పాత ప్రీమియంతోనే వైఎస్సార్‌ బీమా

No Hike In YSR Bheema Premium Rates - Sakshi

రాష్ట్రానికి కేంద్రం తీపి కబురు 

ప్రీమియం యథాతథం 

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ బీమా ప్రీమియం పెంచబోమని, పాత ప్రీమియమే వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రీమియం పెంచవద్దంటూ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ని ఆదేశిస్తామని భారత ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ రాజీవ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా డిజిగ్నేట్‌ అయిన రాజీవ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఢిల్లీలో కలిసి వైఎస్సార్‌ బీమా ప్రీమియం పెంచుతూ ఎల్‌ఐసీ తీసుకున్న నిర్ణయంవల్ల ఏపీపై చాలా అదనపు భారం పడుతుందని వివరించారు.

‘2.60 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా అమలుచేస్తోంది. కుటుంబ యజమానులైన/పోషకులైన అసంఘటిత రంగ కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించినా, వృద్ధాప్యం రాకముందే సహజ మరణం చెందినా ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ బీమాను అమలుచేస్తోంది. బీమా పరిధిలోని కార్మికులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్‌ బీమా కింద రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం. 18 నుంచి 50 ఏళ్లలోపు వారు సహజ మరణం చెందితే రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్లలోపు వారు సహజ మరణం చెందితే రూ.30 వేలు ఈ బీమా కింద ఇస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి బీమా ప్రీమియం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి బీమా ప్రీమియం పెంచుతున్నట్లు ఎల్‌ఐసీ హఠాత్తుగా ప్రకటించింది. దీనివల్ల కలిగే ఆర్థిక భారాన్ని వివరిస్తూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఎల్‌ఐసీని ఒప్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నేను ఆర్థికశాఖ అధికారులను కలిసి ఈ భారం మోపవద్దని కోరాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రధానికి లేఖ రాశారు. ఈ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అలాగే, నేను రాజీవ్‌కుమార్‌ను గురువారం కలిసి పాత ప్రీమియమే అమలుచేసేలా ఎల్‌ఐసీని ఆదేశించాలని కోరా. వెంటనే ఆయన అలాగే చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ప్రీమియం పెంచాల్సి వస్తే కమిటీ వేసి దేశంలోని అన్ని రాష్ట్రాలకు పెంచుతాం. ప్రస్తుతానికి ఏపీకి ఈ పెంపుదల ఉండదని రమేష్‌కుమార్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు’.. అని ఎల్వీ సుబ్రహ్మణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ఇది రాష్ట్రానికి ఊరట కలిగించే అంశమని ఆయన చెప్పారు. 

రెవెన్యూ లోటు  విడుదలపైనా సానుకూలత 
అలాగే, ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం ప్రభుత్వం భర్తీ చేయాల్సిన రూ.16,000వేల కోట్ల రెవెన్యూ లోటును కూడా తక్షణమే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా  సీఎస్‌ ఎల్వీ విజ్ఞప్తి చేశారు. ఇందుకు రమేష్‌కుమార్‌ స్పందిస్తూ.. తాను ఈ విషయాన్ని పరిశీలిస్తానని, సాధ్యమైనంత త్వరగా ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top