గంజాయి గుబులు | Marijuana,Firearms smugglling are caught | Sakshi
Sakshi News home page

గంజాయి గుబులు

May 4 2015 4:48 AM | Updated on Jul 11 2019 8:44 PM

గమ్మత్తుగా తరలించే గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నారు...

- మారణాయుధాలతో రవాణా
- రెండు పిస్తోళ్లు, 28 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న రావికమతం పోలీసులు
- ఉలిక్కిపడిన పోలీసు, ఎక్సైజ్ శాఖలు
 చోడవరం:
గమ్మత్తుగా తరలించే గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నారు. మారణాయుధాలతో రవాణా చేస్తున్నారు. అంటే వీరు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు అంటేనే గంజాయి సాగు, రవాణాకు పెట్టింది పేరు. ఇక్కడ అతి విలువైన శీలావతిరకం పండిస్తున్నారు. దీనికి  బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో మంచి గిరాకీ. ఒకప్పుడు కిలో రూ. వెయ్యి నుంచి రూ. 2వేలు ఉండేది. ఇప్పుడు రూ. 8 నుంచి రూ.10వేలు పలుకుతోంది. ఇప్పటి వరకు సాదా, సీదాగా గుట్టుచప్పుడు కాకుండా తరలించే స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా మారణాయుధాలతో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.

రోలుగుంట మండల శివారు ఏజెన్సీ గ్రామాల్లో శనివారం రాత్రి కొత్తకోట పోలీసులకు పట్టుబడిన గంజాయి ముఠావద్ద మారణాయుధాలు ఉండడం ఇందుకు తార్కాణం. రూ.42లక్షలు విలువైన 420 కిలోల గంజాయి, రెండు పిస్తోళ్లు, 28 బుల్లెట్లు దొరకడం ఇటు పోలీసు, అటు ఎక్సైజ్  వర్గాల్లో తీవ్ర సంచలనమైంది. కొన్నేళ్లుగా గంజాయి రవాణాకు జిల్లా అడ్డాగా మారింది. రోజూ రూ.లక్షల విలువైన సరకు రోడ్డు, రైలు మార్గాల్లో తరలిపోతోంది. రావికమతం, రోలుగుంట, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, దేవరాపల్లి,చీడికాడతోపాటు మరి కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రూ. కోట్లు విలువైన గంజాయి పట్టుబడింది. రోలుగుంట, మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, దేవరాపల్లి, కె.కోటపాడు,చీడికాడ, నాతవరం మండలాల్లోని కొన్ని గ్రామాలు కేవలం గంజాయి అమ్మకాలకు చిరునామాగా మారాయి.

పోలీసు, ఎక్సైజ్ అధికారుల రికార్డులే దీనిని ధ్రువీకరిస్తున్నాయి. మన్యంలోని చింతపల్లి, పాడేరు ప్రాంతాలకు ప్రధాన రహదారులుగా ఉన్న వయా రోలుగుంట,  మాడుగుల వయా చోడవరం, నర్సీపట్నం వయా తాళ్లపాలెం దారుల్లో దీని రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. వీటితోపాటు కోటవురట్ల వయా అడ్డురోడ్డు, కొత్తవలస మీదుగా విశాఖపట్నం రూట్లలోనూ తరలిస్తున్నారు. ఏడా రూ. వంద కోట్లకు పైబడి విలువైన గంజాయిని ఎక్సైజ్, పోలీసు అధికారులు పట్టుకుంటున్నారు.

అంటే ఈ వ్యాపారం రూ.వేల కోట్లలో సాగుతున్నదని అవగతమవుతోంది. కొన్ని స్టేషన్లలో ఖైదీలు ఉండాల్సిన కటకటాలు గంజాయి బస్తాలతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు మరణాయుధాలతో గంజాయి స్మగ్లర్లు పట్టుబడిన దాఖలాలు లేవు. ఇప్పుడు పిస్తోళ్లు పట్టుకుని మరీ రవాణా చేయడం అందరినీ కలవర పెడుతోంది. గంజాయి అంటే టేకిట్‌ఈజీగా తీసుకునే ఎక్సైజ్,పోలీసు అధికారులు ఇప్పుడు ఈ సంఘటనతో ఎలా స్పదిస్తారో వేచిచూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement