండింగ్‌లో కనపడటంతో అధికారులు  రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నారు. సర్వర్‌ సరిగా పనిచేయకపోవడంతో రోజుల తరబడి స్టేటస్‌ పెండింగ్‌లోనే ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా 28 రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో  ఇదే పరిస్థితి  నెలకొంది. విజయవాడ, గన్నవరం, కంకిపాడు, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా  ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

చేతులెత్తేస్తున్న అధికారులు
కాగా ఆన్‌లైన్‌లో ఇబ్బందులకు సంబంధించి బాధ్యత మాదికాదంటే మాదికాదని ట్రజరీలు, బ్యాంకులు, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు చేతులెత్తేస్తున్నారు. బ్యాంకుల నుంచి సరిగా సర్వర్లు పనిచేయక తమకు అనుసంధానం కాకపోవడంతో తాము  చలానా లావాదేవీలు ఓకే చేయలేకపోతున్నామని ఖజానా శాఖాధికారులు చెబుతున్నారు. స్టేటస్‌ పెండింగులోఉన్నా, లావాదేవీ ఫెయిల్‌ అయినా తాము రిజిస్ట్రేషన్‌ చేయలేమని స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖాధికారులు చెబుతున్నారు.

చెల్లించిన డబ్బు గల్లంతైంది
భూమి రిజిస్ట్రేషన్‌ ఫీజుల నిమిత్తం జాతీయ బ్యాంకుల్లో చెల్లించిన డబ్బు గల్లంతైంది.   స్టాంప్‌డ్యూటీగా చెల్లించిన రూ. 92 వేలు లావాదేవీ పెయిల్‌ అయింది. నా  అకౌంట్‌ నుంచి డబ్బు కట్‌ అయింది. ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ అని వచ్చింది. బ్యాంకు లావాదేవీ మిస్‌ అయిందని సంబంధిత బ్యాంకు  అధికారికి అర్జీ దాఖలు చేశాను. తిరిగి ఆ డబ్బు  తన  ఖాతాకు రావటానికి సుమారు 15రోజులు  పడుతుందని  బ్యాంకు అధికారి చెప్పారు. దాంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పెండింగులో పడింది.– గరిమెళ్ల శివనాగేశ్వరరావు, రైతు, ముస్తాబాద, గన్నవరం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement