గైనిక్‌కు పురిటి నొప్పులు

Maternity Assistance Shortage In Labour Ward Ananthapur - Sakshi

మెటర్నిటీ అసిస్టెంట్ల కొరత  

మాతా శిశు మరణాల నివారణకు కృషి చేస్తామంటూ పాలకులు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. లక్ష్యాలను అధిగమించడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. సర్వజనాస్పత్రిలో నెలకు 900 ప్రసవాలు జరిగే విభాగానికి పట్టుమని పది మంది మెటర్నిటీ అసిస్టెంట్లను ఏర్పాటు చేయలేదు.  

అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో గైనిక్‌ సేవలు మృగ్యంగా మారాయి. గైనిక్‌ విభాగానికి కొన్నేళ్లుగా మెటర్నిటీ అసిస్టెంట్ల (ఏఎన్‌ఎం) కొరత పట్టిపీడిస్తోంది. దీంతో గర్భిణులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసిస్టెంట్ల పని సైతం తామే చేయాల్సి వస్తోందని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం కలెక్టర్‌ వీరపాండియన్‌ అధ్యక్షతన ఆస్పత్రిలో జరిగిన హెచ్‌డీఎస్‌ సమావేశంలో మెటర్నిటీ అసిస్టెంట్లను ఆరోగ్యశాఖ నుంచి డెప్యూట్‌ చేసుకోవాలని మినిట్స్‌లో పొందుపర్చారు. కానీ ఇంత వరకు సిబ్బందిని నియమించిన దాఖలాలు లేవు. 

ముగ్గురే మిగిలారు..
కాన్పుల (లేబర్‌) వార్డులో ముగ్గురు మెటర్నిటీ అసిస్టెంట్లు సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరంలో 11 మంది మెటర్నిటీ అసిస్టెంట్లను తీసుకున్నారు. అందులో ముగ్గురు మినహా మిగతా వారంతా ఉద్యోగ విరమణ చేశారు. ఇంత వరకు మెటర్నిటీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయలేదు. లేబర్‌వార్డులో రోజూ 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 7 సిజేరియన్లు, 20 నుంచి 23 సాధారణ ప్రసవాలు జరుగుతాయి. సాధారణ ప్రసవాలు జరిగే సమయంలో మెటర్నిటీ అసిస్టెంట్లు తప్పనిసరి. వైద్యులకు సహాయకులుగా వారుండాలి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి కన్పించడం లేదు. ఆస్పత్రిలోని గైనిక్‌ విభాగంలో పతి ఒత్తిడితో పాటు మెటర్నిటీ అసిస్టెంట్ల కొరత పెద్ద సమస్యగా మారింది.  

వందల సంఖ్యలో ఏఎన్‌ఎం పోస్టుల ఖాళీ
వైద్య ఆరోగ్యశాఖలో 828 మంది ఏఎన్‌ఎంలు ఉన్నారు. 498 మంది రెగ్యులర్‌ పోస్టులుండగా అందులో 140 ఖాళీలున్నాయి. అలాగే 586 కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలలో 110 మంది ఖాళీలున్నాయి. పీహెచ్‌సీ, మదర్‌ పీహెచ్‌సీల్లో ప్రసవాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అక్కడి మెటర్నిటీ అసిస్టెంట్లను మూడు నెలలకోసారి డెప్యూట్‌ చేస్తే బాగుంటుందని గైనిక్‌ వైద్యులు కోరుతున్నారు. ఆరోగ్యశాఖ మాత్రం సిబ్బంది కొరతను చూపి పట్టించుకోవడం లేదు. అందరి సమన్వయంతోనే మాతాశిశు మరణాల నియంత్రణ సాధ్యపడుతుందని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు.  

డెప్యూట్‌ చేసే ప్రసక్తే లేదు  
పీహెచ్‌సీల్లో 240 ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇన్ని ఖాళీలు పెట్టుకుని ఆస్పత్రికి ఏవిధంగా డెప్యూట్‌ చేయాలి. కలెక్టర్‌ నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలూ లేవు. హెచ్‌డీఎస్‌లో మినిట్స్‌లో మెటర్నిటీ అసిస్టెంట్లు కావాలని నమోదు చేశారు.  – డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్, డీఎంహెచ్‌ఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top