ప్రజలు సహకరిస్తేనే కరోనాను తరిమికొట్టగలం

Ministers Kannababu And Avanthi Srinivas Visit In Containment Zone - Sakshi

మంత్రులు కరుసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: నగరంలోని అక్కయ్యపాలెం కంటైన్మెంట్ జోన్‌ లో అధికారులతో కలిసి మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కలెక్టర్ వినయ్‌ చంద్‌ పర్యటించారు. ప్రజలతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరఫరాపై మంత్రులు ఆరా తీశారు. కంటైన్మెంట్ జోన్‌లో నిత్యావసరాల సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. జిల్లాలోని ఏడు కంటైన్మెంట్‌ జోన్లలోని ఏడున్నర లక్షల జనాభాకి ఇంటికే సరుకులు అందిస్తున్నామని మంత్రులకు అధికారులు వివరించారు.
(జీవితాలు, ఆర్థికం రెండూ ముఖ్యమే: ప్రధాని మోదీ)

మీడియాను ఇబ్బంది పెట్టకూడదు..
ఈ సందర్భంగా మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలను ఇళ్లలోంచి బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఇంటికే సరుకులు అందిస్తున్నామని చెప్పారు. బారికేడ్లు ఏర్పాటు చేసినా అంబులెన్స్‌లు తిరగడానికి‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని పేర్కొన్నారు. కవరేజ్ కోసం వచ్చే మీడియాని‌ ఇబ్బంది పెట్టకూడదని పోలీసులను ఆదేశించామన్నారు. లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు.
(ప్రధాని సూచించే వ్యూహంతో ముందుకు సాగుతాం)

మరోమారు ఇంటింటి సర్వే..
‘‘కరోనా నివారణకు క్షేత్ర స్థాయిలో జిల్లాలో అన్ని విభాగాల అధికారులు బాగా పని చేస్తున్నారు. కేసులు పెరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంపై అధికారులను అభినందిస్తున్నాం. రేషన్ కార్డులు లేని పేదలకి 15 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు సరఫరా చేస్తాం. కంటైన్మెంట్ జోన్ అంటే కర్ఫ్యూ గా భావించొద్దు. ప్రజలు సహకరిస్తేనే కరోనాను తరిమికొట్టగలం. కంటైన్ మెంట్ జోన్ లో గర్భిణీలు ఎంత మంది ఉన్నారో సర్వే చేసి వారికి వైద్య సేవలు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించాం. కంటైన్మెంట్ జోన్ పరిధిలో మరోమారు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని’’ మంత్రులు పేర్కొన్నారు. 

ఇంటింటి సర్వే లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. వారికి పరీక్షలు చేస్తామన్నారు. కంటైన్మెంట్ జోన్ లో ప్రజలకి అందుబాటులో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు ఉంచామని చెప్పారు. ఫోన్ చేసిన వెంటనే వాలంటీర్లు వారికి కావలసిన సరుకులు సరసమైన ధరలకే తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. విశాఖలో ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న నలుగురిని డిశ్చార్జ్ చేశామని.. మరో 16 మంది కోలుకునేందుకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. కరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన  23 బృందాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. కంటైన్మెంట్ జోన్ లో ఇంటింటి సర్వే కోసం ప్రతి వంద మంది కి ఒక బృందం ఏర్పాటు చేశామని మంత్రులు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top