కీలక పోస్టులు ఖాళీ..!

Main Posts Are Still In Pending - Sakshi

కొత్త జేసీని నియమించని ప్రభుత్వం

ఏసీబీ దాడుల నేపథ్యంలో ఖాళీ కానున్న జేసీ–2 

ఈ నెలాఖరున డీఆర్వో రిటైర్‌మెంట్‌

విజయనగరం గంటస్తంభం : జిల్లాలో ఒకేసారి కీలక అధికారుల పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్‌ తర్వాత స్థానంలో ఉన్న జేసీ పోస్టు ఖాళీగా ఉండగా వేర్వేరు కారణాలు రీత్యా ఆ తర్వాత కేడరు పోస్టులు జేసీ–2, డీఆర్వో పోస్టులు ఖాళీ ఏర్పడనున్నాయి. ఆయా పోస్టులు వెంటవెంటనే భర్తీ చేయకుంటే పాలన గాడి తప్పుతుందన్న ఆందోళన జిల్లా ప్రజల్లో కనిపిస్తోంది. 

పోస్టులు ఖాళీ అవుతున్నా... 
జిల్లా పరిపాలనా కేంద్రానికి కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారు. తర్వాత స్థానంలో సంయుక్త కలెక్టర్‌(జేసీ) ఉంటారు. కలెక్టర్‌ తర్వాత దాదాపు అన్ని వ్యవహారాలు జేసీ చక్కబెట్టాలి. రెవెన్యూ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ వంటి కీలక వ్యవహారాలు ఆయనే చూడాలి. అయితే, జిల్లా జేసీగా పనిచేసిన శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ చేసి నెలరోజులవుతున్నా ఆ పోస్టులో కొత్తగా ఎవరినీ నియమించ లేదు. దీంతో కలెక్టరపై అదనపు భారం పడింది.

దీంతో జేసీ బాధ్యతలను జేసీ–2 కె.నాగేశ్వరరావుకు ఆయన అప్పగించారు. కలెక్టర్‌ తర్వాత జేసీ–2 కీలకం కావడంతో ఆయనే దాదాపు అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడడం, కోర్టులో హాజరు పరచడం, రిమాండ్‌కు తరలించడంతో ఆ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేలడంతో ఆయన సస్పెన్షన్‌ దాదాపు ఖాయం. ఈ వ్యవహారాన్ని కలెక్టరు వివేక్‌యాదవ్‌ ప్రభుత్వానికి నివేదించారు. నేడే రేపో ఆయనను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆ పోస్టు ఖాళీ కానుంది.

ఆ స్థానంలో ప్రభుత్వం వెంటనే ఎవరినో ఒకరిని నియమించకపోతే రెండు కీలక పోస్టులు ఖాళీ అవుతాయి. దీంతో జేసీ, జేసీ–2 బాధ్యతలు కలెక్టర్‌పైనే పడ్డాయి. దీంతో జేసీ–2గా ఇన్‌చార్జి బాధ్యతలు డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావుకు అప్పగించారు. మరోవైపు ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న సివిల్‌ సర్వీసెస్‌ సదస్సుకు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా వెళ్తారోలేదో తెలియని పరిస్థితి. తక్షణమే జేసీ, జేసీ–2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. 

డీఆర్వో రిటైర్‌మెంట్‌తో మరో సమస్య..
ఈ పరిస్థితుల్లో జిల్లా రెవెన్యూ  అధికారి(డీఆర్వో) పోస్టులో ఎవరో ఒకరు ఉంటే పాలన కొంతవరకైనా నెట్టుకు రావచ్చు. ఈ పోస్టు కూడా ఖాళీకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న డీఆర్వో ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌ ఈనెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ రోజు నాటికి ఎవరినో ఒకరిని ఆపోస్టులు నియామకం చేస్తే సమస్య ఉండదు. అయితే, పోస్టుల భర్తీలో తాత్సారం జరుగుతుండడంతో డీఆర్వో పోస్టును కూడా వెంటనే భర్తీ చేస్తారన్న నమ్మకం జిల్లా వాసులకు కలగడంలేదు. జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు పోస్టుల భర్తీపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, ప్రభుత్వం కూడా జిల్లా గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top