మున్సిపల్ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు | Municipal officials, TDP leaders and pressures | Sakshi
Sakshi News home page

మున్సిపల్ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు

Jun 26 2014 2:34 AM | Updated on Oct 16 2018 6:27 PM

మున్సిపల్ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు - Sakshi

మున్సిపల్ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు

మున్సిపల్ స్థలంలో పాక వేసినది మా పార్టీ మాజీ కౌన్సిలర్.. దాని జోలికి వెళ్లవద్దు.. తర్వాత మాట్లాడుకుందాం.. అర్థమైందా.. మరోసారి చెప్పించుకోకండి...’

 రిమ్స్ క్యాంపస్: ‘మున్సిపల్ స్థలంలో పాక వేసినది మా పార్టీ మాజీ కౌన్సిలర్.. దాని జోలికి వెళ్లవద్దు.. తర్వాత మాట్లాడుకుందాం.. అర్థమైందా.. మరోసారి చెప్పించుకోకండి...’ ఈ మాటలు మున్సిపల్ అధికారులకు ఫోన్‌లో హెచ్చరిక ధోరణిలో చెప్పినది అధికార పార్టీకి చెందిన అగ్రనాయకులు. మున్సిపల్ స్థలం కబ్జా ఏమిటీ... చర్య తీసుకోవద్దనడమేమిటీ.. ఆసక్తిగా ఉందా.. అయితే వివరాల్లోకి వెళదాం...
 
 శ్రీకాకుళం పట్టణంలో కంపోస్టు కాలనీలో వాటర్ ట్యాంకు ఎదురుగా మున్సిపల్ స్థలం కబ్జాకు గురవుతోంది. పేదలు పాకలు వేసుకుని ఉన్నారు కదాని అధికారులు చూసీ చూడనట్లు ఉన్నారు. టీడీపీ మాజీ మహిళా కౌన్సిలర్ కన్ను ఆ స్థలంపై పడింది. తన హయాంలో ఆమె కూడా ఓ పాక వేశారు. సుమారు ఐదు సెంట్ల స్థలాన్ని ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. మాజీ కౌన్సిలర్ కావడంతో మున్సిపల్ అధికారులు తన వరకు రాకుండా ఆపగలిగారు. కానీ ఈ విషయం బయటకు తెలియడంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ పాకను ఇటీవల జేసీబీతో తొలగించారు. అధికారుల పని అధికారులు చేసినా మాజీ మేడమ్ మాత్రం తన పట్టు వదల్లేదు.. సుమారు 15 నుంచి 20 లక్షలు విలువ చేసే ఆ స్ధలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. మున్సిపల్ అధికారులు పాకను తొలగించిన చోటే మరో పాకను ఏర్పాటు చేశారు. ఆ పాక పేదలే వేసుకున్నారని అనుకునేలా ప్రణాళిక రూపొందించారు.
 
 ఆ పాకలో తమకు తెలిసిన పేదవారిని ఆ ఇంట్లో ఉంచారు. తన పేరు బయటకు రావడంతో కబ్జా ఎక్కడ ఆగిపోతుందోనని భయంతో ఆ మాజీ కౌన్సిలర్ తాజాగా అధికారంలోకి వచ్చిన తమ పార్టీ అగ్రనేతలను కలిశారు. ఆ స్థలం తనకు కావాలని, అందుకోసం సాయం చేయాలని కోరారు.  తమ పార్టీ మాజీ కౌన్సిలర్ కావటం ఒకటైతే, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కౌన్సిలర్‌గా పోటిచేసే అర్హత ఉన్న వ్యక్తి కావటంతో ఆ ఇద్దరు నేతలు ఓకే అన్నారు. వెంటనే మున్సిపల్ అధికారుల ఫోన్లు రింగయ్యాయి.  తమ పార్టీకి చెందిన వారి స్థలం జోలికి వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. కబ్జాదారులకు టీడీపీ నాయకులు కొమ్ముకాయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
 
 పాక తొలగింపునకు చర్యలు
 కంపోస్టు కాలనీలో మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురవుతున్న మాట వాస్తవమే. గతంలో అక్కడ వేసిన పాకను స్వయంగా వెళ్లి తొలగించాం. మళ్లీ అక్రమణదారులు పాక వేసినట్టు తెలిసింది. ఆ పాకను తొలగించేందుకు చర్యలు చేపడతాం. మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురికాకుండా చూస్తాం.
 -ఎం.సత్యమూర్తి, టీపీవో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement