జిల్లాలో గురువారం నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు.
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో గురువారం నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 287 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 60,926 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రెగ్యులర్ విద్యార్థులు 56,179 మంది, ప్రైవేటుగా 4,747 మంది ఉన్నారు. వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో మంచినీటిని అందుబాటులో ఉంచారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.
విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవడం ద్వారా చివరి నిమిషంలో ఆలస్యంగా వచ్చి ఆందోళన చెందే పరిస్థితిని అధిగమించవచ్చని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభిస్తారు. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. పరీక్షకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. గుంటూరు బ్రాడీపేటలోని బీహెచ్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను గుంటూరు డీవైఈవో పి. రమేష్ బుధవారం పరిశీలించారు.