గండంలో చిక్కిన వేళ.. సరికొత్త అండ | M.S swaminathan research foundation developed software for fishermen | Sakshi
Sakshi News home page

గండంలో చిక్కిన వేళ.. సరికొత్త అండ

Dec 11 2013 1:00 AM | Updated on Sep 2 2017 1:27 AM

నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించే మత్స్యకారుల కోసం ఎంఎస్ స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగించే మత్స్యకారుల కోసం ఎంఎస్ స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండే మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండే ఈ పరిజ్ఞానం మత్స్యకారులకు ఎంతో మేలు చేయనుంది. మన జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ పరిజ్ఞానం తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులకు అందుబాటులోకి వచ్చింది. స్వామినాధన్ ఫౌండేషన్ 2009లోనే జీపీఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ఉపయోగించుకొని మత్స్యకారులకు ఉపయోగపడేలా ఈ సాఫ్ట్‌వేర్ రూపొందిం చారు. క్యూల్‌కామ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లతో కలిసి ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ ఈ ఫిషర్ ఫ్రెండ్ మొబైల్ అప్లికేషన్ (ఎఫ్‌ఎఫ్‌ఎంఎ) అభివృద్ధి చేశారు. ఈ అధునాతన సాఫ్ట్‌వేర్‌ను మత్స్యకారులకు ఉచితంగా అప్‌లోడ్ చేస్తారు.
 ‘మత్స్యకార స్నేహిత మొబైల్’ (మత్స్యకార మిత్రుడి మొబైల్ అప్లికేషన్స్) పేరిట రూపొందించిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. జిల్లాలోని మత్స్యకారులందరికీ సబ్సిడీపై ఈ అప్లికేషన్లతో కూడిన ఆధునిక మొబైల్ సెట్లను అందించేందుకు సహకరిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ర్ట మత్స్యశాఖ కమిషనర్‌కు ప్రతిపాదన పంపుతామన్నారు.

మత్స్యకారులకు మరింత ప్రయోజనం కలిగేవిధంగా ఏదైనా ప్రాజెక్టు రూపొందిస్తే రూ.10 లక్షలు విడుదల చేస్తానని ప్రకటించారు. స్వామినాధన్ ఫౌండేషన్ డెరైక్టర్ నాన్సీ జే.అనేబుల్ మాట్లాడుతూ, ఆంగ్లంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్.వెల్‌విజి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆర్.రామసుబ్రహ్మణ్యన్, ఆత్మ పీడీ కె.సీతారామరాజు, జేడీ విజయ్‌కుమార్, ఇన్‌కాయిస్ సైంటిస్ట్ నాగరాజకుమార్, ఆత్మ డీపీడీ అంజలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement