జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం
విజయనగరం కంటోన్మెంట్ : జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 2వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లాలో ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆ రోజు ముఖ్యమంత్రి ప్రసంగం, ప్రతిజ్ఞ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటాయని తెలిపారు. 3వతేదీ నుంచి 7వతేదీ వరకు వివిధ అంశాలపై నియోజకవర్గ స్థాయిలో ప్రసంగాలు, చర్చలుంటాయని, 8న మహాసంకల్పం కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి రాజమండ్రి, కాకినాడ, ఏలూరులలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
ప్రత్యేకాధికారులు వీరే
కురుపాం నియోజకవర్గానికి పార్వతీపురం ఆర్డీవో గోవిందరావు, పార్వతీపురం నియోజకవర్గానికి గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎ.వి.సుబ్బారావు, బొబ్బిలి నియోజకవర్గానికి జిల్లా అటవీ అధికారి రమణమూర్తి, గజపతినగరానికి డీఆర్‌డీఏ పీడీ ఢిల్లీరావు, విజయనగరం నియోజకవర్గానికి జెడ్పీ సీఈఓ జి.రాజకుమారి, ఎస్.కోట నియోజకవర్గానికి కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత, చీపురుపల్లికి విజయనగరం ఆర్డీవో శ్రీనివాసమూర్తి, నెల్లిమర్లకు భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ అనిత, సాలూరు నియోజకవర్గానికి పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గణపతిరావును ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.