
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై బ్రెయిన్ డెడ్‌కు గురైన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. తమ కొడుకు కళ్లెదుట లేకున్నా.. మరో నలుగురిలో సజీవంగా ఉండాలన్న ఆశయంతో అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా యనమలకుదురు కట్ట ప్రాంతంలో నివసించే సంభాన దుర్గాప్రసాద్ (23) ప్రయివేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ నెల 21న ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స కోసం కానూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు దుర్గాప్రసాద్‌ను పరీక్షించి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఎంత ఖరీదైన వైద్యం చేసినా ఫలితం ఉండదని, అవయవదానం చేస్తే మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని కుటుంబీకులకు వివరించారు. కొడుకు చనిపోతున్నాడనే బాధలోనూ తల్లిదండ్రులు మంచి ఆశయంతో అవయవదానానికి సమ్మతించారు.
‘సన్‌రైజ్’లో అవయవాల సేకరణ
బ్రెయిన్‌డెడ్‌కు గురైన యువకుడిని జీవన్‌దాన్ అనుమతి ఉన్న సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరోసారి న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్‌ల బృందం పరిశీలించి బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించిన అనంతరం అవయవాలను సేకరించారు. గుండెను చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి, కిడ్నీలు సన్‌రైజ్, ఆయుష్ ఆస్పత్రులకు, లివర్‌ను ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. గుండెను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా గన్నవరం, అక్కడి నుంచి విమానంలో చెన్నైకి తరలించారు. పోలీసులు అంబులెన్స్‌కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయడంతో సన్‌రైజ్ ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి 19 నిమిషాల్లోనే చేరుకుంది. పోలీసులకి సన్‌రైజ్ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఎం.నరేంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.