ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే రాజ్‌

MLA Jaya Nageswar Rao Corruption Special Story - Sakshi

ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే రాజ్‌

పనులన్నీ జయనాగేశ్వరరెడ్డి కనుసన్నల్లోనే ఇతర నేతలకు ఒక్క పనీ ఇవ్వని వైనం

ఉద్యోగాల నుంచి కాంట్రాక్టుల వరకూ అన్నింటిలోనూ పర్సెంటేజీల పర్వం

పోస్టింగుల కోసమూ వసూళ్లు

అదే బాటలో అనుచరులు, అధికార పార్టీ నేతలు

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్‌ నడుస్తోంది. నియోజకవర్గంలో అటు పుల్ల ఇటు జరగాలన్నా ఎమ్మెల్యే  అనుమతి తప్పనిసరనే రీతిలో వ్యవహారం సాగుతోంది. అంగన్‌వాడీ పోస్టుల నుంచి నీరు–చెట్టు  కాంట్రాక్టుల వరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తేనే అడుగు ముందుకు పడే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన నీరు–చెట్టు పనులను చేపట్టారు.  అన్ని పనులను ఒక పెద్ద కాంట్రాక్టర్‌కు అప్పగించి 20 శాతం మేర కమీషన్‌ తీసుకున్నారన్న విమర్శలున్నాయి. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యే పీఏ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయంలో ఏకంగా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రికి నేరుగా ఒక బాధితురాలు  ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమ మాట చెల్లుబాటు కాకుండా చేస్తున్నారని పార్టీ నేతలు అధిష్టానానికి  ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని  తిరిగి చెల్లించడం లేదంటూ అధికార పార్టీకే చెందిన నేతలు మంత్రి లోకేష్‌ను కలిసి విన్నవించారు. మరోవైపు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పుష్పావతి... ఎమ్మెల్యే తనకు నీరు–చెట్టు పనులు ఇవ్వలేదంటూ ఏకంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి  ప్రత్యేకంగా రూ.4 కోట్ల పనులు మంజూరు చేయించుకున్నారు.

సాక్షి ప్రతినిధి, కర్నూలు :మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. తమ సమస్యలను పరిష్కరించి ‘చేనేత పురి’ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నియోజకవర్గ ప్రజలు ఆశించారు. ప్రజలు ఒకటి తలిస్తే.. ఎమ్మెల్యే మరొకటి తలిచారు. పదవి మళ్లీ వస్తుందో, లేదో అనుకున్నాడేమో గానీ.. ‘సొంత’ వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలోనే బిజీ అయిపోయారు. ‘ఇందుగలడు అందులేడని సందేహము వలదు’ అన్నట్లుగా అన్నింటా ‘స్వప్రయోజనాలకే’ పెద్దపీట వేస్తున్నారు. తన వ్యవహారాలను చక్కబెట్టడానికి ఏకంగా ఆరుగురితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంచి స్థానంలో పోస్టింగ్‌ వేయిస్తానంటూ ఉద్యోగుల నుంచి, నామినేటెడ్‌ పదవులు ఇప్పిస్తానంటూ నాయకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, అభివృద్ధి పనుల్లో ‘వాటా’ దండుకోవడం కూడా నైజంగా మార్చుకున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన బాటలోనే అనుచర గణం, సొంత పార్టీ నేతలు కూడా పయనిస్తుండడం గమనార్హం.

నీరు– చెట్టు.. ఒక్కరికే కట్టబెట్టు!
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ. 50 కోట్లను మంజూరు చేశారు. ఈ పనులను పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఇవ్వలేదు. ఒక పెద్ద కాంట్రాక్టరుకు ఇచ్చి ఆయన వద్ద నుంచి కమీషన్‌ దండుకున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న తమకు కనీసం ఒక్కటంటే ఒక్క పనీ ఇవ్వలేదని వారు వాపోతున్నారు. ఇందులో కనీసం 20 శాతం కమీషన్‌ ఎమ్మెల్యే తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పుష్పావతి వర్గం కూడా ప్రత్యేకంగా రూ.4 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులను మంజూరు చేయించుకుంది. ఈ పనులన్నీ తూతూ మంత్రంగా కానిచ్చి పైసలు దండుకున్నారు. నందవరం మండలంలోని వంకలో మట్టిపెళ్లలు పైకి తీసి నిధులు భోంచేశారు. నీరు–చెట్టు కింద గాజులదిన్నె ప్రాజెక్టు చుట్టూ మట్టి కట్టడాన్ని మరింత గట్టిగా చేసే పని (బండింగ్‌) చేశారు. రెండు నెలలు కూడా గడవకముందే అప్పుడే మట్టి మొత్తం కిందకు పడిపోతోంది. ఈ విధంగా తూతూమంత్రంగా చేసిన పనుల ద్వారా నిధులు కొల్లగొట్టగా.. ఇందులో ఎమ్మెల్యే ఏకంగా రూ.10 కోట్ల మేర  ఆర్జించినట్లు తెలుస్తోంది.  ఇక కొన్ని పనులను కిందిస్థాయి నేతలు కూడా నేరుగా తెచ్చుకున్నారు.   

ఆంజనేయుని భూములపై ‘అధికార’ గద్దలు
నందవరం మండలంలోని నదికైరవాడి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి సర్వే నెం. 4లో 23.89 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువ ఎకరా రూ.15 లక్షలపైమాటే. నదికైరవాడి, ఇబ్రహీం కొట్టాల గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు దేవాలయ భూమిని కబ్జా చేశారు. తమ పేరు మీద పాసు పుస్తకాలు చేయించుకున్నారు. పట్టాదారు ఖాతానెం. 2లో వీరభద్రప్పకు 5.97 ఎకరాలు, అదే ఖాతా నెంబర్‌లో ఎకరా ఉంది. ఖాతా నెం.45లో ఆర్‌.కృష్ణమూర్తికి 3 ఎకరాలు, ఖాతా నెం.88లో తిమ్మప్పకు 6 ఎకరాలు, ఖాతా నెం.5100లో సత్యనారాయణకు 2.95 ఎకరాలు, 5145లో షణ్ముఖకు 5.9 ఎకరాలు ఉన్నట్లు పాసు పుస్తకాలు జారీ చేశారు. టెన్‌వన్‌ అడంగల్‌లోనూ వీరి పేర్లు నమోదు చేశారు. ఆన్‌లైన్‌లోనూ చేర్చేశారు. అయితే.. సర్వే నెం.4లో 23.89 ఎకరాల మెట్ట భూమి శ్రీ ఆంజనేయస్వామికి చెందినదిగా రెవెన్యూ సర్వీసు రికార్డు (ఆర్‌ఎస్‌ఆర్‌)లో ఉంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని రికార్డుల్లో కూడా దేవాలయం భూమిగానే ఉంది.  

వసూళ్లకో టీం
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు వసూళ్ల దందాకు కొత్త విధానాన్ని  తీసుకొచ్చారు. అధికార పార్టీ ముఖ్యనేత పీఏ, రిటైర్డు డీఈ, ప్రస్తుత డీఈ, ఎల్‌ఐసీలో పనిచేసే ఉద్యోగితో పాటు పోలీసుశాఖలోని ఓ ఉద్యోగి కూడా ముఖ్యపాత్ర పోషిస్తుండటం గమనార్హం. ఏయే శాఖలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎంత మేర అక్రమంగా ఆర్జిస్తున్నారనే వివరాలను ఈ టీం సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నెలవారీగా అధికార పార్టీ నేతలకు మామూళ్లు అందించాల్సిన ప్రత్యేక దుస్థితి ఈ నియోజకవర్గంలో మాత్రమే నెలకొంది. ఇక ఎమ్మెల్యే సొంత పార్టీ నేతల నుంచి డబ్బు తీసుకుని.. తిరిగి చెల్లించడం లేదన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకే చెందిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సాయి సరస్వతి నేరుగా మంత్రి లోకేష్‌ను కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, తమను మోసం చేశారని వారంతా వాపోతున్నట్లు అధికార పార్టీ నేతలే అంటున్నారు.

మున్సిపల్‌ స్థలంపై ‘దేశాయి’ పడగ
ఎమ్మిగనూరు పట్టణ నడిబొడ్డుగా పేర్కొనే గీతామందిరం వెనుక ఉన్న 33 సెంట్ల మున్సిపల్‌ స్థలం తమదేనంటూ టీడీపీ జిల్లా కార్యదర్శి మాధవ్‌రావు దేశాయి కబ్జాకు దిగాడు. దీని ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.3 కోట్ల పైమాటే. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అండదండలున్నాయని, ఆర్థిక లావాదేవీలు పూర్తయ్యాయంటూ ఏకంగా మున్సిపల్‌ కార్యాలయంలోనే హల్‌చల్‌ చేశాడు. అందులో నిరుపేదలు వేసుకొన్న కొట్టాలు తొలగించి తనకు స్థలం అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీచేస్తున్నాడు. కానీ రికార్డుల మేరకు ఎల్‌పీసీ 420 నెంబర్‌తో మున్సిపల్‌ స్థలంగా నమోదయ్యింది.   

ఎమ్మెల్యే పీఏపై ఫిర్యాదులు
ఎమ్మిగనూరు నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ)పై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ నుంచి భారీగా డబ్బు వసూలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.  డీఆర్‌డీఏ–వెలుగులో ఏపీఓ ఉద్యోగం ఇప్పిస్తానంటే పీఏకు రూ.3 లక్షలు ఇచ్చానంటూ ఓ బాధితురాలు ఏకంగా జిల్లా కేంద్రానికి వచ్చి మరీ ఫిర్యాదు చేశారు. ఇందుకు అనుగుణంగా కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు.  ఇతర విషయాల్లో కూడా పీఏపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఎమ్మెల్యే వెనకేసుకురావడం గమనార్హం. వాస్తవానికి ఎమ్మెల్యే పీఏ కూడా ఒక అధికార కేంద్రంగా మారిపోయారు. ఆయన కనుసన్నల్లోనే ఎమ్మెల్యే కదలికలు ఉంటాయనే రీతిలో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకు సందేశాలు పంపారు. పీఏకు అనుకూలంగా ఉంటేనే ఎమ్మెల్యే కూడా తమకు సహాయపడతారనే రీతిలో వ్యవహారం సాగింది. ఈ వ్యవహారంపై  విజిలెన్స్‌కు కూడా ఫిర్యాదులందాయి.  విజిలెన్స్‌ అధికారులు  ప్రాథమికంగా విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉద్యోగాల పేరుతో అధికారపార్టీ నేతలు భారీగానే దండుకున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. 10వ తరగతి పాసైన వారు కూడా పాలిటెక్నిక్‌ కాలేజీకి వెళ్లి.. ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా చెప్పండని అక్కడి సిబ్బందిని అడుగుతున్నారు. అధికార పార్టీ నేతలకు రూ.3 లక్షలు ఇచ్చి లేఖ తెస్తామని అంటున్నారు. ఈ విధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏ వ్యవహారం చూసినా అధికార పార్టీ నేతల అండదండలు లేనిదే ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.   

పుష్పావతిపై కబ్జా ఆరోపణలు
నందవరం మండలం జోహరాపురం గ్రామంలో 3.5 ఎకరాల పోరంబోకు స్థలాన్ని జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్‌ప ర్సన్‌ పుష్పావతి కబ్జా చేసినట్లు  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాల కాలంగా తమ పొలాలపక్కన ఉన్న  పోరంబోకు స్థలాన్ని సాగుచేస్తున్నామని, ఏకంగా జిల్లా కలెక్టర్‌ పేరు చెప్పి జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారని రైతులు వాపోతున్నారు.

దందా ఇలా..
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏ
పనైనా అధికారపార్టీ నేతలకు మామూళ్లు ముట్టనిదే ముందుకు సాగడం లేదు. మునిసిపాలిటీలో కాంట్రాక్టు కార్మికుల నియామకం మొదలు.. అక్రమ వెంచర్ల వరకూ మామూళ్ల వ్యవహారం నడుస్తోంది.  

మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల నియామకం కోసం 70 మంది దగ్గర రూ.80,000 చొప్పున మొత్తం రూ.56 లక్షలు తీసుకున్నారు.  

ఎమ్మిగనూరు తహసీల్దార్‌గా పనిచేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు సేకరించగా.. ఇక సీఐ పోస్టింగ్‌ కోసం రూ.10 లక్షలు తీసుకున్నారు.  

ఎమ్మిగనూరు పట్టణంలో వెలుస్తున్న అక్రమ లే–అవుట్లను కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకూ ఒక్క అధికారిక లేఅవుట్‌ కూడా వేయలేదు. వేసినవన్నీ అక్రమమే. అధికార పార్టీకే చెందిన ఒక నేత పీఏ వేసిన పొలంలో అక్రమ లే–అవుట్లకు అనుమతులు ఇచ్చినందుకు రూ.25 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది.  
ఎద్దుల మార్కెట్‌ దగ్గర వేసిన వెంచర్‌ యజమానుల నుంచి రూ.24 లక్షలు, మంత్రాలయం రోడ్డులో వెలసిన అక్రమ వెంచర్‌ కోసం రూ.28 లక్షల మేర వసూలు చేశారు. ఇవే కాకుండా మరో 12 అక్రమ వెంచర్లకు గాను రూ.1.20 కోట్లు అధి
కార పార్టీ నేతల జేబుల్లోకి చేరాయి.  

నామినేటెడ్, ప్రధాన పాలనా పదవులకు రేట్లు కట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. మార్కెట్‌యార్డు చైర్మన్‌ పోస్టుకు గతంలో రూ.40 లక్షలు, ఇప్పుడు రూ.30 లక్షలు వసూలు చేశారనే విమర్శలున్నాయి. టౌన్‌బ్యాంక్‌ చైర్మన్‌ పోస్టును రూ.25 లక్షలకు ఇచ్చారనే ఆరోపణలూ ఉన్నాయి.  

మండల పరిషత్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కేటాయింపునకు రూ. కోటికిపైగా వసూలు చేశారు. ఇక ఎంపీపీ కాంప్లెక్స్‌లోని మరో రెండు షాపులకు రూ.25 లక్షలు అధికారపార్టీ నేతలకు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది.  

విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో ఆపరేటర్ల నియామకానికి 18 పోస్టులకు గాను ఒక్కొక్క పోస్టుకు రూ.3,00,000 చొప్పున మొత్తం రూ.54 లక్షలు వసూలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top