బాల్య వివాహాలపై చైతన్యం కలిగించాలి

Nannapaneni Raja kumari Worried About Child Marriages - Sakshi

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాజకుమారి

ఒంగోలు టౌన్‌: ఆడపిల్లలను చదివించకుండా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు తమ భారం తొలగించుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను యువత ప్రజలకు తెలియజేసి చైతన్యవంతులను చేయాలని ఉద్బోధించారు. రాష్ట్ర మహిళా కమిషన్, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా స్థానిక రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సహకారంతో కళాశాల ఆవరణలో బుధవారం సాయంత్రం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబం లోని ఆర్థిక పరిస్థితులు, ఆడపిల్లనే అభద్రతా భావం, మూఢ నమ్మకాలు వంటి అనేక కారణాల వల్ల అభం శుభం తెలియని బాలికలకు చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. దీనిని రూపుమాపేందుకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వల్ల గర్భం దాల్చిన సమయంలో తల్లితో పాటు బిడ్డ ప్రాణానికి కూడా అపాయం కలుగుతుందన్నారు. బాలికలు, మహిళల పరిరక్షణ కోసం మహిళా కమిషన్‌ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

లింగ వివక్షత వెంటాడుతోంది
సాంకేతికంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో బాలికల పట్ల లింగ వివక్షత ఇంకా వెంటాడుతూనే ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి టీ రాజావెంకటాద్రి పేర్కొన్నారు. బాల్య వివాహక నిరోధక చట్టం–2006 ప్రకారం ఆడపిల్లకు 18, మగపిల్లాడికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాల్య వివాహం చేస్తే మత పెద్దలకు, వివాహానికి హాజరైనవారికి రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ సూయజ్‌ మాట్లాడుతూ యువత చదువుతో పాటు సామాజిక అంశాలపై ప్రజలకు మేలు కలిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. మహిళా నాయకురాలు టీ అరుణ మాట్లాడుతూ అధిక శాతం యువత టీవీలు, సెల్‌ఫోన్ల ప్రభావంతో చిన్న వయస్సులోనే ప్రేమ పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత మంచి మార్గంలో నడిచి వారి కుటుంబాలకు, సమాజానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు.

కొమరోలు బాలికకు అభినందనలు
కొమరోలులో గత ఏడాది ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు వారి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో విషయం తెలుసుకొని పోలీసు స్టేషన్‌కు వెళ్లి వివాహాన్ని ఆపించిన బాలికను సమావేశానికి ప్రత్యేకంగా పిలిపించి అభినందించారు. ఆ బాలిక తన స్నేహితుల సహాయంతో ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బాల్య వివాహ ప్రయత్నాన్ని తిప్పికొట్టడంపై చైర్‌పర్సన్‌తో పాటు మిగిలిన అధికారులు ఆ బాలికను ప్రశంసించారు.రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు టీ రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ భారతి, మహిళా శిశు సంక్షేమశాఖ ఏపీడీ జీ విశాలాక్షి, హెల్ప్‌ పారాలీగల్‌ వలంటీర్‌ బీవీ సాగర్, డీసీపీఓ జ్యోతిసుప్రియ, రైజ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top