‘ఆధార్’ నమోదు చేస్తున్నా మొబైల్స్‌కు రాని పాస్‌వర్డ్ | No password received, after enrolled Aadhar card | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ నమోదు చేస్తున్నా మొబైల్స్‌కు రాని పాస్‌వర్డ్

Sep 13 2013 3:28 AM | Updated on Sep 1 2017 10:39 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కష్టాలు తప్పడం లేదు. ఓవైపు ప్రభుత్వ అడ్డగోలు నిబంధనలు, మరోవైపు సాంకేతిక కారణాలు కలగలిసి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్:  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కష్టాలు తప్పడం లేదు. ఓవైపు ప్రభుత్వ అడ్డగోలు నిబంధనలు, మరోవైపు సాంకేతిక కారణాలు కలగలిసి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ‘ఆధార్’కు సంబంధించిన విశిష్ట గుర్తింపు సంఖ్యను నమోదు చేస్తేనే ఫీజుల పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తామని ఉన్నతాధికారులు విధించిన నిబంధన కారణంగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకపోగా, ఇప్పుడు ఆ సంఖ్య ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈపాస్ వెబ్‌సైట్‌లో ఆధార్‌తో పాటు విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ నంబర్‌ను నమోదు చేస్తే, ఆ మొబైల్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను కూడా నమోదు చేసిన తర్వాతే దరఖాస్తు ఓపెన్ అయ్యేలా ఉన్నతాధికారులు సాంకేతిక ఏర్పాట్లు చేశారు. కానీ గత వారం రోజులుగా తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా విద్యార్థుల మొబైల్స్‌కు పాస్‌వర్డ్ రావడం లేదు. దీంతో వేలాదిమంది విద్యార్థులు దిక్కుతోచనిస్థితిలో పడిపోతున్నారు.
 
 సాంకేతికలోపాన్ని సవరించడంలో సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’ ఉన్నతాధికారులను సంప్రదించగా, పాస్‌వర్డ్ సమస్య ఉన్నమాట వాస్తవమేనని, తాము ఎప్పటికప్పుడు సీడాక్ అధికారులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. విద్యార్థులు పాస్‌వర్డ్ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని మీసేవ, ఈసేవా, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలకు వెళితే పాస్‌వర్డ్ లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అయితే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు చాలా సమయం పడుతోందని విద్యార్థులంటున్నారు. ఒక్కోసారి వరసగా మూడురోజులు వెళ్లి మీసేవ కేంద్రంలో కూర్చున్నా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండడం లేదని, కొన్నిచోట్ల మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.70 వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పాస్‌వర్డ్ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
 ‘తేడా’ ఫీజు తక్షణం విడుదల చేయండి
 గత ఏడాది సవరించిన ఫీజుల ప్రకారం రూ.35 వేల కన్నా ఎక్కువ ఫీజు నిర్ధారించిన కళాశాలల్లో చేరిన కొందరు విద్యార్థులకు మొత్తం ఫీజు కడతామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఆ తేడా ఫీజు మొత్తంలో రూపాయి కూడా చెల్లించలేదు. ఏ కళాశాలలో ఫీజు ఎంత ఉన్నా ఎస్సీ, ఎస్టీలకు, ప్రభుత్వ కళాశాలల్లో చదివి 10 వేలలోపు ర్యాంకు తెచ్చుకున్న వారికి మొత్తం ఫీజు కడతామని గత ఏడాది ప్రభుత్వం చెప్పింది.
 
 ఈ ప్రకారం పై అర్హతలున్న వ్యక్తి సీబీఐటీ కళాశాలలో చేరితే ఫీజు మొత్తంగా నిర్ధారించిన రూ.1.13 లక్షల ఫీజును ప్రభుత్వం చెల్లించాలి. అలాగే మిగిలిన కళాశాలల్లో కూడా ఆయా కళాశాలల నిర్ధారిత ఫీజును చెల్లించాలి. కానీ ప్రభుత్వం గతంలో మాదిరిగానే కేవలం రూ.35 వేలను మాత్రమే చెల్లించింది. దీంతో సంబంధిత విద్యార్థుల ఫీజుపై యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇంకొన్ని రోజులు మాత్రమే వేచిచూస్తామని, అప్పటికీ ప్రభుత్వం ఫీజు మొత్తం కట్టకపోతే విద్యార్థుల నుంచి వసూలు చేస్తామని ఓ కళాశాల పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వం వెంటనే మొత్తం ఫీజు విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement