
చంద్రబాబు నియోజకవర్గంలో ఆకలి చావు
ఆదరవుగా ఉన్న పింఛను నాలుగు నెలలుగా అందడం లేదు. వారం నుంచి ఆకలికి తాళలేని ఓ వృద్ధుడు శుక్రవారం తనువు చాలించాడు.
తిండిలేక నీరసించి వృద్ధుడి కన్నుమూత
గుడుపల్లె: ఆదరవుగా ఉన్న పింఛను నాలుగు నెలలుగా అందడం లేదు. వారం నుంచి ఆకలికి తాళలేని ఓ వృద్ధుడు శుక్రవారం తనువు చాలించాడు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం కనమనపల్లెలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కనమనపల్లెకు చెందిన ముష్టపల్లె మునెప్ప (76)ను పదేళ్ల క్రితం ఆయన భార్య వదిలి వెళ్లింది. ఒక్కగానొక్క కుమారుడు మద్యానికి బానిసై ఎటో వెళ్లిపోయాడు. ఎనిమిదేళ్లుగా వస్తున్న పింఛన్‌తో కాలం గడుపుతున్నాడు. మతిస్థితిమితం లేని మనమరాలు రోజా (14)ను పోషిస్తున్నాడు. రేషన్‌కార్డులో వయసు సరిగా లేదని నాలుగు నెలల క్రితం పింఛను నిలిపివేశారు. ఆ తర్వాత ఎవరైనా చుట్టుపక్కల వారు ఏదైనా పెడితే మునెప్ప, ఆయన మనుమరాలు తిని కాలం గడిపేవారు.
పింఛన్ కోసం గ్రావు సభలు, కార్యాలయూల చుట్టూ తిరిగాడు. నెల క్రితం వయసు నిర్ధారణ కోసం డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని అధికారులకు అందజేశాడు. ఆ తర్వాత ఇంకా పింఛను రాలేదు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా తిండి లేక ఆకలితో అలమటించాడు. నీరసించి శుక్రవారం మృతి చెందాడు. ఈ సంఘటనపై తహసీల్దారు ముని నారాయణను వివరణ కోరగా మునెప్ప దరఖాస్తును స్వీకరించి జిల్లా ఉన్నతాధికారులకు పంపామన్నారు. ఎంపీడీవో పోస్టు ఖాళీగా ఉండడం వల్ల సమాచారం ఆలస్యంగా వచ్చిందన్నారు. వచ్చే నెలలో ఆయనకు పింఛను వచ్చి ఉండేదని తెలిపారు.