నేనూ ప్రేమికుడినే.. | Love '.. A wonderful feeling | Sakshi
Sakshi News home page

నేనూ ప్రేమికుడినే..

Feb 14 2014 2:31 AM | Updated on Apr 4 2019 3:41 PM

‘ప్రేమ.. ఒక అద్భుతమైన భావన. అదో అందమైన అనుభూతి. కొంటెచూపుల గాయాలు...తీపి కలల గేయాలు.. నలుగురిలో ఉన్నా ఒంటరితనం.

‘ప్రేమ.. ఒక అద్భుతమైన భావన. అదో అందమైన అనుభూతి. కొంటెచూపుల గాయాలు...తీపి కలల గేయాలు.. నలుగురిలో ఉన్నా ఒంటరితనం. నవ్వుల బాణాల తుంటరితనం’... ప్రేమలో పడిన వారికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. నిజానికి ప్రేమను అనుభూతించని మనిషి ఉండడు. అసలు ప్రేమలేని ప్రపంచాన్ని ఊహించలేం. ప్రేమకు కులమతాల గోడలు అడ్డురావని కొందరు నిరూపిస్తే.. ప్రేమకు ఎల్లలే లేవని చాటిచెప్పేవారు మరికొందరు. కష్టాలొచ్చినా.. కన్నీళ్లొచ్చినా ఎదురొడ్డి నిలిచేందుకు.. ధైర్యంగా పోరాడేందుకు స్ఫూర్తినిచ్చేది ప్రేమేనని ఇంకొందరు. తొలిచూపులో పుట్టేది ఒక్కటే ప్రేమకాదని.. అది జీవితాంతం నిలిస్తేనే అసలైన ప్రేమని.. పలువురు ప్రేమను నిర్వచిస్తున్నారు.
 
 కడప కల్చరల్, న్యూస్‌లైన్: ప్రేమించి పెళ్లి చేసుకోవడం సాధారణం. కానీ పెళ్లయ్యాక ఆ ప్రేమను నిలుపుకోవడమే గొప్ప విషయమంటారు పెద్దలు. జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమా, పెళ్లయ్యాక భార్య ప్రేమ, పండు వయసులో పిల్లల ప్రేమను కూడా గమనించమని, గౌరవించమని సూచిస్తున్నారు. సుఖ సంతోషాలే కాదని, కష్టాలు కన్నీళ్లకు చెదరక నిలిచేదే నిజమైన ప్రేమని అంటున్నారు. ప్రేమమయ జీవితాలలో ప్రేమకు ఎనలేని గౌరవం కల్పించిన వారి గుర్తించి క్లుప్తంగా....
 
 ఒకరికి ఒకరై....
 పద్మ, హఫీజ్‌లది ప్రేమ వివాహం. అతను ఆర్మీ నుంచి వచ్చాక ప్రైవేటు ఉద్యోగం చేశాక అదే వీధిలోని ఆమె పరి చయం అయింది. చాలా ఏళ్లు ఒకరినొకరు అవగాహన చేసుకున్నాక కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని తెలిసి కూడా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలకు చెప్పారు. ఆమె నాన్న అభ్యంతరం చెప్పినా అన్నలు, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహాంతో రిజిష్టర్ వివాహం చేసుకున్నారు. తర్వాత భర్త మత సాంప్రదాయాల ప్రకారం ‘నిఖా’ చేసుకున్నారు. బదిలీపై హఫీజ్ అప్పటికే వేరే ఊరికి వెళ్లారు. పెళ్లాయ్యాక అక్కడే కాపురం పెట్టారు.
 
 తర్వాత ఆమె నాన్న కూడా ఆదరించడంతో ఒకరి కుటుంబాలను మరొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరుగా జీవించారు. అతను ఉద్యోగం చేస్తూ శ్రీమతిని విద్యాపరంగా ప్రోత్సహించాడు. బీఈడీ పూర్తి చేయించాడు. ఆమె కూడా ప్రైవేటు సంస్థలో చేరి భర్తకు ఆర్థికంగా తోడుగా నిలిచింది. ఇద్దరి కృషి ఫలితంగా ఆమెకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం లభించింది. 26 ఏళ్లుగా ఒకరికొకరు అన్నట్లుగా వారి జీవితం సాగుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా, ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే. అంతేకాదు ఇద్దరూ వీలున్నప్పుడు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
 
 ఆ కుటుంబం సర్వమత సమ్మేళనం
 ప్రొద్దుటూరు:  మావనహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కాకమాని జయ శ్రీ, అఖతాబ్ బాషా కుటుంబం ప్రేమకు మతాలు, ఎల్లలూ అడ్డురావని నిరూపిస్తోంది.      
 మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కాకమాని జయశ్రీ, పట్టణానికి చెందిన అఖ్‌తాబ్‌బాషాను 1981 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్యవైశ్యులలో ప్రముఖ వ్యాపారిగా ఉన్న సోడా బంగారయ్య కుమార్తె అయిన జయశ్రీ స్థానిక ఆర్ట్స్ కళాశాలలో చదువుతూ తన సీనియర్ ముస్లిం కుటుంబానికి చెందిన అఖ్‌తాబ్ బాషాతో స్నేహం ఏర్పడింది.
 
 కాలక్రమంలో అది ప్రేమగా మారి  వివాహానికి దారితీసింది. కుల ప్రభావం పడకూడదనే లక్ష్యంతో తమ కుమారుడు అనోష్‌రాజ్‌కు ఎక్కడా ఇంటి పేరు కానీ, కులం పేరుకానీ ప్రస్తావించలేదు. అనోష్‌రాజ్ పాఠశాల రికార్డుల్లో ఇంటి పేరు, కులం పేరు లేదు. ఇండియన్     అనే రాయడం విశేషం.
 
 అమెరికా అమ్మాయితో.. అనోష్‌రాజ్ నాలుగేళ్ల ఎంఎస్ కోర్సును అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో లా చదువుతున్న ఎమిస్టార్ మార్గేన్ స్టన్‌తో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఒకరినొకరు ఇష్టపడిన వీరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అనోష్‌రాజ్ గుగూల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా ఎమిస్టార్ లా ప్రాక్టీస్ చేస్తోంది.
 
 ప్రేమ పొదరిల్లు..
 నందలూరు: ప్రేమ వివాహానికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలేకానీ.. కులాలు, మతాలు అడ్డుగోడలుగా నిలవవని అంటున్నారు నాగిరెడ్డిపల్లె గ్రామపంచాయతీకి చెందిన నాయనపల్లి రవికుమార్. ‘ 1983లో నెల్లూరులో డిగ్రి చదివే సమయంలో వెంకట అనంత లక్ష్మి (భార్య) ఒక సంవత్సరము జూనియర్‌గా ఉండేది.  ఆమెతో పరిచయం ఏర్పడి చివరికి అది ప్రేమగా మారింది. 1985లో వివాహం చేసుకున్నాం. ప్రస్తుత కడప సెంట్రల్ జైలులో హెడ్ వార్డన్‌గా పనిచేస్తున్నా.మా ఇద్దరు కొడుకులైన అవినాష్ జయసింహా, అనుదీప్ జయసింహాలకు వారు నచ్చిన అమ్మాయిలు కులాలు వేరైనా వారికే ఇచ్చి పెళ్లి చేసినా.     
- రవికుమార్,
 
 ‘అల్లుకున్న’ ప్రేమ బంధం...
 అంధుడైన తన భర్త సుబ్బయ్యకు చేయిపట్టి నడిపిస్తున్న ఈమె పేరు ఉత్తమ్మ. రాజంపేట పట్టణానికి చెందిన జక్కా సుబ్బయ్యకు మూడేళ్ల వయసులో కళ్లుపోయాయి. అప్పటి నుంచి తల్లి సంరక్షణలో పెరిగాడు. సుబ్బయ్య తన 20వ ఏట వైరు మంచాలు, కుర్చీల అల్లికలు నేర్చుకునేందుకు అనంతపురంలోని ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. అక్కడే శిక్షణ నేర్చుకునేందుకు వచ్చిన ఉత్తమ్మను తొలి పలకరింపులోనే మనసుపడ్డాడు. శిక్షణా కాలం పూర్తవుతున్న దశలో సుబ్బన్న తన మనసులోని ప్రేమ భావాన్ని ఉత్తమ్మ వద్ద వ్యక్తం చేయడమేగాక..వివాహం చేసుకుంటే ఎలా చూసుకుంటాననేది సవివరంగా చెప్పాడు. సుబ్బయ్యలోని నిజాయితీ ముందు అంధత్వం చిన్నబోయింది. వారిద్దరి మధ్య ప్రేమ బంధం అల్లుకుపోయింది. అందరిలాగే ఉత్తమ్మ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను నిరాకరించారు.
 
 అయినా ఆమె వారిని ఎదిరించి దేవునికడపలోని శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సుబ్బయ్యను వివాహం చేసుకుంది. సుబ్బయ్య తల్లి బతికున్నంత వరకు కుండలు విక్రయించే వ్యాపారం చేసుకొని జీవించిన వీరు...ఇప్పుడు యాచన చేసుకుంటూ బతుకుబండిని సంతోషంగా సాగిస్తున్నారు.‘ప్రేమకు మేం పేదలంకాం’ అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.    
 -న్యూస్‌లైన్, రాజంపేట టౌన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement