ఢిల్లీకి మరిన్ని పాలు


రైల్వే మిల్క్ ట్యాంకర్లను పెంచేందుకు అధికారుల నిర్ణయం

నేడో రోపో అనుమతులు

 

 సాక్షి,చిత్తూరు : ఢిల్లీకి మరిన్ని పాలు పంపేందు కు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నేతృత్వంలో ప్రణాళిక సిద్ధంచేశారు. ఇప్పటికే రైల్వే మిల్క్ ట్యాం కర్ల కోసం రైల్వే శాఖతో చర్చలు జరిపారు. పాలు సరఫరాకు సంబంధించి ట్యాంకర్లను ఇచ్చేందుకు రైల్వేశాఖ అంగీకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఒకటిరెండు రోజు ల్లో అనుమతులు వెలువడనున్నట్లు తెలుస్తోం ది. అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాలో బల్క్‌మిల్క్ సెంటర్లద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న పాలలో లక్ష లీటర్లకు పైగా పాలను ఢిల్లీకి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



ఇప్పటి వరకు ప్రభుత్వం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో బల్క్‌మిల్క్ సెంటర్ల ద్వారా ప్రతిరోజూ 2.75 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. ఇందులో 2.5 లక్షల లీటర్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఢిల్లీకి సైతం సరఫరా చేస్తోంది. జిల్లాలో రోజూ 22 నుంచి 24 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. వాటిలో గృహ, ఇతర అవసరాలకు పోను మిగిలిన 14 లక్షల లీటర్ల పాలు మార్కెట్‌కు వస్తున్నాయి. డిమాండ్ లేదన్న సాకుతో ఇటీవల ప్రైవేటు డెయిరీలు పాల కొనుగోలును తగ్గించాయి. ధరలను సైతం తగ్గించేశాయి.



గిట్టుబాటు ధర లభించకపోవడంతో పాల రైతులు కుదేలవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బల్క్‌మిల్క్ సెంటర్ యూనిట్ల ద్వారా రోజుకు 2.75 లక్షల లీటర్లు పాలు మాత్రమే మొక్కుబడిగా కొనుగోలు చేస్తోంది. ఉత్పత్తి అవుతున్న పాలు కొనేనాథుడు లేకపోవడంతో పాడి రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో ప్రభుత్వం ద్వారా పాలకొనుగోలును పెంచేందుకు స్థానిక అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రభుత్వమే చిత్తూరు పాలను సరఫరా చేయాలని నిర్ణయించింది.



 మన పాలు మనకే..

 మరోవైపు మన పాలు మనకే అనే నినాదంతో జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలను ఇక్కడే వినియోగించే విధంగా జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా పాల వినియోగం పెరిగేలా అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, అన్ని విభాగాలకు చెందిన వసతి గృహాలకు ప్రభుత్వం బీఎంసీల ద్వారా సేకరించిన పాలను సరఫరా చేయాలని నిర్ణయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top