అధికారంలోకి రాగానే గాలేరు–నగరి పూర్తి

MLA Roja fight On Women's Issue : Midhun Reddy - Sakshi

ఎమ్మెల్యే రోజా పుట్టిన రోజు వేడుకల్లో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఉద్ఘాటన 

 మహిళా సమస్యలపై రోజా పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంస

నగరి: తాము అధికారంలోకి రాగానే గాలేరు–నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని, నగరి అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండా వేధిస్తోందని అన్నారు. శనివారం నగరిలో జరిగిన రోజా పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళా సమస్యలపై ఎమ్మెల్యే రోజా చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. సర్కారు నిధుల కోసం వేచి చూడకుండా రోజా సొంత నిధులతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తోందన్నారు. పథకాల కోసం ఖర్చు ఎక్కువవుతున్నా వెనకడుగు వేయలేదని చెప్పారు. వచ్చే పుట్టిన రోజుకు ఎమ్మెల్యే కంటే పెద్ద పోస్టులో ఆమెను చూడాలని ఉందని ఆకాంక్షించారు.

నగరి నియోజకవర్గం తల్లిలాంటిది: రోజా
తన చిరకాల వాంఛను నెరవేర్చిన నగరి నియోజకవర్గం కన్నతల్లిలాంటిదని ఎమ్మెల్యే రోజా అన్నారు. నగరి ప్రజలు ఏ సమయంలో అయినా తనను కలిసి కష్టాలు చెప్పుకోవచ్చని తెలిపారు. సర్కారు నిధులు ఇవ్వకపోయినా సొంత డబ్బుతో అయినా మేలు చేసేం దుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాలల్లో మంచినీళ్ల ప్లాంట్లు, ఫ్యాన్లు, పండ్లు అమ్ముకునే వారికి తోపుడు బండ్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం పేదలకు సంక్షేమ ఫలాలు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.

 ప్రజలు సంక్షేమ ఫలాలు పొందాలంటే జన్మభూమి కమిటీల వద్ద చేతులు కట్టుకొని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారని వాపోయారు. జన్మభూమి కమిటీల్లో రౌడీలు, గూండాలు ఉన్నారని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమాన్ని చంద్రబాబు రౌడీల చేతిలో పెట్టారని దుయ్యబట్టారు. నగరిలో ఎమ్మెల్సీ ఉన్నా గాలేరు–నగరి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులపై ప్రేమలేదు కాబట్టే ప్రాజెక్టు పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే చంద్రబాబునాయుడు రాహుల్‌గాంధీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఒంటరిగా పోటీ చేసిన పాపానపోలేదన్నారు. జగన్‌ సీఎం అయితేనే  రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రోజా పుట్టిన రోజు వేడుకల్లో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుత్తూరు నుంచి పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కువైట్‌లోనూ జన్మదిన వేడుకలు జరిగాయి.

యాప్‌తో ప్రజలకు మరింత చేరువ..
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు విన్నవించేందుకు ‘మై ఎమ్మెల్యే’ యాప్‌ను శనివారం అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కస్తానని ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. ఈ యాప్‌ను మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రారంభించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top