కిరణ్‌కు షాక్ | Ministers, MLAs not interested to join Kiran kumar reddy New party | Sakshi
Sakshi News home page

కిరణ్‌కు షాక్

Feb 25 2014 2:16 AM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్‌కు షాక్ - Sakshi

కిరణ్‌కు షాక్

కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమైన కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ నేతల నుంచే ఆశించిన సహకారం లభించడం లేదు. వెంటే ఉంటామని నిన్నటిదాకా చెప్పిన ప్రజాప్రతినిధులు సైతం ఆయనకు ముఖం చాటేస్తున్నారు.

పార్టీ పెడుతున్నా.. వస్తారా అంటూ వాకబు
పెట్టొద్దన్న కొందరు, మాట్లాడి చెప్తామన్న మరికొందరు
‘కొత్త సీఎం’ తేలేదాకా వాయిదా.. నేడు, రేపూ చర్చలు

 
 సాక్షి, హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమైన కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ నేతల నుంచే ఆశించిన సహకారం లభించడం లేదు. వెంటే ఉంటామని నిన్నటిదాకా చెప్పిన ప్రజాప్రతినిధులు సైతం ఆయనకు ముఖం చాటేస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలతో సోమవారం కిరణ్ నిర్వహించిన సమావేశానికి అతి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు! మంత్రుల్లో పితాని సత్యనారాయణ, శైలజానాథ్ మాత్రమే వచ్చారు.
 
 ఎమ్మెల్యేలు గాదె వెంకట్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, వంగా గీత, రౌతు సూర్యప్రకాశ్‌రావు, పంతం గాంధీమోహన్, రామాంజనేయులు, కొర్ల భారతి; నలుగురు ఎమ్మెల్సీలు పాలడుగు వెంకట్రావు, రెడ్డపరెడ్డి, ఇందిర, ల క్ష్మీ శివకుమారి సహా మరో నలుగురు ఇతర నేతలు వచ్చారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రావాలని సమాచారం పంపినా ఇలా అతి కొద్దిమంది మాత్రమే రావడం కిరణ్ సన్నిహితులను విస్మయానికి గురి చేసింది. వచ్చిన నేతలు కూడా కొత్త పార్టీ యోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దాంతో కొత్త సీఎం ఎవరో తేలేదాకా పార్టీ ప్రయత్నాలను వాయిదా వేసుకోవాలన్న భావనకు వచ్చినట్టు చెబుతున్నారు.
 
 పార్టీ పెట్టాలనుకుంటున్నా
 ఒక్కొక్క నేతతో కిరణ్ ముఖాముఖి సమావేశమై కొత్త పార్టీపై అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ‘‘కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నా. నా ఒక్కడి కోసమే కాదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు విభజన విషయంలో హైకమాండ్‌ను వ్యతిరేకించి బయటికొచ్చారు. వారికిప్పుడు ఒక రాజకీయ వేదిక అవసరం. హైకమాండ్ పెద్దలు ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌లోకి తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. మీరేమంటారో, ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి’’ అని కోరారు. కిరణ్ చెప్పిందంతా విన్నాక నేతలు భిన్న స్వరాలు విన్పించారు.
 
 విభజన నిర్ణయం జరిగిపోయినందున ఇక కొత్త పార్టీ అనవసరమని జేసీ, పాలడుగు వంటి నేతలు అభిప్రాయపడ్డారు. పాలడుగైతే, ‘కాంగ్రెస్‌ను బతికించుకోవాల్సి ఉంది. అందుకు అందరం కృషి చేద్దాం’ అని సూచించినట్టు సమాచారం. మరీ తక్కువ సమయమున్నందున పార్టీ పెట్టినా ఆశించిన ఫలితాలు రావని వంగా గీత, పంతం గాంధీ, రామాంజనేయులు తదితరులన్నారు. ‘విభజనకు ముందే మీరు కొత్త పార్టీ పెట్టాల్సింది. ఇప్పుడేం లాభం. ఇంత తక్కువ సమయంలో 175 మంది ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు గట్టి అభ్యర్థులు కావాలి. పార్టీని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లే క్యాడర్ కావాలి. సాధ్యమా?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. తొందరేమీ లేదని, ఆలోచించుకుని చెప్పాలని కిరణ్ సూచించారని, కార్యకర్తలతో మాట్లాడి చెబుతామంటూ నేతలు వెనుదిరిగారని సమాచారం. రౌతు మాత్రం తాను ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తోనే ఉంటానని, ఆయన ఎటు వైపుంటే అటే వెళ్తానని స్పష్టం చేశారు.
 
 పితాని, శైలజానాథ్.. ఆచితూచి
 మంత్రులు శైలజానాథ్, పితాని కూడా కొత్త పార్టీ విషయంలో ఆచితూచి స్పందించారని, అందరి అభిప్రాయాలు విన్నాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారని సమాచారం. భేటీలో వచ్చిన అభిప్రాయాలపై బహిష్కృత కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్‌లతో కూడా కిరణ్ చర్చించారు. కొత్త పార్టీపై తొందర పడాల్సిన పని లేదని, మంగళ, బుధవారాల్లో ఉద్యోగ, యువజన, ప్రజా సంఘాలు, ద్వితీయ శ్రేణి నేతలతోనూ సమావేశం కావాలని యోచిస్తున్నారు.
 
 నన్ను విముక్తుణ్ణి చేయండి
 గవర్నర్ నరసింహన్‌కు కిరణ్ లేఖ?
 ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తనను విముక్తం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసినట్లు సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. సీమాంధ్ర నుంచి కొత్త సీఎం రాబోతున్నట్లు కిరణ్‌కు సమాచారం అందడం... ఈ పరిస్థితుల్లో తానింకా ముఖ్యమంత్రిగా కొనసాగితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా ఆయన ఈ లేఖ రాసినట్లు తెలిసింది. మరోవైపు తిరుపతి లేదా రాజమండ్రిలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసి కొత్తపార్టీ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement