హైకోర్టును ఆశ్రయించిన పత్తికొండ న్యాయవాదుల సంఘం
ఆ పోలీసులపై చర్యలకు ఆదేశించండి..
స్వతంత్ర సంస్థతో విచారణ చేయించండి
ఫిర్యాదు చేసినా డీజీపీ, డీఐజీ పట్టించుకోవడం లేదు
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై న్యాయవాదులు న్యాయ పోరాటానికి దిగారు. ఇటీవల ఓ కేసులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి పోలీసులు అరెస్టు చేయడం.. అడ్డుకునేందుకు యత్నించిన న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యానికి దిగటాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
సరెండర్ పిటిషన్ దాఖలు చేసి కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న నిందితుడిని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. చిప్పగిరి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సతీష్ కుమార్, కానిస్టేబుళ్లు షబ్బీర్, రామోజీ, పత్తికొండ ఎస్‌ఐ ఆర్.విజయ్‌కుమార్ నాయక్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్ తన పిటిషన్‌లో హైకోర్టుకు నివేదించారు.
జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాలులోకి చొరబడి నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటనపై జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ లేదా జిల్లా జడ్జి సూచించిన అధికారి లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు. పోలీసుల దౌర్జన్యంపై వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయని పిటిషన్‌లో నివేదించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు దూకుడుగా వ్యవహరించారన్నారు. మేజి్రస్టేట్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టుకు విన్నవించారు.
కోర్టు హాల్లోకి దూసుకెళ్లిన పోలీసులు..
చిప్పగిరి మండలం డేగులపాడుకి చెందిన శివయ్య గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో లొంగిపోయేందుకు గత నెల 24న పత్తికొండ కోర్టుకు వచ్చిన నిందితుడు తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై న్యాయాధికారి నిర్ణయం కోసం శివయ్య కోర్టులో నిరీక్షిస్తుండగా పోలీసులు మఫ్టీలో కోర్టు హాల్లోకి చొరబడి శివయ్యను లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకోబోయిన న్యాయవాదులను తోసివేశారు.
కోర్టు హాలులోకి ప్రవేశించేందుకు సంబంధిత న్యాయాధికారి అనుమతి తీసుకోకపోవడం, పోలీసుల దౌర్జన్యంపై పత్తికొండ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ, డీఐజీలకు ఈ నెల 5న పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు.


