ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

MLC Election Schedule Released In Two Telugu States - Sakshi

ఎమ్మెల్యే కోటాలో స్థానాలకు ఎన్నిక ఆగస్టు 26న

తెలంగాణలో ఒకటి, ఏపీలో మూడు స్థానాలకు.. 

ఆగస్టు 7న నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ గురువారం షెడ్యూలు జారీ చేసింది. తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలోని ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి పదవీకాలం జూన్‌ 3, 2021 వరకు ఉండగా.. ఆయన సభ్యత్వం జనవరి 16, 2019న అనర్హతకు గురైనందున ఖాళీ ఏర్పడింది. ఈ స్థానానికి ఆగస్టు 26న ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తాజా షెడ్యూలులో పేర్కొంది. ఆగస్టు 7న ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీకానుంది. నామినేషన్లకు 14వ తేదీ వరకు గడువుంది. అలాగే ఆగస్టు 16 వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 19వ తేదీ గడువుగా నిర్దేశించారు. ఆగస్టు 26న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

ఏపీలో మూడు స్థానాలకు: ఏపీ శాసన మండలిలో ముగ్గురు సభ్యుల రాజీనామా నేపథ్యంలో ఎమ్మెల్యో కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), కోలగట్ల వీరభద్రస్వామిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో జూన్‌ 6, 2019న రాజీనామా చేశారు. వీరి పదవీకాలం మార్చి 29, 2023 వరకు ఉండగా మధ్యలోనే రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్ప డ్డాయి. ఈ ఎన్నిక ఆగస్టు 26న నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీచేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top