తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని శాసనమండలి మాజీ చీఫ్ విప్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి
కొరిటెపాడు(గుంటూరు): తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని శాసనమండలి మాజీ చీఫ్ విప్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు. స్థానిక నవభారత్ నగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే వాహనాలపై పన్నులు విధించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు పన్నులు కట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో 10 సంవత్సరాలు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా తేల్చారని, ఈ 10 ఏళ్లు కూడా ఆగలేరా అని ప్రశ్నించారు. ఇదే విధంగా చూస్తూ ఊరుకుంటే రేపు సచివాలయం, అసెంబ్లీకి కూడా పన్నులు కట్టాలని తెలంగాణ ప్రభుత్వం అదేశిస్తుందన్నారు. ఈ ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
శాసనమండలి చీఫ్ విఫ్ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగిసిందని ఆమె తెలిపారు. ఇకనుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని స్పష్టం చేశారు. నన్నపనేని రాజకుమారి చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు, ములకా సత్యవాణిరెడ్డి, చిట్టాబత్తిన చిట్టిబాబు, చంద్రగిరి ఏడుకొండలు, పోతురాజు ఉమాదేవి, నల్లపనేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.