
నమూనా గణన–2023 నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పెళ్లిళ్లలో 1.6 శాతం బాల్య వివాహాలే ఉంటున్నాయి. 18 ఏళ్ల వయసులోనే వారికి వివాహాలు చేసేస్తున్నారు. పల్లెల్లో ఈ రేటు 2 శాతం ఉండగా, పట్టణాల్లో 0.4 శాతంగా నమోదయ్యింది. తాజాగా విడుదలైన నమూనా గణన–2023 నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.
అందులోని ముఖ్యాంశాలు చూస్తే.. దేశంలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 6.3 శాతం మహిళలకు 18 ఏళ్లలోపు వివాహం అవుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 4.6 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 7.6 శాతంగా ఉండడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ (4.6 శాతం), ఛత్తీస్‌గఢ్ (3.0) నిలిచాయి. అత్యల్ప స్థాయిలో గణాంకాలు నమోదైన రాష్ట్రాల్లో కేరళ (0.1 శాతం), హరియాణ (0.6 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (0.4 శాతం) నిలిచాయి. జాతీయ స్థాయిలో చూస్తే 2.1శాతం మందికి 18 ఏళ్ల లోపు పెళ్లిళ్లు అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 2.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 1.2 శాతంగా ఉంది.