తెలంగాణ ఏర్పాటును..ఏ శక్తీ అడ్డుకోలేదు | Nobody can stop telagana formation | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏర్పాటును..ఏ శక్తీ అడ్డుకోలేదు

Aug 29 2013 4:01 AM | Updated on Apr 7 2019 4:30 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ అడ్డుకోలేదని రాజకీయ-ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోరుతూ బోనకల్‌లో శాంతి

బోనకల్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ అడ్డుకోలేదని రాజకీయ-ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోరుతూ బోనకల్‌లో శాంతి, రిలే నిరాహార దీక్ష లు బుధవారం మూడోరోజుకు చేరాయి. ఈ శిబిరాన్ని ఉద్దేశించి రంగరాజు మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే కొందరు సీమాంధ్రలో ఉద్యమాలు నడిపిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు తెలంగాణ వనరులన్నింటిని సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు దోచుకున్నారని, ఉద్యోగావకాశాలను కూడా ఆ ప్రాంతీయులే కాజేశారని ఆరోపించారు. సీమాంధ్రలో నాయకులు చేయిస్తున్న  ఉద్యమానికి ప్రజాస్పందన లేనప్పటికి ఉన్నట్టుగా సృష్టిస్తున్నారని అన్నారు. 
 
 ఈ కృత్రిమ ఉద్యమాలను ఇప్పటికైనా ఆపాలని డిమాండ్ చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ రాష్ర్టంలోనే జరుగుతాయన్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉందామన్నారు. తెలంగాణ ఉద్యమం వెనుక సిద్ధాంత నిబద్ధతత, నిజాయితీ ఉందన్నారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. దీక్ష శిబిరంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీడీఓల సంఘం ఉపాధ్యక్షుడు కె.చంద్రశేఖర్, మండల ఏఈఈ రామకోటి నాయక్, యూడీసీ కృష్ణారా వు,
 
 ఎల్‌డీసీ ఉమాదేవి, మండల సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ సంజీవరావు, టైపిస్ట్ కృష్ణకు రంగరాజు పూలమాలలు వేసి మూడోరోజు దీక్షను ప్రారంబించారు. ఈ దీక్ష శిబిరానికి మండల జేఏసీ చైర్మన్ గుర్రాల నాగేందర్‌రావు, ఉద్యోగ జేఏసీ మండల కన్వీనర్ బాగం వేణు, నాయకుడు రేగళ్ళ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బందం నాగేశ్వరావు, నాయకుడు తుల్లూరి లక్ష్మీనర్సయ్య, న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకుడు ముత్తారపు గిరి, బోనకల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బి.చలపతిరావు, రామకృష్ణ, ముంతాజ్, శేషుపణి, రమాదేవి, సరోజ తదితరులు సంఘీభావం తెలిపారు.
 
 విద్యార్థుల శాంతి ర్యాలీ
 మధిర రూరల్: పార్లమెంటులో తెలంగాణ బిల్లును వెంటనే ప్రశేపెట్టాలన్న డిమాండుతో పీడీఎస్‌యూ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సిరిపురం గ్రామంలో విద్యార్థులు బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ విజయ్ మాట్లాడుతూ.. సమైక్యవాద ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణాన్ని ఆంధ్రాలో కలిపితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు కనకపూడి శ్రీను, వీరబాబు, ప్రవీణ్, రాంబాబు, క్రాంతికుమార్, నవీన్, విజయలక్ష్మి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
 
 మణుగూరులో..
 మణుగూరు: తెలంగాణ బిల్లును పార్లమెంటు లో ప్రవేశపెట్టాలన్న డిమాండుతో వివిధ ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ జేఏసీల ఆధ్వర్యంలో బుధవారం మణుగూరులో భారీ శాంతి ర్యాలీ జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్, పెట్రోల్ బంక్, తెలంగాణ చౌరస్తా మీదుగా తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం, ప్రదర్శకులు మానవహారం నిర్వహించి, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. ప్రదర్శకులనుద్దేశించి ఉద్యోగ సంఘాల నాయకులు కె.సందీప్‌కుమార్, పి.విజయ్‌కుమార్, వలసాల వెంకటరామారావు, డి.శ్రీనివాసరావు, అనంతరాజు,
 
 వెంకన్న, చత్రునాయక్, శ్యాంసుందర్ మాట్లాడుతూ... తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టేంత వరకు ఉద్యమించాలని కోరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు సాగిస్తున్న ఉద్యమంలో అర్థం లేదని అన్నారు. వారు ఉద్యమాలు మానుకుని, సోదర భావంతో విడిపోవాలని కోరారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా జేఏసీల నాయకులు ఎన్.సత్యప్రకాశ్, జి.ఉపేందర్, సలీమ్, తాటి నర్సింహారావు, శ్రీనివాస్, నాగుల్‌మీరా, చెన్నం ఆనందరావు, అనిల్, సతీష్, వినోద్, రాబిన్, పవన్‌నాయక్, హెరాల్డ్, వేణు, అబ్దుల్ కరీం, సూర్యకాంత్, పూల్‌సింగ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలి
 పెనుబల్లి: తెలంగాణ బిల్లును  ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. తెలంగాణకు సంఘీభావం ప్రకటించాలని కోరుతూ ఆయన బుధవారం మండలవ్యాప్తంగా ఉపాధ్యాయులను కలుసుకుని ప్రచారం చేశారు. పలుచోట్ల జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు టివి.రామారావు, వనమా నాగేశ్వరరావు, చంద్రుగొండ మండల అధ్యక్షుడు జయకర్, కార్యవర్గ సభ్యులు మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 
 
 మహాత్మాగాంధీకి వినతిపత్రం
 సత్తుపల్లి: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా చూడాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం, తెలంగాణ కోసం అలుపెరగకుండా పోరాడతామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ కన్వీనర్ చిత్తలూరి ప్రసాద్, ఏఐఎస్‌ఎఫ్ డివిజన్ కార్యదర్శి యర్రా మధు, సీపీఐ మండల కార్యదర్శి తడికమళ్ళ యోబు, నాయకులు ముత్తారావు, అరుణ తదితరులు పాల్గొన్నారు.
 
 తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి
 కల్లూరు: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకుల సమావేశం బుధవారం కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగింది. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టేంత వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని వారు నినాదాలు చేశారు. 
 సమావేశంలో నాయకులు గొల్లమందల రాఘవులు, కొరకొప్పు ప్రసాద్, భూక్యా రామూనాయక్, కొరకొప్పు రామారావు, తెళ్ళూరి కృష్ణ, బొల్లెపోగు కృష్ణ, షేక్ జాని, దోమతోటి పకీర్, అన్నవరపు రామారావు, నామా మైసయ్య, జొన్నలగడ్డ లక్ష్మణ్, గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement