గణితం ఇక సులువే..!

Maths Kits distribution For Schools In West Godavari - Sakshi

ఆదర్శ పాఠశాలల్లో ‘గణిత మిత్ర’లకు శ్రీకారం

జిల్లాలో తొలి విడతలో 134 పాఠశాలల ఎంపిక

నేడు పాఠశాలలకు చేరనున్న ‘గణిత కిట్స్‌’

త్వరలో కిట్స్‌ వినియోగంపై శిక్షణ

పశ్చిమగోదావరి, నిడమర్రు: మనిషి చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. లెక్కగా నడుచుకుంటే ప్రతి విద్యార్థికీ లెక్కలంటే మక్కువ పెరుగుతుంది. లెక్కలు.. ఎక్కాలు.. చిన్నప్పటి నుంచి వింటున్నా.. ఒకటో తరగతి నుంచి బట్టీ పట్టినా చాలా మంది విద్యార్థులకు గణితం అంటే ఎందుకో భయం. ఆ భయమే వారిని ఆ సబ్జెక్టుకు దూరం చేస్తుంది. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో లెక్కల హోమ్‌ వర్క్‌ చేయలేనివారు బడికి పోవడానికి జంకుతారు. ఇలా గణితం అంటే భయపడే విద్యార్థులే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘గణిత మిత్ర’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విద్యాశాఖాధికారులు. జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఈ గణితమిత్రలను ఏర్పాటు చేయాలని ఎస్సీఈఆర్టీ అధికారులు భావించారు. తొలి విడతగా జిల్లాలో రోలు ఎక్కువగా ఉన్న 134 పాఠశాలలను ఎంపిక చేశారు.

సత్ఫలితాలు పొందేందుకే
రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాధన పరీక్ష, రాష్ట్ర స్థాయి సాధన పరీక్షల వంటి వాటిలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు గణిత ప్రక్రియల్లో వెనుకబడి ఉన్నట్టు  గుర్తించారు. ఐదో తరగతి పూర్తి చేసే నాటికి చతుర్విద ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారంలో అవగాహన లేకుండానే 70 శాతం మంది ఆరో తరగతిలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో 50 శాతం కనీసం మూడో తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నట్లు ఆయా మూల్యాంకాల పరిశీలనలో తేలింది. ఇలాంటి వారికోసం సరళంగా సులభంగా, ఆసక్తికరంగా గణిత పాఠాలు నేర్చుకోవడానికి అవసరమైన బోధనోపకరణాలు అందిస్తే సత్ఫలితాలు పొందవచ్చని విద్యాశాఖ అధికారులు భావించారు. ఈ ఆలోచనల నుండే పుట్టుకొచ్చింది ‘గణితమిత్ర’ కార్యక్రమం.

గణిత కిట్స్‌తో బోధన
ఉపాధ్యాయులు చెప్పడం, విద్యార్థులు వినడం ద్వారా 26 శాతం, చూడటం ద్వారా నేర్చుకునేది 78 శాతం గుర్తుంటుందని సైకాలజీ నిపుణులు హెబ్బింగ్‌ హౌస్‌ తెలిపారు. ఆయన చెప్పిన అక్షర సత్యాన్ని నిజం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఆర్టీ అ«ధ్వర్యంలో ఈ గణితమిత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని అమలుకు రూపొందిం చిన గణిత కిట్స్‌ సోమవారం జిల్లా ఎస్‌ఎస్‌ఏ కార్యాలయానకి చేరుకున్నాయి. వీటిని ఒకటి రెండు రోజుల్లో ఎంపిక చేసిన పాఠశాలలకు సరఫ రా చేయనున్నారు. ఈ కిట్స్‌ వినియోగంపై ఆయా పాఠశాలల్లో ఎంపిక చేసిన టీచర్‌కు శిక్షణ ఇస్తారు.

జిల్లాలో 134 పాఠశాలల ఎంపిక
జిల్లాలో 334 ఆదర్శపాఠశాలు ఉన్నాయి. వీటిలో 134 పాఠశాలలను ఈ గణిత మిత్ర కార్యక్రమానికి తొలి విడత ఎంపిక చేశారు. గణిత కిట్లను పంపిణీ చేసి, వాటి వినియోగం ద్వారా స్పందనను ఫలితాల ఆధారంగా మిగిలిన పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖాధికారులు నిర్ణయించారు.

అభ్యసన సామగ్రి
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గణితంలోని బోధనాభ్యసన కృత్యాలు, పూసల చట్రం, అబాకస్, ఎక్కాలు సులభంగా నేర్పడానికి, గుణిజాలు తెలపడానికి అభ్యసన సామగ్రి ఉంటుంది. వివిధ ఆకారాలు, కాలం, పొడవు, బరువులకు సంబంధించిన ప్రక్రియలను సులభంగా అవగాహన చేసుకోవడానికి కృత్యాలు ఉంటాయి. కారణాంకాలు, గుణిజాలు, సౌష్టవాలు, కొలజాడి, లీటర్లు, మిల్లీ మీటర్లు పాత్రలు తదితర సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు అభ్యసన సామగ్రి ఉంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top