సమరానికి నేడే ప్రారంభం

సమరానికి నేడే ప్రారంభం

 సాక్షి, రాజమండ్రి :‘బ్యాలట్ సమ్మర్’గా పరిగణించదగ్గ ఈ వేసవిలో జరిగే ఎన్నికల పోరాటాల్లో తొలి సమర సంరంభం నేటి నుంచి ప్రారంభమవుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుడుతూ అన్ని మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మున్సిపాలిటీలకు 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకూ ప్రత్యేక అధికారుల పాలనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టుకు వచ్చింది. రాజకీయ వాతావరణం  తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నందునే ఎన్నికలను కావాలని వాయిదా వేస్తూ వస్తోందన్న అపప్రథను మూటకట్టుకుంది. రాజమండ్రి నగర పాలక సంస్థకు 2012లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా అక్కడ కూడా వాయిదా మంత్రమే అదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు..

 

 నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని గత నెల మూడున ఆదేశించడంతో ఇక పురపోరు నిర్వహణకు నడుం బిగించక తప్పలేదు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని 264 వార్డుల్లో కౌన్సిలర్ పదవులకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11.00 గంటలకు కమిషనర్లు నోటిఫికేషన్ వెలువరిచిన వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలో 50 డివిజన్‌ల కార్పొరేటర్ పదవులకు కూడా ఇదే సమయంలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. రోజూ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు.  మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 14వ తేదీ తుది గడువు కాగా రాజమండ్రిలో ఆ గడువు 13వ తేదీతోనే ముగియనుంది.

 

 ‘పురపోరు’కు అంతా సిద్ధం : ఆర్డీ

 మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేశామని ఆ శాఖ రీజనల్ డెరైక్టర్ రమేష్‌బాబు చెప్పారు. సహాయ ఎన్నికల అధికారులు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారని పేర్కొన్నారు. కావల్సిన పత్రాలను నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఇప్పటికే సిద్ధం చేశారన్నారు. తొలిఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని సన్నాహాలూ పూర్తయినట్టు తెలిపారు.

 

 ముహూర్తం మంచిదే కానీ..

 తిథి, వార, నక్షత్రాల ప్రకారం సోమవారం ఉదయం 11.00 గంటల నుంచి శుభ ఘడియలే. కానీ తొలిరోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలు కావచ్చని భావిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. మేయర్, చైర్ పర్సన్‌ల అభ్యర్థులపై ఆదివారం రాత్రి వరకూ ఓ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజులు మాత్రమే నామినేషన్లు ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, బీజేపీ తదితర పార్టీలు ప్రధానంగా బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పోటీ మాత్రం ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కుదేలైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా బరిలోకి దిగుతారా, లేదా అనేది ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉంది.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top