ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాడని రెండేళ్ల పాలనలో ప్రజలు గమనించారని, 2019 ఎన్నికల్లో
విజయనగరం మున్సిపాలిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాడని రెండేళ్ల పాలనలో ప్రజలు గమనించారని, 2019 ఎన్నికల్లో వారు తగిన బుద్ధి చెప్పటం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఆయ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో నిర్వహించిన మహానాడులో ఒక్కటైనా ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయకపోగా.. ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలనైనా ప్రస్తావించకపోవటం విచారకరమన్నారు .
ప్రపంచం ఆశ్చర్యపడేలా రాజధాని నిర్మిస్తామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు, ఈవిషయంలో జగన్‌మోహన్‌రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ చేస్తున్న విషప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధాని నిర్మాణానికి జగన్ అడ్డుపడుతున్నారన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు చూపించగలరా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేక, సాయం చేయమని అడగలేక, బీజేపీ కాళ్ల ముందు మోకరిల్లుతున్న చంద్రబాబు ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు.
కోటీశ్వరులైన సుజనాచౌదరి, టీజే వెంకటేష్‌లకు రాజ్యసభ సీట్లు కేటాయించేందుకు ఎన్ని రూ.కోట్ల ముడుపులు తీసుకున్నారో, విపక్ష ఎమ్మెల్యేల కొనుగోలుక డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియజేయాలన్నారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభ టిక్కెట్టు ఖరారు చేసేముందు, విశాఖ ప్రత్యేక జోన్ ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాపాలు చేసిన వారే దేవాలయాల హుండీలో డబ్బు వేస్తారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించి భక్తు మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఆయన వెన్నుపోటు రాజకీయాలకు ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తూనే ఉంటుందన్నారు.