న్యాయవాదులపై పోలీసుల దాడి ! | Munsiff Magistrate Court, the lawyers had been attacked by the police | Sakshi
Sakshi News home page

న్యాయవాదులపై పోలీసుల దాడి !

Nov 24 2013 3:08 AM | Updated on Sep 2 2017 12:54 AM

మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జరిగిన మెగా లోక్‌అదాలత్‌లో తమపై పోలీసులు దాడి చేసినట్లు న్యాయవాదులు ఆరోపిస్తూ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.

శృంగవరపుకోట, న్యూస్‌లైన్ :మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జరిగిన మెగా లోక్‌అదాలత్‌లో  తమపై పోలీసులు దాడి చేసినట్లు న్యాయవాదులు ఆరోపిస్తూ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోర్టు ఆవరణలో న్యాయమూర్తి వి. నరేష్ ఆధ్వర్యంలో మెగా లోక్‌అదాలత్ నిర్వహించారు. దీనికి ఎస్.కోట, వేపాడ, జామి, లక్కవరపుకోట మండ లాలకు చెందిన  కక్షిదారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కేసులు రాజీ చేస్తున్న సమయంలో   ఒక్కసారిగా గలాటా జరగడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. న్యాయవాది మామిడి చంద్రశేఖర్‌పై ఎస్.కోట ఎస్సై సంతోష్‌కుమార్, కానిస్టేబుల్ విజయ్ దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించారని బార్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కామేశ్వరరావు, జి.ప్రకాష్, ఇతర న్యాయవాదులు ఆరోపించారు. 
 
 న్యాయవాదిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయమూర్తి నరేష్‌కు ప్రత్యేక పిటీషన్ ఇచ్చారు. అనంతరం విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది చంద్రశేఖర్ మాట్లాడుతూ, మనోవర్తి కేసుకు సంబంధించి చర్చలు జరుగుతుండగా ఎస్సై సంతోష్‌కుమార్, కానిస్టేబుల్ విజయ్ తనపై ఒక్కసారిగా దాడి చేశారన్నారు. దళితుడినైనా తనను కులం పేరుతో దూషించారని తెలిపారు. ఈ విషయమై ఎస్సై సంతోష్‌కుమార్ మాట్లాడుతూ, విచారణ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు న్యాయమూర్తి సమక్షంలో గొడవ పడ్డారని, వారిని విడిపించి చెరోవైపు కూర్చోబెట్టాం తప్ప ఎవ్వరినీ కొట్టలేదని స్పష్టం చేశారు.  ఈ విషయమై సీఐ బుచ్చిరాజును వివరణ కోరగా కోర్టులో జరిగిన సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. తమ సిబ్బంది అతిగా ప్రవర్తించినా, తప్పు చేసినట్లు రుజువైనా చర్యలు తప్పవన్నారు.  
 
 దాడి అమానుషం 
 న్యాయవాది మామిడి చంద్రశేఖర్ పోలీసులు దాడి చేయడం అమానుషమని వైఎస్సార్‌సీపీ నాయకుడు కుంభా రవిబాబు అన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రఘురాజుతో కలిసి న్యాయవాదిని పరామర్శించారు. సీఐ బుచ్చిరాజుతో మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఐని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement