బెజవాడలో లగ్జరీ కార్లు రయ్‌...రయ్‌

Luxury Car Makers Shift To Andhra Pradesh  - Sakshi

అమరావతిపై లగ్జరీ కార్ల కంపెనీల దృష్టి

గతేడాది 600పైగా లగ్జరీ కార్ల అమ్మకాలు

మెర్సిడెస్‌ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూలదే అత్యధిక వాటా

ఈ ఏడాది భారీ వృద్ధి సాధించడమే లక్ష్యం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లగ్జరీ కార్లు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కార్ల కంపెనీల దృష్టి రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా ఆయా కంపెనీలు గుంటూరు, విజయవాడ, మంగళగిరి, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. మెర్సిడెస్‌ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, జాగ్వార్, లాండ్‌ రోవర్, ఫోక్స్‌వ్యాగన్‌ వంటి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్స్‌ ఇప్పటికే రాష్ట్రంలో షోరూంలు ఏర్పాటు చేశాయి. గత నవంబర్‌లో జాగ్వార్, లాండ్‌ రోవర్‌ మంగళగిరి సమీపంలో షోరూమ్‌లు ఏర్పాటు చేయగా, త్వరలో విజయవాడ సమీపంలో ఆడీ మరోషోరూమ్‌ను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆడీ మోటార్స్‌కు విశాఖపట్నంలో షోరూమ్‌ ఉంది. ఇవికాకుండా మరికొన్ని లగ్జరీ బ్రాండ్‌లు షోరూమ్‌లు ఏర్పాటు చేయడానికి మార్కెట్‌ సర్వే చేస్తున్నాయి.

గణనీయంగా అమ్మకాలు: రాష్ట్రంలో ఏటా లగ్జరీ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత లగ్జరీ కార్లవైపు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లగ్జరీ కార్ల అమ్మకాల్లో 15 శాతం నుంచి 16 శాతం వృద్ధి ఉండగా రాష్ట్రంలో 20 నుంచి 30 శాతం వరకు వృద్ధి నమోదవుతోందని డీలర్లు అంటున్నారు. గతేడాది రాష్ట్రంలో అన్ని లగ్జరీ కార్లు కలిపి సుమారు 600కు పైగా అమ్ముడయ్యాయి. వీటిలో అత్యధిక వాటా మెర్సిడెస్‌ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్లదే. గతేడాది రాష్ట్రంలో 200 మెర్సిడెస్‌ బెంజ్, 160 ఆడీ, 131 బీఎండబ్ల్యూ కార్లు అమ్ముడైనట్లు ఆయా డీలర్లు ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది చివరలో ప్రవేశించిన జాగ్వార్, లాండ్‌ రోవర్‌కు కూడా స్పందన బాగానే ఉన్నట్టు లక్ష్మీ అనికా మోటార్స్‌ ఎండీ కె.జయరామ్‌ చెప్పారు.

ఈ ఏడాది అమ్మకాలు మరింత పెంచడమే లక్ష్యం: పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా కార్ల అమ్మకాలు  కొద్దిగా తగ్గాయని కార్ల కంపెనీల డీలర్లు అంటున్నారు.  ఎన్నికల ఏడాది కావడంతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది రాష్ట్రంలో 400 బెంజ్‌ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా లక్ష్యంలో సగం మాత్రమే చేరుకున్నట్లు మహావీర్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ చైర్మన్‌ యశ్వంత్‌ జబక్‌ తెలిపారు.  గతేడాది 160 ఆడీ కార్లు, 131 బీఎండబ్ల్యూ కార్లను అమ్మినట్లు బీఎండబ్ల్యూ ప్రతినిధి రవికిరణ్‌ రెడ్డి పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top