
ఆందోళనకారులతో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ అనూష
కందుకూరు అర్బన్: కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు నిరంకుశ పాలన పరాకాష్టకు చేరింది. ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అన్న క్యాంటీన్ పేరుతో పేదల పొట్టకొట్టారు. పట్టణంలోని పాత చేపల మార్కెట్ వద్ద ఉన్న బంకుల తొలగింపుపై వారం రోజులుగా రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం మున్సిపల్ కమిషనర్ కె.అనూష పోలీసు బలగాలతో బంకుల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే బంకులు తొలగించాలని కమిషనర్‌ను కోరారు. అన్న క్యాంటీన్‌కు అవసరమైన స్థలం పోను మిగిలి ఉన్న ఫుట్‌పాత్‌పై, లేదా గుండం కట్టపై బంకులు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయినా కమిషనర్ పట్టించుకోలేదు. ముందు ఖాళీ చేయాల్సిందేని ఒత్తిడి చేయడంతో కనీసం ఐదు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే సమయం మించి పోయిందంటూ కమిషనర్ తక్షణమే బొంకులు తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
అన్యాయం..అక్రమం
అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల నుంచి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసుకుని నెలనెలా బిల్లులు కట్టడంతో పాటు 20 కుటుంబాలు మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నా ఎందుకు పేదల పొట్టకొడుతున్నారని అధికారులను నిలదీశారు. క్యాంటీన్ 10 గదుల్లో నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలున్నా ప్రైవేటు వ్యక్తులకు స్థలాన్ని ధారాదత్తం చేయడం కోసం బంకులు తొలగించడం భావ్యం కాదన్నారు. కొంత సమయం ఇస్తే బంకులు తొలగిస్తామని చిరువ్యాపారులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నాయకులు అధికారులను నిలదీశారు. ఆందోళనకు దిగిన గౌస్, బాలకోటయ్య, రఫీతో పాటు మరి కొంతమందిని ఆరెస్టు చేసి పొన్నలూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత జేసీబీలతో బంకులు గుల్ల చేసి బయటకు తరలించారు. స్థలం చూట్టూ కంచె నిర్మించారు. బంకుల్లో ఉన్న సామగ్రి కూడా తీసుకొనే సమయం ఇవ్వకుండా తొలగించడంతో రోడ్డున పడ్డామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్టేసింది ఇందుకేనా?
బాధితులు తమకు జురిగిన అన్యాయంపై మండిపడుతున్నారు. బంకులు తొలగించొద్డని ఎమ్మెల్యేను కలిసి వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. ఆయనకు ఓట్లేసింది ఇందుకేనా అని నిలదీస్తున్నారు. వెంటనే బంకుల నిర్వాహకులకు నష్టపరిహారం చెల్లించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో యాసిన్, జిలానీ, మాజీ కౌన్సిలర్ ఖాదర్‌బాషా ఉన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గణేషం గంగిరెడ్డి, పంది కోటేశ్వరరావు, తన్నీరు రమేష్, నగళ్ల నారయ్య, సుల్తాన్, జహీంగీర్‌బాషా, జె.కోటేశ్వరరావు, సీపీఐ నాయకులు బి.సురేష్‌బాబు పాల్గొన్నారు.