మంత్రిగారి నజరానా

మంత్రిగారి నజరానా - Sakshi


ఎన్నికల్లో కష్టపడిన తెలుగు తమ్ముడికి ప్రతిఫలం

స్వరాజ్య మైదానం అద్దె రూ.69 వేల నుంచి రూ.15 వేలకు తగ్గింపు

కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చిన జిల్లా అమాత్యుడు

ప్రభుత్వ ఖజానాకు రూ.20 లక్షల నష్టం


 

విజయవాడ : ఇచ్చుకో పుచ్చుకో.. అడ్డంగా దోచుకో.. అన్నట్లుంది ప్రస్తుత సర్కారు తీరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ముఖ్య నేత గెలుపు బాధ్యతను ఓ తెలుగుతమ్ముడు తన భుజానకెత్తుకున్నారు. అభ్యర్థి ప్రచారానికి ఉచితంగా టెంట్లు వేయడం, కావాల్సిన వారందరికీ భోజనాలు పెట్టించడం వంటి పనుల కోసం ఏకంగా రూ.20 లక్షలు ఖర్చుచేశారు. ఆ నేత గెలిచి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇంకేముంది తన సేవలో తరించిన తమ్ముడిని ఆర్థికంగా పరిపుష్టి చేసే పనిలో పడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కి రోజుకు రూ.69 వేల అద్దె ఇస్తామని ముందుకు వచ్చినవారిని కాదని రూ.15 వేలకే స్వరాజ్య మైదానాన్ని ఇప్పించడంలో చక్రం తిప్పినట్లు తెలిసింది.

 స్వరాజ్య మైదానంలో ఏటా వేసవిలో కృష్ణా జిల్లా ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్ నిర్వహించేది. సొసైటీలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో కలెక్టర్ అనుమతుల్ని గతంలోనే నిలిపివేశారు. ఈ క్రమంలో గత ఏడాది ఒక ప్రయివేటు వ్యక్తి ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఏడాది మళ్లీ ఎగ్జిబిషన్ నిర్వహణ సమయం రావడంతో దాదాపు ఆరుగురు అనుమతి కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. భద్రత కారణాలతో కొందరిని, రోజు లీజు వ్యవహారం నచ్చక మరికొందరిని తిరస్కరించారు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించారు. దాన్ని ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్వరాజ్య మైదానం ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్‌గా నిర్ణయించారు. అందులో భాగంగానే ఆఫీసర్స్ క్లబ్, స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న క్యాంటీన్లను రెండు నెలల క్రితమే ఖాళీ చేయించారు. ఈ పరిణామాల క్రమంలో స్వరాజ్యమైదానం అద్దెకు కావాలని కొందరు కోరితే హై సెక్యూరిటీ జోన్ కాబట్టి ఇవ్వలేమని అధికారులు సృష్టం చేశారు. గ్రౌండ్‌ను  మార్చి ఒకటో తేదీ నుంచి 45 రోజుల పాటు లీజుకు ఇవ్వాలని, రోజుకు రూ.69 వేల అద్దె చెల్లిస్తామని హ్యాండ్‌లూమ్ అండ్ హ్యాండ్ ఫన్ ఫెయిర్ నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు. కృష్ణా ఇండస్ట్రియల్ సొసైటీ నిర్వాహకులు మార్చి 20 నుంచి మే 5వ తేదీ వరకు లీజుకు ఇవ్వాలని కోరారు. మరి కొందరు ప్రయివేటు వ్యక్తులు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ అద్దె ఇచ్చేందుకు ముందుకు వచ్చినా వారి దరఖాస్తులను జిల్లా అధికారులు తిరస్కరించారు.ఎగ్జిబిషన్ నిర్వహణలో అనుమతి లేకున్నా..ఎగ్జిబిషన్ నిర్వహణలో ఎటువంటి అనుభవమూ లేని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గరిమెళ్ల నానయ్య చౌదరి (నాని) శ్రీ క్రియేషన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటుచేశారు. వేసవిలో ఎగ్జిబిషన్ నిర్వహించడం కోసం స్వరాజ్య మైదానాన్ని అద్దెకు ఇవ్వాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన మంత్రి ఒకరు పూర్తిస్థాయిలో చక్రం తిప్పి చివరకు కలెక్టర్‌పైనే ఒత్తిడి తెచ్చి మరీ అతితక్కువ అద్దెకు ఇప్పించారు. రూ.69 వేల వరకూ అద్దె ఇచ్చేందుకు ముందుకు వచ్చినవారిని సైతం కాదని ఆయనకు రూ.15 వేలకే మైదానాన్ని కట్టబెట్టారు. నిబంధనలన్నీ తూచ్హై సెక్యూరిటీ జోన్, అధిక మొత్తంలో అద్దె కోట్ చేసినవారికే ప్రాముఖ్యత, ఎగ్జిబిషన్ నిర్వహణలో అనుభవం, సంస్థకు టిన్ నంబర్ వంటి నిబంధనలు ఏవీ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉప్యాక్షుడు గరిమెళ్ల నానికి వర్తించలేదు. ఎందుకంటే వాటన్నిటికంటే బలమైన అధికార పార్టీ అమాత్యుని అండ ఉంది. దీంతో గత నెల 6 నుంచి 30వ తేదీ వరకు రోజుకు రూ.15 వేల అద్దె చెల్లించేలా అధికారులు అతనికి స్వరాజ్య మైదానాన్ని లీజుకు ఇచ్చారు. 30వ తేదీతో గడువు ముగియంతో మళ్లీ మరో 15 రోజులు లీజు పొడిగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి గతంలో పనిచేసిన కలెక్టర్లు ఎగ్జిబిషన్ లీజుల వ్యవహారం తలనొప్పిగా ఉందనే కారణంతో కేటాయింపులు జరపలేదు. అయితే ఈ ఏడాది మాత్రం అధికార పార్టీ ఒత్తిళ్లకు అధికార గణం తలొగ్గక తప్పలేదు. ఫలితంగా 45 రోజుల లీజు ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.20 లక్షల మేర గండిపడింది. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు గరిమెళ్ల నాని సాక్షితో మాట్లాడుతూ తమకు అన్ని అనుమతులు  ఉన్నాయని, టిన్ నంబర్ ఉందని, కమర్షియల్ టాక్స్, మున్సిపల్ టాక్స్ చెల్లిస్తున్నామని వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top