మీనాను కాల్చి చంపేశారు 

Meena was shot and killed - Sakshi

అనారోగ్యంతో ఉన్నా ..జాలి చూపలేదు 

మావోయిస్టు ఏవోబీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి చలపతి  

ఆడియో టేపులు విడుదల

సాక్షి, విశాఖపట్నం: రెండు దశాబ్దాలపాటు ఎన్నో కీలక విప్లవోద్యమాల్లో పాల్గొన్న మావోయిస్టు అగ్రనేత మీనాను పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ ఏవోబీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి కైలాష్‌ అలియాస్‌ చలపతి ధ్వజమెత్తారు. లివిటిపుట్టు ఘటన తర్వాత ఏవోబీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం మావోయిస్టులు మీడియాకు వీడియో టేపులు విడుదల చేశారు. శత్రువులిచ్చిన సమాచారంతో గ్రేహౌండ్స్‌ పోలీసులు 12వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటలకు చుట్టుముట్టి అతి సమీపం నుంచి ఏకధాటిగా రాపిడ్‌ ఫైరింగ్‌ చేశారన్నారు. వారు జరిపిన ఫైరింగ్‌లో తూటాలు తగిలి గాయపడిన మీనాను గ్రేహౌండ్స్‌ పోలీసులు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చారని తెలిపారు. మీనా రెండు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమ జీవితాన్ని గడిపిందన్నారు. ఉత్తర తెలంగాణ వరంగల్‌లో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంతో 1995లో విప్లవోద్యమంలోకి అడుగు పెట్టి.. ఉమ్మడి ఆంధ్రలో సాయుధ పోలీస్‌ బలగాలపై జరిగిన ఎన్నో దాడుల్లో ఆమె పాల్గొన్నారని పేర్కొన్నారు. మహిళలను సమీకరించి మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీ, హింసలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి రెండుసార్లు అరెస్టు అయ్యారన్నారు. ఆమె ఆశయ సాధనకోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.  

కటాఫ్‌ ఏరియాలో కర్ఫ్యూ వాతావరణం 
వారం పది రోజుల నుంచి ఏవోబీలో భయానక వాతావరణం సృష్టించారని, సరిహద్దు పంచాయతీల్లో కర్ఫ్యూ వాతావరణం కల్పించారని ఏవోబీ డివిజన్‌ కార్యదర్శి కైలాష్‌ అలియాస్‌ చలపతి ధ్వజమెత్తారు. లివిటిపుట్టు, ఆండ్రపల్లిలో మహిళలను హింసిస్తున్నారని, చుట్టపు చూపుగా వచ్చిన ముగ్గురు యువతులతోపాటు మరో ఇద్దరు యువకులను పోలీస్‌లు నిర్బంధించారని వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 12వ తేదీ ఎన్‌కౌంటర్‌ అనంతరం అక్రమంగా నిర్బంధించిన వార్ని విడిచిపెట్టమని గ్రామస్తులు అడ్డుకుంటే వారిపై కాల్పులు జరపడమే కాకుండా.. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారన్నారు. తమతో ఎలాంటి సంబంధం లేకుండా అదుపులోకి తీసుకున్న వారిని బేషరతుగా విడిచిపెట్టాలని కైలాష్‌ అలియాస్‌ చలపతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

సాక్షి ముందే చెప్పింది.. 
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మావో నేత మీనా 12వ తేదీన జరిగిన ఎదురు కాల్పుల సమయంలో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించినా.. గ్రేహౌండ్స్‌ దళాలు బలవంతంగా తీసుకెళ్లి ఎన్‌కౌంటర్‌ చేసి ఎదురు కాల్పుల కథ సృష్టించారని ‘సాక్షి’ముందే చెప్పింది. ఘటన జరిగిన మర్నాడే ‘ఎదురుకాల్పులా.. ఎత్తుకు పోయి కాల్చారా?’అనే శీర్షికన ‘సాక్షి ’ప్రధాన సంచికలో సమగ్ర కథనం వెలువడింది. ‘సాక్షి’చెప్పిన విషయాలను చలపతి వీడియో టేపుల్లో ప్రస్తావించడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top