ఉద్యమమే ఊపిరిగా జిల్లా ప్రజలు అలుపెరుగని సమరం సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర తప్పా మరో ప్రత్యామ్నాయం లేనేలేదంటూ తెగేసి చెబుతున్నారు.
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : ఉద్యమమే ఊపిరిగా జిల్లా ప్రజలు అలుపెరుగని సమరం సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర తప్పా మరో ప్రత్యామ్నాయం లేనేలేదంటూ తెగేసి చెబుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు... ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారు కదం తొక్కుతుండడంతో ‘సమైక్య’ సమరం ఉవ్వెత్తున సాగుతోంది. 54వ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. అనంతపురంలో జాక్టో నేతలు దీక్షలు కొనసాగిస్తూనే.. చెవిలో పూలు పెట్టుకుని, బూట్లు శుభ్రం చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఉద్యోగ జేఏసీ నేతలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు.
అలాగే వేపాకు మండలతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, ఎన్‌జీఓలు, పంచాయితీరాజ్, హౌసింగ్, రెవెన్యూ, హంద్రీ-నీవా, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 24న జిల్లాలో తలపెట్టిన మహా మానవహారం విజయవంతం కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో వివిధ సంఘాల జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో బహుజన మేధావుల సదస్సు నిర్వహించి.. ఉద్యమానికి మద్దతు పలికారు. జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన సర్పంచులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి.. ప్రభుత్వానికి పంపారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏన్‌టీయూ ఉద్యోగులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. మడకశిరలో విద్యార్థులు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రోడ్డుపైనే చదువులు కొనసాగించారు. అమరాపురంలో ఉపాధ్యాయులు రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించి... కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ధర్మవరంలో బ్రాహ్మణులు రోడ్డుపైనే యజ్ఞం చేశారు. ధర్మవరంతో పాటు బత్తలపల్లి, ముదిగుబ్బ, ఆత్మకూరు, గోరంట్ల, పుట్టపర్తి, బుక్కపట్నం, పెనుకొండ, పామిడి, గుత్తి, రొద్దం, పరిగి, కణేకల్లులో సమైక్యవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగాయి.
గుంతకల్లులో వేలాది మంది వాల్మీకులు గర్జించారు. ర్యాలీ, బహిరంగసభతో ‘సమైక్య సింహ గర్జన’ చేశారు. జేఏసీ నేతలు రోడ్డుపైనే మిరపకాయలు, బజ్జీలు విక్రయించి నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు రిలేదీక్షలను కొనసాగించారు.లేపాక్షిలో సోమవారం తలపెట్టిన ‘బసవన్న రంకె’ సభకు సర్వం సిద్ధం చేశారు. హిందూపురంలో ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. కేసీఆర్ దిష్టిబొమ్మకు బడిత పూజ చేశారు. కదిరిలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
ఈ నెల 24న నిర్వహించనున్న మహా మానవహారంపై కదిరి డివిజన్‌లోని అన్ని మండలాల్లోనూ విస్తృత ప్రచారం చేశారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు చెవిలో పూలు, పొర్లు దండాలు, మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఎరుకల కులస్తులు, న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. ఓడీసీలో జేఏసీ నేతలు రాస్తారోకో చేపట్టారు. కొత్తచెరువులో రిటైర్డ్ ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. పుట్టపర్తిలో జేఏసీ నేతలు మోకాళ్లపై నడుస్తూ, పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. పెనుకొండలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లిలో సమైక్యవాదులు రిలే దీక్షలు చేపట్టారు. జేఏసీ నేతలు గడ్డితింటూ నిరసన తెలిపారు. పరిగిలో జేఏసీ నేతలు ఈలలు వేస్తూ ర్యాలీ చేశారు. రాయదుర్గంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు.
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, రాజకీయ జేఏసీ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. క్లబ్ హోటల్ రామయ్య ఉచితంగా టిఫిన్ పెట్టారు. మేదర్లు రోడ్డుపైనే బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. కణేకల్లులో కుమ్మర్లు కుండలు చేస్తూ నిరసన తెలిపారు. నార్పలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. సోనియా, షిండే, దిగ్విజయ్, కేసీఆర్ మాస్కులు ధరించిన వ్యక్తులను కొరడాలతో కొడుతూ నిరసన ప్రదర్శన చేశారు. ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థులు రిలేదీక్షలు చేశారు. మహిళా ఉద్యోగులు గాలిపటాలు ఎగురవేసి నిరసన తెలిపారు. పెద్దపప్పూరులో జాతీయపతాకంతో జేఏసీ నేతలు ర్యాలీ చేపట్టారు. యాడికిలో రాయలచెరువు, యాడికి గ్రామనౌకర్లు రిలేదీక్షలు చేశారు. ఉరవకొండలో సమైక్యవాదులు, ఉద్యోగ జేఏసీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఉరవకొండ, కూడేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల రిలేదీక్షలు కొనసాగాయి.