కొలిక్కిరాని ఐకేపీ కుంభకోణం

నకిలీ బ్యాంకు ఖాతాలపై దృష్టిపెట్టని అధికారులు

అధికారులపై టీడీపీ నాయకుల ఒత్తిళ్లు?

 రాజీ ప్రయత్నాల్లో అధికార పార్టీ నేతలు

తణుకు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవినీతి బట్టబయలైనా కనీసం విచారణ చేపట్టేందుకు అధికారులు ముందుకు రావడంలేదు. ఐకేపీ కుంభకోణం వ్యవహారంలో డ్వాక్రా మహిళల అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో ఇటీవల వెలుగు చూసిన ఐకేపీ కుంభకోణంలో ఇప్పటి వరకు బా«ధ్యులపై చర్యలు తీసుకోకపోగా కనీసం విచారణ కూడా చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు బహిరంగమే అయినా సంబంధిత అధికారులు మాత్రం నోరు మెదపడంలేదు. మరోవైపు గతంలో ఇదే మండలంలో వెలుగు చూసిన ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన మండలస్థాయి మాజీ నాయకుడి పాత్రపైనా డ్వాక్రా మహిళలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పాత్రపైనా అనుమానాలు
గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళల పేరుతో పాలకొల్లు ఇండియన్‌ బ్యాంకులో నకిలీ ఖాతాలు సృష్టించిన వైనంపైనా అధికారులు ఇప్పటివరకు విచారణ చేపట్టకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ధాన్యం కొనుగోలులో దళారీగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడితోపాటు మరికొందరి తీరుపైనా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.10 కోట్ల మేర ఇదే తరహాలో నగదు లావాదేవీలు నిర్వహించినప్పటికీ దీనిపై విచారణ చేపట్టాల్సిన అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు.

 మరోవైపు ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత ఖాతాదారులు లేకుండానే ఖాతాలు ప్రారంభించడంతో పాటు డ్రా చేసిన సమయంలో సైతం వారు లేకుండానే నగదు చెల్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015 ఖరీఫ్‌ నుంచి 2017 వరకు సుమారు 392 మంది ఖాతాల ద్వారా సుమారు రూ.10 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. ఒక్కో ఖాతాదారుడి ఖాతాలో రూ.లక్ష నుంచి రూ.12 లక్షల వరకు జమచేసి అనంతరం డ్రా చేసినట్లు తెలుస్తోంది. సొమ్ము బదిలీ వ్యవహారం ఎఫ్‌టీవో (ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌) సంఖ్య ద్వారా స్పష్టమవుతోంది. 

జిల్లావ్యాప్తంగా..
ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో వెలుగు చూసిన ఐకేపీ కుంభకోణం ఇప్పుడు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు తమ బంధువుల పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తమకు అనుకూలంగా ఉండే డ్వాక్రా మహిళలను సభ్యులుగా చేర్చి వారిపేరుతో ఈ తరహా వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాల్లో సైతం ఇదే తరహాలో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. 

సాధారణంగా రైతులు ధాన్యం అమ్మే సమయంలో రైతు పట్టాదారు పుస్తకం, రుణార్హత కార్డు లేదా స్వయంగా ధ్రువీకరణ పత్రం అందజేయాలి. అయితే వ్యవసాయంతో సంబంధంలేని వ్యక్తులను రైతులుగా గుర్తించి వారి పేరుతో ఖాతాలు ప్రారంభించిన వ్యవహారం ఇప్పుడు ధుమారం రేపుతోంది. సాధారణంగా బ్యాంకు ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు ఎన్నో నిబంధనలు చెబుతారు. ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసుకునే సమయంలో సైతం ఖాతాదారుడు తప్పనిసరిగా ఉండాలనే షరతులు పెడతారు. అయితే ఇక్కడ మాత్రం సంబంధిత ఖాతాదారుడు లేకుండానే పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం వెనుక బ్యాంకు అధికారుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత మహిళలతో కొందరు టీడీపీ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.   
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top