వైద్యం దైన్యం

Officials And Hospital Staff Negligence On Ashram School Girls - Sakshi

నేలపై కూర్చోబెట్టి సిలైన్లు ఎక్కించిన సాలూరు ఆస్పత్రి  సిబ్బంది   

నొప్పిని మౌనంగా భరించిన ‘ఆశ్రమ’ బాలికలు

ఆహారం కలుషితం కాలేదని సెలవిచ్చిన మంత్రి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: పై ఫొటో చూడగానే మీకేమనిపిస్తోంది.. ఆడపిల్లలెవరో సెల్‌ఫోన్లు చార్జింగ్‌ పెట్టుకుని కూర్చున్నారనిపిస్తోంది కదూ.. అచేతనంగా చూస్తే కళ్లు చెమర్చుతాయి. కోపంతో నిండిన ఆవేశం ఈ ప్రభుత్వంపైన, పాలకులపైన తన్నుకొస్తుంది. సాలూరు మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు 14 మంది సోమవారం రాత్రి కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని సాలూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు.

పశువులను దొడ్డిలో వరుసగా కట్టేసి గడ్డి పడేసినట్లుగా విద్యార్థినులను వరుసగా కూర్చోబెట్టి సిలైన్లు ఎక్కించారు. కొందరికైతే సిలైన్‌ సూదిని నేరుగా చేతిలో గుచ్చేశారు. ఓ వైపు వాంతులతో, ఒంట్లో శక్తి నశించి నీరసించిన ఆడపిల్లలు సిలైన్‌ తమ శరీరంలోకి ఎక్కుతున్నంత సేపూ బాధను మౌనంగా భరిస్తూ కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన వారెవరికైనా మనం నవ సమాజంలోనే ఉన్నామా.. లేక ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనే అనుమానం కలుగుతుంది. హైటెక్‌ బాబుగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు పాలనలోఇదేనా హైటెక్‌ వైద్యమంటూ నెటిజన్లు ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాల్లో పోస్టింగ్‌లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అటు ఆశ్రమ పాఠశాలలో వసతులు లేవు. అనారోగ్యమొస్తే ఒకే గదిలో, ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి.

ఇంత జరిగినా...
ఓ వైపు బాలికలు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతుంటే.. మన పాలకుల్లో, అధికారుల్లో చలనం లేదు. ఎలాంటి ఫుడ్‌ పాయిజనింగ్‌ జరగలేదని సాక్షాత్తూ సాంఘిక, సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనంద్‌బాబు స్వయంగా బుకాయింపు ప్రకటన విడుదల చేశారు. ఒక విద్యార్థిని జ్వరంతో, కొద్ది మంది విద్యార్థినులు తగినంతగా నీరు తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరారని, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఐటీడీఏ పీఓ లక్ష్మీషాతో పాటు ఇతర అధికారులు మంత్రికి ఫోన్‌లో చెప్పారు.

గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మెరుగైన వసతులను ప్రభుత్వం కల్పించిందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. మన జిల్లాకు చెందిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు కూడా అధికారులతో మాట్లాడి ఇదేవిధంగా ఒకరికొకరు సర్దిచెప్పుకుని అసలు జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని, జ్వరాల మరణాలసలే లేవని, తామంతా ఎందో బాగా పనిచేసేస్తున్నామని జబ్బులు చరుచుకున్నారు. ఇదంతా గమనిస్తున్న జనం ‘‘వీళ్లా మన పాలకులు.. వీళ్లకసలు మనసుందా..మనుషులేనా’’ అంటూ ఛీ కొడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top