చెన్నైలో ఉండలేక.. సొంతూరికి వెళ్లలేక

Migrant Labours Facing Travelling Problems Over Coronavirus - Sakshi

ఒంగోలు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది వలస కూలీల పరిస్థితి. పని ప్రదేశంలో ఉండే అవకాశం లేక సొంతూరికి వెళ్లే దారి లేక అవస్థలు పడుతున్నారు. రోనా దెబ్బకు సోమవారం 48 మంది ఇతర రాష్ట్రాల వారు పడ్డ అవస్థలు వర్ణణాతీతం. గుజరాత్‌కు చెందిన 36 మంది, రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన 12 గత కొన్నేళ్లుగా చెన్నైలో పెయింటింగ్, స్వీపింగ్, కార్పెంటింగ్‌ వంటి పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో ఉపాధితోపాటు కనీసం నిలువనీడ కూడా లేక వారంతా ఒక లారీ డ్రైవర్‌ను పట్టుకుని నాగపూర్‌ వరకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరు రూ.2వేలు చొప్పున లారీ బాడుగ మాట్లాడుకున్నారు. తీరా తెలంగాణ సరిహద్దు అయిన నల్గొండ వద్దకు వెళ్లగానే తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. (ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించారా? )

మేదరమెట్ల నుంచి ఒంగోలు వైపు జాతీయ రహదారిపై ఎర్రటి ఎండలో కాలినడకన వస్తున్న గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన యువకులు

రాష్ట్రంలోకి అనుమతించేదే లేదంటూ నిలిపివేశారు. దీంతో దిక్కుతోచక తిరిగి చెన్నైకు వెళ్ళడమే ఉత్తమమని భావించి 20 కిలోమీటర్ల దూరం వెనుకకు నడిచి మరో లారీ మాట్లాడుకున్నా రు. నెల్లూరు వరకు రూ.500 చొప్పున చెల్లించేందుకు అంగీకరించారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వరకు రాగానే ముందుకు పోయే అవకాశం లేదంటూ లారీ డ్రైవర్‌ వారిని దింపేశాడు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారని సమాచారం ఉందని పేర్కొనడంతో వారంతా దిగిపోయారు. కనీసం తాము ఎక్కడ ఉన్నామో కూడా తెలియని స్థితిలో గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా తాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించి చెన్నై వైపు నడక సాగించారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రాగా ఒంగోలు సమీపంలో త్రోవగుంట చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న తాలూకా సీఐ యం.లక్ష్మణ్‌ వారిని అడ్డుకొని విచారించారు.

తమ గోడు విన్నవించున్న బాధితుల్లో చాలా మంది నీరసించి ఉండడంతో భోజనం చేశారా అంటూ ప్రశ్నించారు. తినడానికి రొట్టె కూడా దొరకలేదని, ఏదైనా తిని 24 గంటలు దాటిపోయిందని చెప్పడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు సమీపంలోని శ్రీలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ వారితో మాట్లాడి 48 మందికి భోజనం ఏర్పాట్లు చేయించాడు. భౌతిక దూరం పాటించేలా కూర్చోబెట్టి కరోన పరిస్థితుల నేపథ్యంలో క్వారంటైన్‌ హోంలో ఉండాలని సూచించి,  వారందరినీ టంగుటూరు హోంకు తరలించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top