ఎన్నికల పథకం

NTR Sujala Scheme Delayed In Prakasam - Sakshi

 కానరాని ఎన్‌టీఆర్‌ సుజలం

నాలుగేళ్లుగా అమలుకు ఆమడదూరం

ఎన్నికల వేళ.. పథకమంటూ ప్రచారం

18 శుద్ధ జల కేంద్రాలట

రూ.64.01 కోట్లతో టెండర్లు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలప్పుడు టీడీపీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆయన పేరుచెప్పి ఓట్లు పొందే ఎత్తుగడకు దిగుతుంది. కానీ ఎన్టీఆర్‌ అంటే టీడీపీకి  ఏమాత్రం ప్రేమ లేదనడానికి ఆయన పేరుతో ప్రభుత్వం నెలకొల్పిన ఎన్‌టీఆర్‌ సుజల పథకం అమలుతీరే నిదర్శనం. బాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ప్రతి ఇంటికీ రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత  తాగునీరందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఎన్‌టీఆర్‌ సుజల పథకం అని నామకరణం చేశారు. అసలే ఫ్లోరైడ్‌తో అష్టకష్టాలు పడుతున్న ప్రకాశం జిల్లాకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అందరూ ఆశించారు. అయితే బాబు నాలుగేళ్ల పాలన ముగిసినా ఈ పథకం ద్వారా జిల్లావాసులకు గుక్కెడు నీరందలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ఏడాది కావడంతో  జిల్లాలో ఎన్టీఆర్‌ సుజల పథకం ప్రవేశపెడుతున్నట్లు  సర్కార్‌ ప్రచారం మొదలు పెట్టింది.

ప్రకాశం జిల్లాలో 8,60,423 కుటుంబాల పరిధిలో 33,97,448 జనాభా ఉన్నారు.  అధికారంలోకి వస్తూనే ప్రతి కుటుంబానికి  రెండు రూపాయలకే  20 లీటర్ల శుద్ది జలం ఇస్తామని బాబు ప్రకటించారు. తాగునీటిని అందరికీ అందుబాటు లోకి తెస్తామన్నారు.  బాబు పాలనకు నాలుగేళ్లు నిండాయి.  ఇప్పటికీ  జిల్లాలో  ఎన్టీఆర్‌ సుజల పథకం కింద చుక్క నీరివ్వలేదు. జిల్లాలో ముఖ్యంగా  పశ్చిమప్రకాశంలోని దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో తాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయి. వెయ్యి అడుగుల మేర బోరుబావులు తవ్వినా నీరు దొరికే పరిస్థితి లేదు. పైగా ఆ స్థాయిలో  భూగర్భ జలం అరకొరగా పైకి  వచ్చినా ప్లోరైడ్‌  శాతం అధికంగా ఉంటుంది.  నీటిని తాగితే ప్లోరోసిస్‌ తో పాటు  కిడ్నీ వ్యాధికి గురికావాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే జిల్లాలో  వందలాది మంది  మృతి చెందగా వేలాది మంది వ్యాధికి గురై బాధ పడుతున్నారు. ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా తాగునీరందుతుందని అందరూ ఎదురు చూశారు.

ఇప్పటికీ పథకం ఊసేలేదు. ఎన్‌టీఆర్‌ సుజల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శలు రావడంతో  దాతలను వెతికి  పథకాన్ని రన్‌ చేయాలని ప్రభుత్వం గ్రామీణ తాగునీటి పథకం అధికారులను ఆదేశించింది. అయితే  ఈ ప్రయత్నం వికటించింది. మేము దానమిచ్చి ఎన్‌టీఆర్‌ పేరెందుకు పెట్టుకుంటామంటూ  చాలా మంది దాతలు ముఖం చాటేశారు.  ఆ తరువాత పథకాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఇటీవల ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తో పాటు అన్ని పక్షాలు  బాబు  నెరవేర్చని వాగ్దానాలతో పాటు ఎన్‌టీఆర్‌  పేరుతో పెట్టిన సుజలపథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శలు చేశారు. విమర్శల దాడి  పెరగడం,  ఎన్నికల ఏడాది కావడంతో  ఇప్పడు చంద్రబాబు  ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ సుజల పథకాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.    ప్రకాశం జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో బేస్తవారిపేట, గిద్దలూరు, రాచర్ల, కంభం, కొమరోలు, సీఎస్‌పురం, దొనకొండ, దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, పుల్లలచెరువు, తర్లుపాడు, యర్రగొండపాలెం, దర్శి, ముండ్లమూరు, పీసీపల్లి, పొదిలి, కందుకూరు తదితర 18 మండల కేంద్రాల్లో శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల అధికారులు ప్రకటించారు. 

ఇందు కోసం రూ.64.01 కోట్లు మంజూరు చేసి టెండర్ల పిలిచినట్లు ప్రకటించారు. శుద్ధజల కేంద్రాలకు పుష్కలంగా నీరు అవసరం. గంటకు 20 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న బోరుబావులు తవ్వాల్సి ఉంది. అలా అయితేనే 10 వేల లీటర్ల సురక్షిత నీరు వస్తుంది. అప్పుడే ప్రజలకు నీటిని అందించే అవకాశం ఉంటుంది. పశ్చిమ ప్రకాశంలో పుష్కలంగా నీరున్న ప్రాంతాలు అరుదు. దీంతో  ఈ పథకం పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకట్రెండు చోట్ల నీరున్న ప్రాంతాలు దొరికినా.. బోరు బావుల తవ్వకం, శుద్ధజల కేంద్రాల ఏర్పాటు, మారుమూల గ్రామాలకు పైప్‌లైన్ల నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ పథకం అమలుకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన ఫ్లోరోసిస్‌ ప్రాంతాలకు ఎన్‌టీఆర్‌ సుజలం పేరుతో సురక్షిత నీరు అందిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరే అవకాశం లేదు. ఇది ఎన్నికల ప్రచారం కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top